
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్‌లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
– శైలజ, చిత్తూరు.
వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్‌కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం.
ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్‌కు వచ్చినప్పుడు బీఎమ్‌ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి.
వాటిని స్కాన్స్‌లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్‌కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.
రావడం లేదు
నాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?
– రమాదేవి, ఉరవకొండ.
కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్‌లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది.
కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్‌తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్‌గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది.
ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్‌తో బ్రెస్ట్ పంప్‌తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్‌ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి.
తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎక్స్‌ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్‌ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్‌గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment