
Photo Courtesy: BCCI
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇక సన్‌రైజర్స్ శుక్రవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్ బృందానికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో రైజర్స్ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది.
ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం
ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ను దీపక్ చహర్ వేయగా.. బంతిని డౌన్ ది లెగ్ ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతిలో పడింది. అయితే, బాల్ ఇషాన్ బ్యాట్ లేదంటే గ్లౌవ్స్‌ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్‌గానీ, వికెట్ కీపర్‌గానీ అప్పీలు చేయలేదు.
అంపైర్ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్ అయి ఇషాన్ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్.. అవుట్ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్ ఇచ్చాడు.
అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాటౌట్ అని తేలింది. దీంతో ఇషాన్ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.
అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు
‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!
అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్‌ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్ ఇషాన్‌కు చురకలు అంటించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్‌రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.
చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు!
Fairplay or facepalm? 🤯
Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!
Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025