
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి...
జూన్ 29, 2024... టి20 ఫార్మాట్‌లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట...
మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం...
సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో
రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.
వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది.
స్పిన్నర్లే విన్నర్లు...
చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు.
ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు.
తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది.
గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు.
బ్యాటర్లు సమష్టిగా...
బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది.

మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు.
ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది.
కెప్టెన్ గా రోహిత్ ముద్ర...
భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది.
గంభీర్‌కు ఊరట...
ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.
ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.
ప్రధాని ప్రశంసలు...
మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.
మాజీ సీఎం జగన్ అభినందనలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.
7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.
ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే?
విజేత భారత్
22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు)
రన్నరప్ కివీస్
11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment