నాకు ఇప్పుడు మూడోనెల. ఫ్లూ వాక్సిన్ తీసుకుంటే మంచిదని అన్నారు. కాని, ఇది ఏమైనా కడుపులోని బిడ్డకు ఎఫెక్ట్ చేస్తుందా? మా కజిన్స్ ఎవరూ దీనిని తీసుకోలేదు.
– సుధీర, బెంగళూరు
గర్భవతులు అందరూ ఫ్లూ వాక్సిన్ తీసుకోవటం చాలా అవసరం. ఈ వాక్సిన్ మీకు, కడుపులోని బిడ్డకు మంచి చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. మామూలు వారి కంటే గర్భం దాల్చిన మహిళల్లో ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే, గర్భవతులకు ఫ్లూ కాంప్లికేషన్స్ ఎక్కువ. ఇక చివరి మూడు నెలల్లో శిశువుకు కూడా ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుట్టిన బిడ్డకు ఫ్లూ వస్తే చాలా సమస్యలు వస్తాయి. అదే, తల్లికి వచ్చిన ఫ్లూ వలన బ్రోంకైటిస్, న్యూమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
ఫలితంగా నెలలు నిండకుండానే ప్రసవం కావటం, పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉండటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఫ్లూ వాక్సిన్ సురక్షితం అని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. ఈ వాక్సిన్‌ని గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరే వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వాక్సిన్ వలన శిశువుకు యాంటీబాడీస్ చేరుతాయి. దీనితో పుట్టిన వెంటనే కొన్ని నెలల వరకు శిశువుకు ఫ్లూ రాకుండా రక్షణ ఉంటుంది. ఈ వాక్సిన్ తీసుకున్నా బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. ముందు సంవత్సరం ఫ్లూ వాక్సిన్ తీసుకున్నా, ప్రెగ్నెన్సీలో మళ్లీ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ స్ట్రెయిన్ మారుతుంటుంది. అందుకే, ప్రతి శీతకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య తీసుకోవాలి.
ఫ్లూ వాక్సిన్ తరువాత వాక్సిన్ వలన ఫ్లూ రాదు. వాక్సిన్‌లో లైవ్ వైరస్ ఉండదు. ఇంజెక్షన్ వేసిన ప్రాంతంలో కొంచెం మంటగా ఉంటుంది. ఒంటినొప్పులు రావచ్చు. ఈ వాక్సిన్‌ను వేరే వాక్సిన్‌తో కలిపి తీసుకోవచ్చు. ఫ్లూ వాక్సిన్‌ను సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల్లో, కోరింత దగ్గు వాక్సిన్‌ను గర్భం దాల్చిన 26 నుంచి 28 వారాల మధ్య తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో దగ్గు, జలుబు, ఆయాసం ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎంత త్వరగా మెడిసిన్స్ తీసుకుంటే అంత మంచిది. జ్వరం ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్, కొంత మందికి యాంటీ వైరల్స్ కూడా ఇస్తాం. సత్వర చికిత్సతో తల్లికి, బిడ్డకి సమస్యలు రాకుండా నివారిస్తాం. అందుకే ఫ్లూ వాక్సిన్ చాలా ముఖ్యం. గర్భిణులు తప్పనిసరిగా చేయించుకోవాలి.
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా?
– నైనిక, వరంగల్
ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్‌ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి.
జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్‌ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్‌ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్‌ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్‌వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా వాక్సినేట్ చెయ్యాలి.
పెట్స్‌ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్‌తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్‌ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్‌ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్‌ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు.
డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment