యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే! | Yuva Katha magazine storie | Sakshi
Sakshi News home page

యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే!

Published Sun, Mar 9 2025 12:30 PM | Last Updated on Sun, Mar 9 2025 12:30 PM

Yuva Katha magazine storie

‘ఏంటమ్మా.. నేను ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు తెలుçసమ్మా.. నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది’.. అరిచేశా కాస్త గట్టిగానే!‘అలా ఏం కాదు నాన్నా! నాకు కొంచెం బెంగగా ఉంటుంది. అందుకే ఇలా’ అమ్మ సంజాయిషీ.ఏంటో అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. రేపో మాపో పదో తరగతి పూర్తవుతుంది. ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను. నేనూ పెద్దాడిని అయిపోయాను. 

అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది. నేను స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుంచి 20 నుంచి 30 అడుగులు వేస్తే సరిపోతుంది. పొద్దున్నే లేచి, కావాల్సిన బుక్స్‌ అన్నీ బ్యాగులో పెట్టుకుని, హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా. సరిగ్గా ఉదయం ఎనిమిదికల్లా స్కూలు బస్సు వచ్చేస్తుంది. ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యే లోపు అమ్మ నాకు కావాల్సిన క్యారేజీ కట్టే పనిలో ఉంటుంది. నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు, టిఫిన్లు. హడావిడిగా అన్నీ ఒక్క చేత్తో చేసేస్తుంది. నేనేమో రెడీ అయిపోయి బ్యాగు వేసుకోగానే, చేతికి లంచ్‌ క్యారేజీ ఇచ్చేస్తుంది. 

అక్కడితో అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది. స్కూలు బస్సు ఎక్కి, అది కదిలే వరకు అక్కడే ఉంటుంది. నాతో పాటు బస్సులో వచ్చే మిగతా ఫ్రెండ్స్‌ వాళ్ల అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కాని, మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావుడి చేసేస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ అదో రకంగా చూస్తారు నా వంక, కొన్నిసార్లు నవ్వుతారు కూడా! ఇదంతా రోజూ అనుభవిస్తుంటే, నా బాధ ఎవరికి  చెప్పుకోవాలో అర్థం కాదు. గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది.

ఇలా ఆలోచిస్తున్న నేను బస్సు హారన్‌ సౌండ్‌తో ఒక్కసారిగా గతం నుంచి తేరుకున్నాను. దూరం నుంచి బస్సు నా వైపు వస్తోంది. అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్‌ బాక్స్‌ పెట్టిన బ్యాగు లాక్కుని ముందుకు పరుగెత్తింది. తెలియకుండానే ‘జాగ్రత్త..’ అని నా నోటి నుంచి వచ్చిన మాట పూర్తి కాకుండానే, ‘నాకు తెలుసు డాడీ’ అంటూ పరుగులు పెట్టింది. ఆ మాట వినగానే మళ్లీ ఎక్కడో తడిమినట్లు అనిపించింది. బస్సు ఆగింది. చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు. వాళ్లతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీటులో కూర్చుని, బయటికి చేయి చూపిస్తూ ‘టాటా డాడీ’ అని నవ్వుతూ చెబుతోంది. బస్సు అటు వెళ్లగానే, నేను నా కారు పార్క్‌ చేసిన వైపు వెళ్లాను. 

కారులో కూర్చుని స్టార్ట్‌ చేసి ఇంటికి పోనిచ్చాను. దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు. ఏంటీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది. అమ్మ నన్ను చాలా ప్రేమించింది. అందరి కన్నా ఎక్కువే ప్రేమించింది. కాని, ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా? అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా? తండ్రయ్యాక తెలిసింది.. పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుంది అని. 

వాళ్లు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని. ఆరేళ్లుగా నా కూతుర్ని చూస్తున్నా– స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది. ఎంచక్కా రెడీ అయిపోతుంది. కానీ నాకెందుకు? తను జాగ్రత్తగా స్కూలు బస్సు ఎక్కేవరకు ఒక తెలియని బెరుకు. ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకం. ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది.

ముభావంగానే లోపలికి వెళ్లిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది. అది అందుకుని ఏమీ మాట్లాడకుండానే, బెడ్‌ రూంలోకి వెళ్లిపోయా. నేను అలా వెళ్లడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి, వంటగదిలోకి వెళ్లిపోయింది. రూంలోకి వచ్చిన నేను, చేతిలో ఉన్న కాఫీని టేబుల్‌పై పెట్టేసి పైన చొక్కా తీసేసి, అలా బెడ్‌పై వాలిపోయా. వంటింట్లో నుంచి కమ్మటి వాసన, తాలింపు చప్పుళ్లు. నా భార్య మధ్యాహ్నానికి కావాల్సిన వంటలో నిమగ్నమైపోయింది. కాసేపు అలా కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చేయి పెట్టి నా జుట్టు నిమిరినట్టు అనిపించింది. 

చెప్పాలంటే చాలా హాయిగా, తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది. కాస్త తేరుకున్న నాకు ఒక మాట వినపడింది. ‘ఏంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో బాగానే ఉందా?’ కళ్లు తెరిచిన నాకు ఎదురుగా అప్పటివరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్న నా భార్య. తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను. ఎదురుగా కప్‌బోర్డులో పెట్టిన అమ్మ ఫొటోపై నా దృష్టి పడింది. ఆ ఫొటో వంకే చూస్తూ.., ‘మనం ఊరికి వెళ్లి ఒకసారి అమ్మని కలవాలి’ అన్నా. అది విని లలిత కూడా ఆ ఫొటో వైపు చూసి చిన్నగా నవ్వింది.

ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతున్న నాకు.. హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. లలిత ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇంకెవరితో, మా అమ్మతోనే! మేము పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని, తను చెప్పడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది. ఈ ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడం, మళ్లీ పాపని చూసుకోవడం వల్ల ఎప్పుడోగాని అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు. 

ఎప్పుడైనా అమ్మే నా సెల్‌ నంబర్‌కి కాల్‌ చేసినా ఆఫీసు పనుల్లో తలమునకలై ఉన్న నేను.. తర్వాత చేస్తాలే అమ్మా అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్లే ఎప్పుడూ మాట్లాడుకునేది. ఒకసారి మొదలెడితే వాళ్ల లోకంలోకి వాళ్లు వెళ్లిపోయి, పక్కన వాళ్లను పట్టించుకోనంతగా మునిగిపోతారు. అలా అనుకుంటూనే హాల్లో ఉన్న డైనింగ్‌ టేబుల్‌ మీద నా కోసం పెట్టిన క్యారేజీ తీసుకుని, ఆఫీసుకు వెళ్లొస్తా అన్నట్లు లలిత వంక సైగ చేస్తూ వెళ్లిపోయా. గుమ్మం వరకూ వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత కూడా నావైపు చేయి ఊపింది.

కారు వేగంగా వెళుతోంది. పాపతో కలిసి లలిత, నేను ఊరికి వెళ్తున్నాం. వాతావరణం చక్కగా ఉంది. ఊరికి దగ్గర్లో పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కమ్మటి మట్టి వాసన. నా కూతురు కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ‘ఇంకా ఎంత దూరం నాన్నా! నాన్నమ్మని ఎప్పుడు కలుస్తాం’ అని ఒకటే ప్రశ్నలు. ‘వచ్చేశాంలేమ్మా! దగ్గర్లోనే ఉన్నాం’ అంటూ లలిత బయటికి పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెబుతోంది. డ్రైవింగ్‌ చేస్తున్న నాకు కూడా లోలోపల అదే ఆరాటం ఉన్నా బయట పడలేనేమో కదా! అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంతో నాకు కూడా చిన్న పిల్లాడినై గెంతాలని ఉంది. ఇలా అనుకుంటుండగానే కారు పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది. దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. పుట్టి పెరిగిన ఊరు కదా మరి!

కారు ఇంటి ముందు ఆగిందో లేదో, తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది. కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది. ఎదురుగా వస్తున్న మనవరాలిని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది. ‘నాన్నమ్మా!’ అని గట్టిగా హత్తుకోగానే, అమ్మ తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం. ’ఎలా ఉన్నావు నాన్నా’ అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే, లలిత వంక కూడా చూసింది. ’నువ్వు ఎలా ఉన్నావమ్మా’ అని అడుగుతూనే, తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. నా తలని తన ఒడిలోకి అదుముకుని ప్రేమగా నా వీపు తడుతూ, ‘ఎప్పుడు తిన్నారో ఏమో! పదండి వెళ్లి భోజనం చేద్దాం’ అంది. ‘సరే అమ్మా, తిందాంలే!’ అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది.

 అమ్మతో చాలా చెప్పాలి అనిపించింది. అమ్మని చూడగానే గుండెలో భారం దిగినట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ చూపించే అపురూపమైన ప్రేమను ఇబ్బందిలా ఫీలయ్యే నా తెలియనితనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది. సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టి, కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదికి చేరింది. ఎన్నో చెప్పాలనుకున్నా, క్షమించమని అడగాలి అనుకున్నా కానీ ఏమీ చెప్పలేక మాటలు పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన ప్రాయశ్చిత్తంలా అనిపించింది. కాలిని తాకిన నా చేయి వంక చూస్తూ అమ్మ కళ్లల్లో చిన్నగా తడిని చూశా. అమ్మ వెనక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నాన్నమ్మ చెంపలపై ముద్దులు పెడుతోంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement