నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్
ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.
ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.
రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్‌లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.
కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.
ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్‌కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్‌మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.
నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.
హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!
సీఫుడ్‌లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్‌స్టన్సెస్ (పీఎఫ్‌ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్‌షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్‌లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్‌షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.
పీఎఫ్‌ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్‌ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్‌లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్‌ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.
– డా. భావనా కాసు
ఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment