
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్‌మెన్ క్రికెట్‌లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు.
1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్‌లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్‌తో తయారైంది.
వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాక్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment