
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.
అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించిన తీరుపై సొంత అభిమానులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇషాన్ ముంబై ఇండియన్స్‌తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఇషాన్ తమను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబడుతున్నారు. ఇకపై సన్‌రైజర్స్ యాజమాన్యం అతనికి అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. సొంత మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్ నిన్న ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడాడు. హెడ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్‌ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది.
బంతికి బ్యాట్‌కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఔటయ్యానని అనుకుని పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్‌కు కానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో ఇషాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అప్పటికే హెడ్ ఔటై కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇషాన్‌కు ఇంత నిర్లక్షమా అని మండిపడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా ఇషాన్‌కు ఏ మాత్రం పట్ట లేదని దుయ్యబడుతున్నారు. రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగేనా చేసేదని దుమ్మెత్తిపోస్తున్నారు.
కాగా, ఈ సీజన్‌లో ఇషాన్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ అభిమానులు ఇషాన్‌ను ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తారు. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ వరుసగా 7 మ్యాచ్‌ల్లో విఫలమై అభిమానులను నిరాశలో ముంచెత్తాడు.
సరిగ్గా ఆడకపోతే ఫామ్‌లో లేడని భావించిన ఫ్యాన్స్, ఔట్ కాకపోయినా ఔటయ్యానని తనకు తానే ప్రకటించుకోవడంపై ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి అమ్ముడుపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సీజన్‌లోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఆ జట్టు ఓనర్ నీతా అంబానీతో చనువుగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా చేసినందుకు నీతా మేడం ఇషాన్‌కు రిలయన్స్ మార్ట్ నుండి సరుకులు పంపుతుందని జోక్ చేస్తున్నారు. ఇషాన్ ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే.