నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్‌ని కలిస్తే ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెం
గర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్‌ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.
దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్‌వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్‌లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్‌రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.
దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.
వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్‌ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం
హెల్త్ ట్రీట్..
మెనోపాజ్ ఔషధంతో లివర్‌కు ముప్పు!
మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్‌లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్‌హార్మోనల్ ఔషధం.
ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్‌కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్‌పై ‘లివర్‌కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment