
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్‌లను పాక్‌లో ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.
టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్‌లోని కరాచీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పాక్‌పై న్యూజిలాండ్‌కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. మూడుసార్లు న్యూజిలాండే విజేతగా నిలిచింది.
కెన్యా వేదికగా జరిగిన టోర్నీ రెండో ఎడిషన్‌లో (2000) పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 49 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పాక్ తరఫున సయీద్ అన్వర్ (104) సెంచరీ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వూస్ (87) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెమీస్‌లో పాక్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్.. ఆతర్వాత ఫైనల్లో భారత్‌పై కూడా గెలుపొంది తమ తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఆతర్వాత భారత్‌లో జరిగిన 2006 ఎడిషన్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్‌దే పైచేయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాక్ 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున స్కాట్ స్టైరిస్ (86), పాక్ తరఫున మొహమ్మద్ యూసఫ్ (71) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
సౌతాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మూడో సారి తలపడ్డాయి. ముచ్చటగా మూడోసారి కూడా న్యూజిలాండే విజేతగా నిలిచింది. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో పాక్‌పై గెలుపుతో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై ఘనమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ మరో విజయం సాధిస్తుందో లేక తొలి ఓటమిని మూటగట్టుకుంటుదో వేచి చూడాలి.
ఛాంపియన్స ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు..
మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్
పాకిస్తాన్ జట్టు..
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, సౌద్ షకీల్
Comments
Please login to add a commentAdd a comment