చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. స్వల్ప కెరీర్‌లోనే..! | Asia Cup 2025: India Beat Oman | Sanju Samson Creates T20I Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. స్వల్ప కెరీర్‌లోనే..!

Sep 20 2025 8:46 PM | Updated on Sep 21 2025 10:32 AM

Asia cup 2025, IND VS OMAN: Sanju Samson becomes the first Indian Wicket Keeper batter to have 3 POTM awards in T20I

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఒమన్‌తో నిన్న (సెప్టెంబర్‌ 19) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ప్రయోగాలకు పోయి 188 పరుగులకే పరిమితమైంది. 56 పరుగులు చేసిన సంజూ శాంసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

వాస్తవానికి ఒమన్‌ లాంటి చిన్న జట్టుపై భారత్‌ భారీ స్కోర్‌ చేసుండాల్సింది. ఒమన్‌ బౌలర్లను తక్కువ అంచనా వేయడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం, అతి విశ్వాసంగా ఉండటం వల్ల భారత్‌ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది.

అనంతరం లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒమన్‌ బ్యాటర్లు కూడా భారత బౌలర్లకు దడ పుట్టించారు. ఆమిర్‌ కలీమ్‌ (64), హమ్మద్‌ మీర్జా (51) అనే అనామక బ్యాటర్లు అనుభవజ్ఞులైన భారత బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలయ్యారు. కాస్త అటో ఇటో అయ్యుంటే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. 

నిర్దేశిత లక్ష్యానికి ఒమన్‌ అతి చేరువగా (167/4) వచ్చి భారత ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. అంతిమంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో బయటపడి గ్రూప్‌ దశలో ఓటమెరుగని జట్టుగా సూపర్‌-4లోకి ప్రవేశించింది. భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచినందుకు గానూ సంజూ శాంసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఈ అవార్డుతో సంజూ ఓ ఘనత సాధించాడు. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అవతరించాడు. సంజూ 45 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌లో 3 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు సంజూ దినేశ్‌ కార్తీక్‌తో (2) కలిసి సంయుక్తంగా ఈ అవార్డును పంచుకున్నాడు. 

భారత లెజెండరీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని 98 మ్యాచ్‌ల సుదీర్ఘ కెరీర్‌ కలిగి కూడా కేవలం ఒకే ఒకసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ధోని తర్వాత భారత్‌ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రిషబ్‌ పంత్‌ కూడా తన 76 మ్యాచ్‌ల కెరీర్‌లో ఒకే ఒకసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

మొత్తంగా చూస్తే.. దిగ్గజ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన ధోని 98 మ్యాచ్‌ల కెరీర్‌లో సాధించలేనిది, సంజూ స్వల్ప కెరీర్‌లోనే సాధించాడు. ఓవరాల్‌గా అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్ల​ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన మొహమ్మద్‌ రిజ్వాన్‌ (12) ముందున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో జోస్‌ బట్లర్‌ (10), మొహమ్మద్‌ షెహజాద్‌ (9), సంజూ శాంసన్‌ (3) ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement