
ఫైనల్ పోరుపై న్కూజిలాండ్ స్టార్ విలియమ్సన్ వ్యాఖ్య
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై, ఒకే మైదానంలో ఆడుతూ, కనీసం ప్రయాణం చేసే అవసరం కూడా లేకుండా భారత్‌కు అన్ని అనుకూలతలు ఉన్నాయని వస్తున్న విమర్శల్లో మరో కీలక ఆటగాడు గొంతు కలిపాడు. టీమిండియాతో ఆదివారం జరిగే తుది పోరుకు ముందు కివీస్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పరోక్షంగా ఇదే విషయంపై మాట్లాడాడు.
దుబాయ్‌లో పరిస్థితులపై భారత్‌కు మంచి అవగాహన ఉంది కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘దుబాయ్‌లో ఎలాంటి వ్యూహాలు పని చేస్తాయో భారత్‌కు బాగా తెలుసు. అన్ని మ్యాచ్‌లు ఒకే చోట ఆడిన జట్టుకు అక్కడి పరిస్థితులు, పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంటుంది కదా. కానీ షెడ్యూల్ అలా ఉంది కాబట్టి ఏమీ చేయలేం.
ఇతర అంశాల ప్రభావం ఉన్నా సరే... మేం ఫైనల్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాం. లాహోర్‌లో ఆడిన వాటితో పోలిస్తే అక్కడి పరిస్థితులు భిన్నం. మేమూ ఒక మ్యాచ్ దుబాయ్‌లో ఆడాం. ఫైనల్ కోసం అందుబాటులో ఉన్న సమయాన్ని వాడుకొని సన్నద్ధమవుతాం. భారత్ చేతిలో ఓడిన గత లీగ్ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని విలియమ్సన్ అన్నాడు.
మరోవైపు కివీస్ కెప్టెన్ మైకేల్ సాంట్నర్ కాస్త భిన్నంగా స్పందించాడు. విభిన్న పరిస్థితుల్లో ఆడాల్సి రావడం అంతర్జాతీయ క్రికెట్ స్వభావమని, టోర్నీ షెడ్యూల్‌ను నిర్ణయించేది తాను కాదన్న సాంట్నర్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment