
కాంగ్రెస్ నేతల వేధింపులు
భరించలేకపోతున్నానని మహిళా
పంచాయతీ కార్యదర్శి అదృశ్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది.
డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్‌బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.