
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హిట్‌మ్యాన్ అనుసరించిన వ్యూహాలు అమోఘమని కొనియాడాడు. కీలక మ్యాచ్‌లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జట్టును విజేతగా నిలిపాడని ప్రశంసించాడు.
కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే టోర్నమెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.
గ్రూప్ దశలో మూడింటికి మూడు (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్) గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఫైనల్లో కివీస్ (India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను ముందుగా బౌలింగ్‌కు పంపడమే మ్యాచ్‌కు టర్నింగ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పక అభినందించాలన్నాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘కుల్దీప్‌ను ముందుగా పంపడమే ఈ మ్యాచ్‌లో కీలకంగా మారింది.
రోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రత్యర్థి జట్టు అస్సలు ఊహించి ఉండదు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ 20- 25 ఓవర్ల తర్వాతే బౌలింగ్‌కి వస్తాడు. కాబట్టి న్యూజిలాండ్‌కు ఇది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
కుల్దీప్ ఇంత ముందుగా వస్తాడని కివీస్ ఓపెనర్లు అస్సలు ఊహించి ఉండరు. అక్షర్ లేదా జడేజా వస్తారని వాళ్లు అనుకుని ఉంటారు. అయితే, ఇక్కడే రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. అద్భుతమైన వ్యూహంతో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు’’ అని వకార్ యూనిస్ కొనియాడాడు.
కాగా కివీస్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పదకొండో ఓవర్లోనే బరిలోకి దించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. పదమూడో ఓవర్లో కేన్ విలియమ్సన్(11) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్‌కు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమంగా (10-0-40-2) రాణించిన కుల్దీప్ యాదవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
కాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో టాస్ ఓడిన ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైఖేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాల కారణంగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(76) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment