
పాకిస్తాన్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 21) జరిగిన టీ20లో 44 బంతుల్లోనే శతక్కొట్టి.. పొట్టి ఫార్మాట్‌లో పాక్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నవాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన మూడో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. కెరీర్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన నవాజ్.. మూడో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సెంచరీతో నవాజ్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో నవాజ్ చేసిన సెంచరీ (44 బంతుల్లో) పాక్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా బాబర్ రికార్డును నవాజ్ బద్దలు కొట్టాడు.
టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు
హసన్ నవాజ్- 44 బంతులు
బాబర్ ఆజమ్- 49
బాబర్ ఆజమ్- 58
అహ్మద్ షెహజాద్- 58
బాబర్ ఆజమ్- 62
మహ్మద్ రిజ్వాన్- 63
మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న నవాజ్ 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నవాజ్ చేసిన ఈ స్కోర్ టీ20ల్లో పాక్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. 2021లో సౌతాఫ్రికాపై బాబర్ 122 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. 2014లో షెహజాద్ బంగ్లాదేశ్‌పై 111లతో అజేయంగా నిలిచాడు.
ఏడో అతి పిన్న వయస్కుడు
ఈ సెంచరీతో నవాజ్ టీ20ల్లో సెంచరీ చేసిన ఏడో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. నవాజ్ 22 ఏళ్ల 212 రోజుల వయసులో సెంచరీ చేశాడు. టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయసులో శతక్కొట్టాడు.
టీ20ల్లో సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కులు
హజ్రతుల్లా జజాయ్- 20 ఏళ్ల 337 రోజులు
యశస్వి జైస్వాల్- 21 ఏళ్ల 279 రోజులు
తిలక్ వర్మ- 22 ఏళ్ల 5 రోజులు
తిలక్ వర్మ- 22 ఏళ్ల 7 రోజులు
రహ్మానుల్లా గుర్బాజ్- 22 ఏళ్ల 31 రోజులు
అహ్మద్ షెహజాద్- 22 ఏళ్ల 127 రోజులు
హసన్ నవాజ్- 22 ఏళ్ల 212 రోజులు
కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన నవాజ్ టీ20ల్లో అత్యంత వేగంగా (మ్యాచ్‌ల పరంగా) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
రిచర్డ్ లెవి-రెండో మ్యాచ్
ఎవిన్ లెవిస్- రెండో మ్యాచ్
అభిషేక్ శర్మ- రెండో మ్యాచ్
దీపక్ హూడా- మూడో మ్యాచ్
హసన్ నవాజ్- మూడో మ్యాచ్
టీ20ల్లో పాక్ తరఫున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో నవాజ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో పాక్ తరఫున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు షర్జీల్ ఖాన్ (24) పేరిట ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్‌మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించారు. ఈ గెలుపుతో పాక్ సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment