
వన్డేలు, టి20ల్లో సత్తా చాటుకున్న ఆల్‌రౌండర్
ఏడాది కాలంగా నిలకడైన ప్రదర్శన
భారత జట్టులో స్థానం సుస్థిరం
అక్షర్ పటేల్ భారత జట్టు తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే పదేళ్ల కాలంలో కేవలం 14 టెస్టులు, 57 వన్డేలు, 60 టి20లు మాత్రమే ఆడగలిగాడు. తనలాంటి లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కలగలిసిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా నీడలోనే అతను ఎక్కువ కాలం ఉండిపోవడమే అందుకు కారణం. జడేజా ఏదో కారణంతో జట్టుకు దూరమైతే తప్ప అక్షర్‌కు అవకాశం దక్కకపోయేది.
కానీ గత ఏడాది కాలంలో పరిస్థితి మారింది. వన్డేలు, టి20ల్లో చక్కటి ప్రదర్శనలతో అతను జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. జడేజాతో పోలికలు వచ్చినా సరే... తనదైన శైలిలో రెండు విభాగాల్లోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
సాక్షి క్రీడా విభాగం
టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు... 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్‌లో కోహ్లిలాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజాలాంటి ఆల్‌రౌండర్లను కాదని అక్షర్‌పై నమ్మకంతో కోచ్ ద్రవిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
కోహ్లితో కలిసి అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లి 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే... అక్షర్ ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది.
2021లో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్‌గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, టి20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు.
అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, టి20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్‌కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీని వల్ల కొన్నిసార్లు బ్యాటర్‌కు భారీ షాట్ ఆడే అవకాశం వచ్చినా... అదే ఉచ్చులో ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్‌కు అవకాశం ఉంటుంది. ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్‌వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్‌లో మరింత సాధన చేశాడు.
పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నింటికి మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్‌లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, టి20ల్లో మరిన్ని అవకాశాలు కల్పించింది. టి20 వరల్డ్ కప్‌లో అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్‌తో మ్యాచ్‌లో మార్ష్ క్యాచ్‌ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్‌తో టి20ల్లో అతని స్థానం సుస్థిరమైంది.
బ్యాటర్‌గానే తన కెరీర్ మొదలు పెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్‌ను గత కొంత కాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతని దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతనికి అలాంటి అవకాశం ఇచ్చింది. వాటిని చాలా వరకు అక్షర్ సమర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు అవసరాలరీత్యా అతనికి ఐదో స్థానంలో ఆడే అవకాశం దక్కుతోంది.
వన్డేల్లో రాహుల్‌కే కీపర్‌గా తొలి ప్రాధాన్యత లభిస్తుండటంతో పంత్‌కు చోటు ఉండటం లేదు. దాంతో టాప్–6లో అంతా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్షర్‌ను మేనేజ్‌మెంట్ ఐదో స్థానంలో పంపిస్తోంది. అది చక్కటి ఫలితాలను కూడా అందించింది. అక్షర్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే తీరు. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌తో అతను పెద్ద సంఖ్యలో పరుగులు రాబడుతున్నారు. అలవోకగా సిక్స్‌లు కొడుతున్న అతని నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది.
టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతను తొలిసారి ఐదో స్థానంలో ఆడాడు. అక్షర్ వరుసగా 44, 52, 41 నాటౌట్, 8, 42, 27 పరుగులు సాధించాడు. ఒక బ్యాటర్‌గా చూస్తే ఇవన్నీ అద్భుత గణాంకాలు కాకపోయినా... ఆల్‌రౌండర్ కోణంలో, పైగా తక్కువ స్కోర్ల మ్యాచ్‌లలో ఈ స్కోర్లన్నీ అమూల్యమైనవే. ఇప్పుడు టీమిండియాలో అన్ని విధాలా ఆధారపడదగ్గ ప్లేయర్‌గా మారిన అక్షర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు.
Comments
Please login to add a commentAdd a comment