నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.
సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...
నిద్రను దూరం చేసేవి ఇవే!
మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి.
– నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్‌కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.
– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.
– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.
– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.
ఆలోచనలకు కళ్లెం వేయాలి..
శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్‌లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.
దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..
ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్‌లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.
– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.
– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.
– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.
– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
నిద్రలేమిని అరికట్టాలంటే!
కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి
– పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.
– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.
– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.
– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.
– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.
మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..
– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.
– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.
కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:
– నిద్రపోయే ముందు వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.
– రాత్రిభోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.
– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.
మంచి నిద్రకు... మంచి ఆహారం!
నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్‌లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్‌లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే!
ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment