నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్
నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్‌ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్‌కి పంపి, ఏదైనా ఇన్‌ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.
పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్‌లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.
నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.
ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Comments
Please login to add a commentAdd a comment