ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్‌ అంటున్నారు.. నిజమేనా?  | gynecologist dr bhavana kasu health care | Sakshi
Sakshi News home page

ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్‌ అంటున్నారు.. నిజమేనా? 

Published Sun, Jan 5 2025 7:54 AM | Last Updated on Sun, Jan 5 2025 8:39 AM

gynecologist dr bhavana kasu health care

నా వయసు 35 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. నాకు ట్యూబ్స్, ఓవరీస్‌లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఈమధ్యే సర్జరీ చేసి రెండు ఓవరీస్‌ను తీసేశారు. ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్‌ ఉంటాయి అంటున్నారు. నిజమేనా? 
– లక్ష్మీపద్మజ, కిసాన్‌నగర్‌

ఓవరీస్‌ అనేవి పిల్లలు కావటానికి మాత్రమే కాదు, అవి కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్‌ చేయ్యటం వలన ఆరోగ్యానికీ చాలా అవసరం. 50 నుంచి 55 సంవత్సరాల మధ్య అండాల విడుదల ఆగిపోయా, ఓవరీస్‌ ఎండిపోతాయి. అప్పుడు ఇంక హార్మోన్స్‌ విడుదల ఉండదు. నెలసరి కూడా ఆగిపోతుంది. దాన్ని నేచురల్‌ మెనోపాజ్‌ అంటాం. కానీ 50 ఏళ్లలోపు ఏ కారణంతో అయినా సర్జరీ ద్వారా ఓవరీస్‌ను తొలగిస్తే దానిని సర్జికల్‌ మెనోపాజ్‌ అంటాం. చిన్న వయసులో హఠాత్తుగా  పీరియడ్స్‌ ఆగిపోతాయి. హర్మోన్స్‌ రిలీజ్‌ ఆగిపోతుంది. ఇలా సర్జరీ తర్వాత మెనోపాజ్‌ వచ్చిన వాళ్లకి చాలా సింప్టమ్స్‌ ఉంటాయి. ఒంట్లోంచి వేడివేడి పొగలు రావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, గుండె దడ, మూడ్‌ స్వింగ్స్, యాంగ్జయిటీ, నిద్ర పట్టకపోవడం, నీరసం, మతిమరుపు, వజైనల్‌ డ్రైనెస్, యూరీనరీ ఇన్‌ఫెక్షన్స్, జాయింట్‌ పెయిన్స్, చర్మం పొడిబారిపోవడం వంటివి ఉంటాయి. 

అయితే వీటన్నిటినీ జీవనశైలి మార్పుతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారాన్ని తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం, మసాలా ఫుడ్‌కి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజెస్‌ వంటివాటితో మెనోపాజ్‌ ఇబ్బందులను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను విభజించి.. పాజిటివ్‌ అప్రోచ్‌తో డీల్‌ చెయ్యడాన్ని టాకింగ్‌ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్‌ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్‌ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. అలాంటివారికి డాక్టర్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)ని సూచిస్తారు. హార్మోన్స్‌ని టాబ్లెట్‌ రూపంలో ఇవ్వడమే హెచ్‌ఆర్‌టీ. 

ఇవి జెల్స్, ప్యాచెస్, స్ప్రేలుగానూ అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ అనేది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ గర్భసంచి ఆరోగ్యానికి అవసరం. మీకు గర్భసంచి తీయలేదు కాబట్టి కేవలం ఈస్ట్రోజన్‌ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ రెండూ ఇవ్వాలి. కుటుంబంలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి హెచ్‌ఆర్‌టీ మంచిది కాదు. అలాంటివారికి కొన్ని ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు. వాటిని ఎస్సెస్సారై (  ఖఐ) అంటారు. ఈ మెడిసిన్‌ను డాక్టర్‌ మాత్రమే ప్రిస్క్రైబ్‌ చేస్తారు. వజైనా డ్రైనెస్, ఇచింగ్‌ తగ్గడానికి వజైనల్‌ ఈస్ట్రోజన్‌ క్రీమ్స్‌ను సూచిస్తారు. ఇలా ఒక్కోవ్యక్తికి వాళ్ల వాళ్ల ఆరోగ్యపరిస్థితిని బట్టి సరైన చికిత్సను అందిస్తే రిస్క్, కాంప్లికేషన్స్‌ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నాకు మూడు సిజేరియన్స్‌ అయ్యాయి. మొదటి ఆపరేషన్‌ తర్వాత కుట్ల మీద నల్లటి పెద్ద మచ్చ ఏర్పడింది. దాన్ని కెలాయిడ్‌ అంటారని చెప్పారు. చివరి రెండు సర్జరీల్లో దాన్ని తొలగించినా, మళ్లీ ఏర్పడింది. అక్కడ చర్మం పొడిబారిపోయి.. దురదగా ఉంటోంది. ఇది శాశ్వతంగా ఉంటుందా? దీనికి ట్రీట్‌మెంట్‌ లేదా? 
– అంజలి, వైజాగ్‌

సిజేరియన్స్‌కి పెద్దగా కోత పెడతాం కాబట్టి ఆ ఆపరేషన్‌ తర్వాత వచ్చే కెలాయిడ్స్‌ పెద్దగానే ఉంటాయి. ఈ టెండెన్సీ ఉన్న వారిలో తర్వాత డెలివరీలో ఆ కెలాయిడ్‌ స్కార్‌ను  తీసేసినా హీలింగ్‌ ప్రాసెస్‌లో మళ్లీ ఫామ్‌ అవుతుంది. కొంచెం లైట్‌గా ఉన్న కెలాయిడ్‌ స్కార్‌కి అయితే కార్టిసోన్‌ అనే స్టెరాయిడ్‌ క్రీమ్‌ లేదా ఇంజెక్షన్స్‌ని ట్రై చేస్తారు. వీటిని అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్‌ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లను నెలకొకటి చొప్పున  ఆరునెలల పాటు వాడినవారిలో ఈ మచ్చ ఫేడ్‌ అవటం కనిపించింది. అయితే కొంతమందికి పిగ్మెంటేషన్‌ స్కార్స్‌ కూడా రావచ్చు. కొంతమందిలో ఈ  స్టెరాయిడ్‌ క్రీమ్‌ వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. క్రిప్టోథెరపీ అని.. లిక్విడ్‌ నైట్రోజన్‌ను అప్లై చేసిన కొంతమందిలో మంచి రిజల్ట్స్‌ కనిపిస్తున్నాయి.  Pulsed dye laser  థెరపీ ద్వారా  80 నుంచి 90 శాతం కెలాయిడ్‌ స్కార్‌ని తగ్గించవచ్చు. 

ఈ ట్రీట్‌మెంట్‌ 4 నంచి 8 వారాలుంటుంది. లో లెవెల్‌ రేడియోథెరపీ అనేది అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌. దీంతో మచ్చ మాసిపోవడమే కాక, దురద, అనీజీనెస్‌ కూడా తగ్గుతాయి. ఈ చికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కెలాయిడ్‌ స్కార్‌ని ఆపరేషన్‌ ద్వారా తీసేసి, 48 గంటల్లోపే ఫస్ట్‌ డాక్స్‌ ఆఫ్‌ ఎక్స్‌–రే థెరపీని ఇస్తారు. వారం తర్వాత  రెండో డాక్స్‌ను ఇస్తారు. ఈ ప్రోసీజర్‌కు  2 నుంచి 3 గంటలు పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని షార్ట్‌టర్మ్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ 2 నుంచి 3 వారాలు ఉండి తగ్గిపోతాయి. కొంచెం మంట ఉంటుంది.  దీనికి డ్రెస్సింగ్‌ను సూచిస్తారు. లాంగ్‌టర్మ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలల తర్వాత స్కిన్‌ డార్క్‌ అవటం, పింగ్మేంటేషన్‌ కనిపిస్తుంది. సన్‌స్క్రీన్‌ వాడాల్సి వస్తుంది. 
 

పాజిటివ్‌ అప్రోచ్‌తో డీల్‌ చెయ్యడాన్ని టాకింగ్‌ థెరపీ అంటారు. దీంతో కూడా  ప్రిమెనోపాజ్‌ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్‌ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement