
స్పిన్ ఉచ్చులో పడకుండా ఆడటమే సవాల్
ఫైనల్‌కు వచ్చాక అనుకూలతలేంటి
కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ వ్యాఖ్య
దుబాయ్: న్యూజిలాండ్ జట్టుకు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) బెంగపట్టుకుంది. అతనితోనే పెద్ద ముప్పు అని స్వయంగా కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)’ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్ స్టెడ్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ తిప్పేశాడు. అతని 5 వికెట్ల ప్రదర్శనే మ్యాచ్‌లో మేం కోలుకోకుండా చేసింది. అతనొక క్లాస్ బౌలర్.
తన స్పిన్ నైపుణ్యంతో ఎవరికైనా ఉచ్చు బిగించగలడు. ఫైనల్లోనూ అతనే మాకు పెద్ద సమస్య. అందుకే మేం అతని బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎలాగైనా ఫైనల్ రోజు అతని ఉచ్చులో పడకుండా బ్యాటింగ్ చేయాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతాం’ అని అన్నారు.
పలువురు క్రికెటర్లు దుబాయ్ అనుకూలతలపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ‘టోర్నీ షెడ్యూల్, వేదికలనేవి మన చేతుల్లో ఉండవు. అందుకే దానిపై అతిగా ఆలోచించం. ఆందోళన చెందం. భారత్ అన్నీ మ్యాచ్‌లు అక్కడ ఆడి ఉండొచ్చు. అలాగే మేం కూడా అక్కడ ఓ మ్యాచ్ ఆడాం. కాబట్టి అక్కడి పరిస్థితులెంటో మాకూ బాగా తెలుసు.
ఇలాంటి పెద్ద టోర్నీలో అదికూడా ఎనిమిది జట్ల నుంచి రెండు జట్లు ఫైనల్ దశకు వచ్చాక అనుకూలతలు, ప్రతికూలతలనే సాకులు వెతక్కొద్దు. టైటిల్‌కు ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాం. దాని గురించే ఆలోచిస్తాం. వ్యూహాలు రచిస్తాం. మిగతా విషయాల్ని పట్టించుకోం’ అని కోచ్ వివరించారు.
షెడ్యూల్ పాక్ నుంచి దుబాయ్‌కి... అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి బిజిబిజీగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఎలాంటి బడలిక ఇబ్బందులు ఉండబోవని చెప్పారు.
ఫైనల్‌కు హెన్రీ దూరం!
పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడటం అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను ఆదివారం మ్యాచ్ సమయానికల్లా కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ గంపెడాశలు పెట్టుకుంది. 33 ఏళ్ల హెన్రీ భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో 5/42 గణాంకాలు నమోదు చేయడంతోపాటు ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు తీశాడు. తన ప్రదర్శనతో ప్రధాన బౌలర్‌గా మారిన అతను దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డాడు.
‘మ్యాచ్ సమయంలో కిందపడటంతో అతని భుజానికి స్వల్పగాయమైంది. ఇదేమంత తీవ్రమైంది కాదు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కూడా తీశాం. సానుకూల రిపోర్టు వస్తుందనే ఆశిస్తున్నాం. ఫైనల్లో అతను ఎలాగైనా ఆడాలని మేమంతా గట్టిగా కోరుకుంటున్నాం’ అని కోచ్ స్టెడ్ చెప్పారు.