
నేటి నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
బరిలో ఎనిమిది జట్లు
తొలి పోరులో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ ‘ఢీ’
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 టీవీ చానెల్స్‌లో, జియోహాట్‌స్టార్‌యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
రేపు బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్
వన్డే క్రికెట్‌లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్‌గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్‌తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్‌కే పరిమితమవుతోంది.
ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్‌లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది.
కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్‌లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు.
మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది.
ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్‌లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుంది.
టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్‌కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు.
ఏ జట్టు ఎలా ఉందంటే...
» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్‌లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్‌లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్‌పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్‌ల చేతిలో చిత్తయింది.
» 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్‌లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్‌లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్‌తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్‌లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
» టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్‌ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్‌పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్‌వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్‌లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.
» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్‌లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్‌రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్‌లో పదును లేదు.
» డిఫెండింగ్ చాంపియన్‌గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్‌లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్‌ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్‌లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.
» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్‌లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్‌జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్‌ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది.

» అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్‌లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్‌లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్‌లో ప్రధానం కాగా...బౌలింగ్‌లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్‌లకు గెలిపించగల సామర్థ్యం ఉంది.

Comments
Please login to add a commentAdd a comment