
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఘోర పరాజయంతో ప్రారంభించింది. నేపియర్ వేదికగా ఇవాళ (మార్చి 29) జరిగిన తొలి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓడింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆ జట్టు ప్రత్యర్ధిని భారీ స్కోర్ చేయనిచ్చింది. టీ20 సిరీస్‌లో రాణించిన హరీస్ రౌఫ్ (10-1-38-2) ఒక్కడే ఈ మ్యాచ్‌లోనూ రాణించాడు. ఇర్ఫాన్ ఖాన్ (5-0-51-3), అకీఫ్ జావెద్ (10-1-55-2), నసీం షా (10-1-60-1), మొహమ్మద్ అలీ (10-0-53-1) వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టాడు. డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పాక్ జాతీయుడు ముహమ్మద్ అబ్బాస్ తన జన్మ దేశంపై విరుచుకుపడ్డాడు.
అబ్బాస్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన న్యూజిలాండ్‌ను చాప్‌మన్, మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 199 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు 5 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఆతర్వాత బాబర్ ఆజమ్ (76).. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) సాయంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. బాబర్ 249 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 22 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మిగతా ఆరు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బాబర్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించేలా కనిపించింది. చాలాకాలం తర్వాత బాబర్ సెంచరీ చేసేలా కూడా కనిపించాడు.
అయితే బాబర్ ఔట్ కావడంతో పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. పాక్ చివరి వరుస ఆటగాళ్లలో ముగ్గురు ఒక్క పరుగు చేయగా.. ఇద్దరు డకౌట్లయ్యారు. చివర్లో నాథన్ స్మిత్ (8.1-0-60-4) చెలరేగి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ 2, విలియమ్ ఓరూర్కీ, బ్రేస్‌వెల్, ముహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్‌లో జరుగుతుంది.