నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడి
గర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.
చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్‌ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్‌లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.
గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు.
చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
Comments
Please login to add a commentAdd a comment