
నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
భారత్‌తో న్యూజిలాండ్ ఢీ
జోరు మీదున్న ఇరు జట్లు
మ.గం.2:30నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లి, జడేజా ప్రస్తుత టీమ్‌లోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్‌తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది.
భారత్ మూడో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిల్లో ఎలా ఆడినా మన టీమ్‌పై ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్‌దే పైచేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాడటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడినా ఆ మ్యాచ్‌తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు.
గెలుపోటములతో పాటు మరో కీలకాంశం ఈ మ్యాచ్‌కు సంబంధించి చర్చకు వస్తోంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు మూల స్థంభాలుగా అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈమ్యాచ్‌తో తమ వన్డే కెరీర్‌ను ముగిస్తారా...టి20 వరల్డ్ కప్ తరహాలో ఘనంగా ఆటను ముగిస్తారా అనేది చూడాలి. మరో వైపు కివీస్ కూడా తమ స్టార్ విలియమ్సన్‌కు ఒక్క ఐసీసీ వన్డే టోర్నీతోనైనా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది.
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ఒక వైపు... నిలకడగా రాణించిన కివీస్ మరో వైపు తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత్ అంతకు ముందు రెండు సార్లు టైటిల్ సాధించింది.
2000లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌పై ఆధారపడుతుండగా...పరిస్థితులకు తగినట్లు స్పందించే తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికరం.
మార్పుల్లేకుండా...
టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశమే లేదు. ఆటగాళ్లంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా గిల్ కీలకం కానుండగా... మిడిలార్డర్‌లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్‌పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌పై సెంచరీ చేసినప్పటినుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్.
వరుసగా అన్ని మ్యాచ్‌లలో అతను చెలరేగిపోయాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు భారత్‌కు తిరుగుండదు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3 అర్ధసెంచరీలు చేశాడు. దీనిని మరింత మెరుగుపర్చుకునే అవకాశం అతని ముందుంది.
అయితే ఇప్పుడు భారత జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20–30 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే నిష్క్రమిస్తుండటం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు! ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక.
మరో వైపు భారత స్పిన్నర్లు ప్రత్యర్థిపై చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో ఐదు వికెట్లతో కివీస్‌ను దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధానాస్త్రం కాగా, లెఫ్టార్మ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్‌కు కష్టాలు ఖాయం. మన నలుగురు స్పిన్నర్లు కలిపి టోర్నీలో 21 వికెట్లు తీశారు. పేస్‌తో షమీ ఆకట్టుకోగా, పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు.
హెన్రీ ఆడతాడా!
లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా న్యూజిలాండ్‌పై ఆ మ్యాచ్ ఫలితం పెద్దగా పడలేదు. ఆ మ్యాచ్‌లోజరిగిన లోపాలను సవరించుకొని బరిలోకి దిగుతున్నామని టీమ్ మేనేజ్‌మెంట్ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. టీమ్ బ్యాటింగ్ విషయంలో కివీస్ బలంగా కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగిపోతుండగా... విలియమ్సన్ కూడా అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు.
ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినా... అతను ఈ టోర్నీలో రాణిస్తున్న తీరు జట్టుకు అదనపు బలంగా మారింది. యంగ్, మిచెల్ కూడా ఆకట్టుకోగా... ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఫిలిప్స్ కూడా చెలరేగితే కివీస్ కూడా భారీ స్కోరు సాధించగలేదు. జట్టు స్పిన్ కూడా మెరుగ్గానే ఉంది.
కెప్టెన్ సాంట్నర్, బ్రేస్‌వెల్‌లతో పాటు ఫిలిప్స్ కూడా బంతిని బాగా టర్న్ చేయగల సమర్థుడు. పేసర్లు జేమీసన్, రూర్కేలు కీలకం కానుండగా అసలు మ్యాచ్‌కు ముందు హెన్రీ గాయం ఆందోళన రేపుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హెన్రీ జట్టు ప్రధానాయుధం. అతను కోలుకొని బరిలోకి దిగితే కివీస్‌కు ఊరట.
పిచ్, వాతావరణం
ఫైనల్‌కు కూడా నెమ్మదైన పిచ్ అందుబాటులో ఉంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు.
వన్డే టోర్నీ గెలిపిస్తాడా!
భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో రెండు ఫైనల్స్‌లో పరాజయం పాలైన జట్టు టి20ల్లో విశ్వవిజేతగా నిలిచింది.
ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆఖరి మ్యాచా!
కోహ్లి, రోహిత్‌ల భవిష్యత్తు ఈ మ్యాచ్‌తో తేలుతుందని అంతటా చర్చ వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి, ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్‌నెస్‌కు కూడా ఢోకా లేదు.
అయితే స్టీవ్ స్మిత్ తరహాలోనే తానే స్వయంగా దూరమవుతాడా అనేది చెప్పలేం. మరో వైపు రోహిత్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికి టి20లనుంచి తప్పుకున్న రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమైన దానిపై కూడా సందేహాలు రేపాడు. ఇక మిగిలిన ఫార్మాట్ వన్డేలు మాత్రమే. అయితే నిజంగా కొనసాగే ఆలోచన లేకపోయినా ఈ మ్యాచ్ ముగియగానే అధికారికంగా రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని వినిపిస్తోంది.
భారీగా బెట్టింగ్‌లు...
ఫైనల్‌పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ మొత్తం సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని వెనక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌పై పెద్ద స్థాయిలో బెట్టింగ్‌లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
2000
భారత్, న్యూజిలాండ్ మధ్యే 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, షమీ, కుల్దీప్, వరుణ్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.