
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ ఏర్పాటు పూర్తి అయింది. గ్రూపు స్టేజిలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్‌నే తుది పోరుకు కూడా క్యూరేటర్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన తమ నాలుగు మ్యాచ్‌లు వేర్వేరు పిచ్‌లపైనే ఆడింది. ఎందుకంటే ఒక్కసారి ఉపయోగించిన పిచ్‌ను మళ్లీ ఉపయోగించాలంటే కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్లాన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్ ఆడి రెండు వారాలు పూర్తి కావడంతో ఆ పిచ్‌పై మళ్లీ ఆడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 244 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.
కివీస్‌కు మరోసారి..
కాగా ఈ వికెట్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మణికట్టు స్పిన్నర్లు బంతితో మ్యాజిక్ చేశారు. ఆ మ్యాచ్‌లో ఇంకా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేడు. అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాక భారత స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.
న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడి స్పిన్ దాటికి కివీలు విల్లవిల్లాడారు. ఈ క్రమంలో మరోసారి న్యూజిలాండ్‌కు వరుణ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ప్రత్యర్ధి జట్టులో కూడా మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.
కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రెస్‌వెల్ వంటివారు బంతితో అద్భుతాలు చేయగలరు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లకు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తాఉంది. దీంతో మరోసారి బ్యాటర్లకు స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.
కివీస్‌దే పైచేయి..
కాగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్-భారత జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా కివీసే విజయం సాధించింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాను బ్లాక్ క్యాప్స్ చిత్తు చేసింది.
చదవండి: రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
Comments
Please login to add a commentAdd a comment