
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్‌లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– దేశీత, శ్రీకాకుళం.
పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్‌కి గురవుతారు. లెడ్ పెయింట్స్‌ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్‌కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్‌పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.
అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్‌ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్‌సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.
బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్‌ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్‌ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్‌పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?
నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?
– ప్రణతి, గుంటూరు.
ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్‌లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్‌లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.
ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?
నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా?
– రూప, బెంగళూరు.
ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి.