Precautions
-
ఇలా చేస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు!
వర్షాకాలంలో తరచూ పిడుగులు పడి మనుషులూ, పశువులూ చనిపోవడం తెలిసిందే. నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు. వర్షం రాగానే చెట్ల కిందికి పరుగెత్తకూడదు. ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం. చెట్లు, స్తంభాల కిందకు వెళ్లకుండా ఇళ్లకు, సురక్షిత భవనాలకు చేరుకోవాలి. కారులో ఉంటే అందులో కూర్చొని, కిటికీ అద్దాలు మూసివేయాలి. చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి. లోహపు తలుపులను తాకరాదు. ఇంటిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. విద్యుత్ పరికరాలను ఆపేయాలి. ఛార్జింగ్ చేస్తున్న ఫోన్ తాకకూడదు. కాంక్రీటు గోడలను, నేలను తాకకూడదు. బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉండకూడదు. నల్లా నీటిని తాకరాదు. తాము నిలబడిన భూమి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే దగ్గరలో పిడుగు పడితే విద్యుత్ఘాతానికి గురి కావచ్చు.చర్మంపై గుచ్చినట్లున్నా, వెంట్రుకలు నిక్క బొడిచినా వెంటనే పిడుగు పడబోతోందని అర్థం (ఈ సూచికలు గుర్తించే అవకాశం ప్రతిసారీ ఉండక పోవచ్చు). పొలాల్లో ఉన్నప్పుడు కాలి మునివేళ్ళ పైన తల వంచి, చెవులు మూసుకొని కూర్చోవడం ఒక మార్గం. ఇందువల్ల నేరుగా పిడుగు పడే అవకాశాలు తగ్గుతాయి. రెండు కాలి మడమలు ‘V’ ఆకారంలో వెనక తాకి ఉండాలి. ఇందువల్ల భూమిపై పిడుగు పడితే ఒక కాలిలోకి ప్రవేశించిన విద్యుత్ మరో కాలిలోంచి భూమిలోకి త్వరగా వెళ్ళిపోతుంది. అడవిలో ఉంటే గుంపుగా ఉన్న చిన్న చెట్ల కింద ఉండవచ్చు. అప్పటికే కొండపై ఉంటే ఏదేని గుహ కనిపిస్తే వెళ్ళవచ్చు. తాటి చెట్లు ఎత్తుగా, తడిగా ఉండటం వల్ల సహజంగా పిడుగులను ఆకర్షించి భూమిలోకి విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇంటిలో ఉండడం క్షేమమే, అయినా పక్కనే పెద్ద చెట్టు ఉంటే ఏమి జరుగుతుందో సూర్యారావుపాలెం పిడుగుపాటు చెబుతోంది. చెట్టుకు దగ్గరలో ఎండు కర్రలు, దహనశీల పదార్థాలు ఉంటే అగ్ని తీవ్రత పెరుగుతుంది. కానీ అసలు చెట్లే లేకపోతే మైదాన ప్రాంతంలో కూడా పిడుగు పడుతుంది. కనుక గ్రామాల్లో చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండేట్లు పై కొమ్మలు తొలగిస్తే ప్రమాదావకాశాలు కొంత తగ్గుతాయి. మైదాన ప్రాంతంలో ఉండే పాన్ డబ్బాల దగ్గర మరీ ప్రమాదకరం. చదవండి: చలికాలంలో పొంచివున్న వ్యాధులు.. జాగ్రత్తలు ఇవే‘పిడుగు వాహకాలు’ (లైట్నింగ్ కండక్టర్) గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇవి 20 ఏళ్ళకు పైగా పని చేస్తాయి. పిడుగు వాహకాలు కొద్ది మీటర్ల మేరకే రక్షణ కల్పిస్తాయి గనుక అన్ని ఎత్తైన ఇళ్ళపై ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర భూవిజ్ఞాన శాఖ ‘దామిని’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. రానున్న 40 నిమిషాల్లో చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
ఫార్మ్ హౌస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
Guidance for parents: మా అమ్మాయి సేఫ్‌గా ఉందా?
కోల్‌కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్‌కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.అక్కడ ఏం జరిగింది?పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్‌కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్‌కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.రెండు విధాలా...ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్‌గా వచ్చినా, ట్యూషన్‌కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.పిల్లలకు ధైర్యం చెప్పాలిఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్‌కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి ⇒ స్కూల్‌కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్‌తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్‌పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే. ⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి. ⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్‌లో లేకుండా పెట్టమని చెప్పాలి. ⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి. ⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి. ⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి. ⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి. ⇒ అపరిచిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి. ⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి. -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్‌కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్‌లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్‌లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్‌కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్‌లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్‌లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్‌లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్‌ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్‌లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్‌లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్‌కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్‌ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్‌గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్‌కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్‌కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్‌గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్‌గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్‌లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
Health: స్ట్రెస్.. హెల్త్ మిస్! టీచర్లపై ఒత్తిడి బెత్తం..
టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్‌ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?2023లో బిహార్‌లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం– స్కూలుకు సరిగ్గా రాకపోవడం– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?– సిలబస్ టైమ్‌కి పూర్తి చేయగలుగుతున్నారా?– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్‌ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..స్కూల్లో పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్మెంట్తో మీటింగ్‌లు, పేరెంట్స్‌తో మీటింగ్‌లు, సిలబస్‌ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.పిల్లలకు ఒత్తిడి..క్లాసురూమ్‌లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్‌కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్‌గా మారుతుంది.వ్యక్తిగత ఒత్తిడి..టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్‌గా నిలవాలి. సక్సెస్ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.చర్యలు తీసుకోవాలి..టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం– మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన – యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్‌గా చూడటం. -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Health: బీ‘పీక్స్’ పోకముందే చెక్స్!
రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ ఏమిటో చూద్దాం.రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.ప్రీ–హైపర్‌టెన్షన్‌లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.హైబీపీకి కారణాలు.. హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.నివారించలేని కారణాలు:పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.నివారించదగిన కారణాలు:ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు. ఈ సూచనలు పాటించండి... – కేవలం ప్రీహైపర్‌టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు. -
Health: నెక్ పెయిన్‌కు.. కొన్ని లైఫ్‌స్టైల్ అలవాట్లే కారణాలని తెలుసా!
సాధారణంగా మధ్యవయస్కుల్లో కనిపించే మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు టీనేజర్లలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వాళ్లలోనూ అవి కనిపించేందుకు అవకాశం లేకపోలేదు. ఇటీవల మాత్రం టీనేజర్లలో మెడనొప్పి కేసులు చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ ఒంచి మొబైల్ చూస్తూ ఉండటం, అదే కాకుండా ఆ వయసులోని పోష్చర్కు సంబంధించిన లైఫ్‌స్టైల్ అలవాట్లూ ఇందుకు కారణం. ఉదాహరణకు... స్కూళ్లూ / కాలేజీలలో చాలాసేపు మెడవంటి రాసుకుంటూ, చదువుకుంటూ కూర్చునే ఉండటం, సరైన భంగిమ(పోష్చర్)లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు వాళ్లలో మెడనొప్పికి కారణమవుతుంటాయి. ఆ సమస్యలనుంచి విముక్తి ఎలాగో తెలుసుకుందాం.కేవలం కూర్చునే పోష్చర్ లాంటి అలవాట్లే కాకుండా... కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడనొప్పి రావచ్చు. ఉదాహరణకు చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వచ్చే అవకాశముంది.నివారణ కోసం...– స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో / తమ ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.కంప్యూటర్ల వాడకం లేదా వీడియో గేమ్స్‌లో పోష్చర్ సరిగా లేకుండా కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాలపై ఒత్తిడి సరిగా పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.ఒకప్పుడు టీనేజీ పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసిపోయేలా ఆటలాడేవారు. కానీ ఇటీవల ఆటలాడటం తగ్గిపోయింది. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు తమ వర్కవుట్స్‌తో సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. తగినంత వ్యాయామం చేయడం లేదా బాగా ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... దాంతో వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలకు లేత ఎండ తగిలేందుకు ఆరుబయట ఆటలాడేలా తల్లిదండ్రులు చూడాలి. పోష్చర్ సరిచేసుకోవడం, ఆటలాడటం / వ్యాయామం తర్వాత కూడా మెడనొప్పి వస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం మంచిది. -
Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్‌లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్‌కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!సీఫుడ్‌లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్‌స్టన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్‌షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్‌లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్‌షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.పీఎఫ్ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.– డా. భావనా కాసుఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!? -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్‌గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
Health: ఇది సాధారణమే! చలికాలంలో తరచుగా జలుబు..
నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేటజలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్‌లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి.మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్ని కలసి మందులు వాడాలి.హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్‌తో తిండి సమస్యలు..?మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్‌తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు -
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య! ప్రశాంతమైన నిద్రపట్టాలంటే..?
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...నిద్రను దూరం చేసేవి ఇవే!మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. – నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్‌కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.ఆలోచనలకు కళ్లెం వేయాలి..శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్‌లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.నిద్రలేమిని అరికట్టాలంటే!కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి – పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:– నిద్రపోయే ముందు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.– రాత్రిభోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.మంచి నిద్రకు... మంచి ఆహారం!నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్‌లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే! ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. -
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్‌ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్‌ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్‌స్టా్రగామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్‌లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్‌ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్‌ను లేదా ఫ్రిస్బీ ప్లేట్‌ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
health: ఒంట్లో వేడి ఆవిర్లు తగ్గాలంటే ఏం చేయాలి?
నాకు నెలసరి ఆగి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ మూడ్ స్వింగ్స్, ఒంట్లో వేడి ఆవిర్లతో సఫర్ అవుతున్నాను. వెజైనల్ ఇచ్చింగ్ కూడా సివియర్‌గా ఉంది. నేను వర్కింగ్ ఉమన్‌ని అవడం వల్ల వీటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. పరిష్కారానికి డాక్టర్ని కలవడం తప్పనిసరి అంటారా? – రాజేశ్వరి, జగ్గంపేటశరీరంలో వచ్చే మెనోపాజ్ మార్పులను తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ మొదలుపెడితే ఇంత ఇబ్బంది ఉండదు. దీని మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ప్రీ మెనోపాజ్ వచ్చినవారు కూడా ఈ దశను దాటి హ్యాపీగా ఉంటున్నారు. మెనోపాజ్ టైమ్‌లో శారీరకంగా, మానసికంగా, సెక్సువల్‌గా మార్పులు చాలా ఉంటాయి. మీరు వర్కింగ్ ఉమన్ కాబట్టి ఆ మార్పులను ఎదుర్కొంటూ నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడం చాలా కష్టం. మీరే కాదు చాలామంది ఇలాంటి సమస్యలను గుంభనంగా భరిస్తూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించడానికి ఇబ్బందిపడుతుంటారు.కానీ ఈ ప్రాబ్లమ్స్‌కి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన తరువాత ఓవరీస్ పనిచేయవు. అందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల వెజైనా ప్రాంతం పొడిబారిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడతారు. 50 శాతం మందిలో ఈ మార్పు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. యూరిన్, యూటరస్, వెజైనల్ స్వాబ్స్ తీసి ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. ఇప్పుడు ఇలాంటి వాటినే ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ‘మెనోపాజ్ క్లినిక్స్’ వచ్చాయి. ఇబ్బందిపడకుండా డాక్టర్ని సంప్రదిస్తే సమస్య త్వరగా నయమవుతుంది.