all-rounder
-
ఆంధ్ర ఆటగాడు అమెరికా తరఫున...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది. చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
యూ ఇడియట్.. సిడ్నీ టెస్టు చూడలేదా..!
సెలబ్రిటీల వైఖరి భిన్నంగా తోచినప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం, వారిని ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, విపిన్ తివారి అనే వ్యక్తి ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజాను అనవసర కామెంట్ చేసి తిట్లు తిన్నాడు. ‘హేర్ స్టైల్ బాగుందా.. ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వండి’ అని జడేజా గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులను కోరాడు. విపిన్ తివారి అనే యూజర్ ‘ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్ వేస్ట్ చేసే బదులు కాస్త ఆటపై దృష్టి పెట్టు’ అని ట్రోల్ చేసేందుకు యత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జడేజా.. ‘మీ ఇంట్లో టీవీ లేదా ఇడియట్. సిడ్నీ టెస్టు మ్యాచ్ చూడలేదా’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, జడేజాకి అతని అభిమానులు మద్దతుగా నిలిచారు. ‘జడ్డూ భాయ్.. అలాంటి ఇడియట్ కామెంట్స్ పట్టించుకోవద్దు. నీ ఆట గురించి తెలియని వారికి రిప్లై ఇవ్వాల్సిన పనిలేదు’ అని చెప్పారు. జడేజా తీరుతో ఉలిక్కిపడిన తివారీ మాట మార్చాడు. ‘రిప్లై ఇచ్చినందుకు థాంక్స్. నా కామెంట్‌కు స్పందిస్తారో లేదోనని అలా చేశా. జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఇండియన్ టీమ్‌లో గొప్ప ఆల్‌రౌండర్‌వి. మన టీమ్‌కు చాలా అవసరం’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పాల్గొన్న జడేజా మంచి ప్రదర్శన చేశాడు. 7 వికెట్లు తీశాడు. చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో బౌలర్‌గా 5 స్థానంలో, ఆల్‌రౌండర్‌గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
సమాధానం దొరికిందా?
భారత్‌కు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టు నిరీక్షణ ఇది. కపిల్‌దేవ్ రిటైర్ అయిన తర్వాత ఎంతో మందిని పరీక్షించారు. రకరకాల ఆటగాళ్లను తెచ్చి అవకాశాలు కల్పించారు. కానీ ఇప్పటికీ ఆ లోటు తీరలేదు. కానీ ధర్మశాలలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసిన తర్వాత భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కష్టాలకు సమాధానం దొరికిందేమో అనిపిస్తోంది. ఒక్క మ్యాచ్‌లో మంచి ప్రదర్శనకే అతడిని పూర్తిగా ఆల్‌రౌండర్ అనడం తొందరపాటే కావచ్చు. కానీ పాండ్యా గత ఆరు నెలల కాలంలో పడిన కష్టం, మార్చుకున్న శైలి, తొలి వన్డేలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే... అన్నీ మంచి శకునాలుగానే కనిపిస్తున్నాయి. సాక్షి క్రీడావిభాగం పది నెలల క్రితం... ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో భారత్ టి20 మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన తొలి ఓవర్లో వరుసగా మొదటి మూడు బంతులూ వైడ్లు వేశాడు. ఓ సిక్సర్, ఓ ఫోర్ ఇచ్చాడు. మరో రెండు వైడ్లతో కలిపి మొత్తం ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేశాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు ఓవర్లలో ఏకంగా 37 పరుగులు ఇచ్చాడు. అయినా ధోనికి పాండ్యా మీద విశ్వాసం ఉంది. ఐపీఎల్లో తన ప్రదర్శనను రెండేళ్లపాటు చూసిన ఎవరికై నా పాండ్యా మీద నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం వల్ల అతను టి20 ప్రపంచకప్ వరకూ భారత్ ఆడిన 16 టి20ల్లోనూ బరిలోకి దిగాడు. నిజానికి అతను హిట్టింగ్ బాగా చేయగల బ్యాట్స్‌మన్. అవసరమైతే మీడియం పేసర్‌గా రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఇంతకాలం పాండ్యా పాత్ర ఇదే. ఐపీఎల్‌లోనూ కొత్త బంతితో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. నిజానికి ఆ పర్యటనకు పాండ్యా వెళతాడనే అనుకున్నారు. కానీ ఐపీఎల్లో పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులోకి రాలేదు. కట్ చేస్తే... ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో భారత్ తొలి వన్డే. ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ పూర్తి కాగానే ధోని బంతిని పాండ్యా వైపు విసిరాడు. ఇది అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. తొలి ఐదు బంతుల్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టాడు. అయితే మూడూ మంచి బంతులే. ఎడ్జలు తీసుకుని బౌండరీకి వెళ్లాయి. దీంతో ధోని అదనంగా మరో స్లిప్ తెచ్చాడు. ఆఖరి బంతికి స్లిప్స్‌లోనే క్యాచ్ ఇచ్చి గప్టిల్ వెనుదిరిగాడు. పాండ్యా పది నెలల క్రితం వేసిన తొలి ఓవర్‌కీ ఈ ఓవర్‌కీ ఏ మాత్రం సంబంధం లేదు. ఈసారి ఆత్మవిశ్వాసం కనిపించింది. ఫలితంతో సంబంధం లేకుండా అతను బంతులు వేయాల్సిన విధానం గురించి మాత్రమే ఆలోచించాడు. ఫలితం... ఏ ఆటగాడైనా కలలుగనే అరంగేట్రం. ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. లెగ్ స్పిన్నర్‌గా మొదలై... నిజానికి పాండ్యా కెరీర్ బ్యాట్స్‌మన్‌గానే మొదలైంది. అయితే అడపాదడపా లెగ్ స్పిన్ వేసేవాడు. అరుుతే ఓ రోజు నెట్స్‌లో అనుకోకుండా పేస్ బౌలింగ్ వేశాడు. అప్పటికి తను ఇంకా క్లబ్ క్రికెటర్ మాత్రమే. 2013లో ఓ క్లబ్ గేమ్ ద్వారానే పాండ్యాలోని పేస్ బౌలర్ బయటకు వచ్చాడు. పిచ్ మొత్తం పచ్చికతో ఉంది. జట్టులో సరైన పేసర్లు లేరు. దీంతో పాండ్యాకు కొత్త బంతి ఇచ్చారు. అతను ఏకంగా ఎనిమిది వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించాడు. బరోడా రంజీ కోచ్ సనత్ కుమార్ ఇది చూశారు. దీంతో హార్దిక్‌ను పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చే ప్రయత్నం చేశారు. 2015 ఐపీఎల్లో ముంబై ఇండియన్స జట్టులో ప్రదర్శన ద్వారా పాండ్యా కెరీర్ ఒక్కసారిగా మారిపోరుుంది. అరుుతే కేవలం భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గానే అతనికి గుర్తింపు లభించింది. నిజానికి పాండ్యా తన పేస్ బౌలింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి కారణం గాయాలు. 2013లో తను పేస్ బౌలర్‌గా మారిన తర్వాత కనీసం నెలకు ఒకసారైనా ఏదో ఒక గాయం బారిన పడ్డాడు. ఫిట్నెస్ పెరిగింది పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్లో పేలవంగా ఆడాడు. భారత టి20 ఆటగాడిగా జట్టులో కీలకంగా మారాల్సిన హార్దిక్... ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 44 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ విఫలమై మూడు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో భారత ద్వితీయశ్రేణి జట్టులోనూ తనకు చోటు దక్కలేదు. ఈ దశలో తన కెరీర్ వెనకబడిందని భావించిన పాండ్యా... మళ్లీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టాడు. ఈసారి ఆట కంటే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ‘ఎ’ జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లినా పెద్దగా రాణించలేదు. అరుుతే అక్కడ కూడా ఫిట్నెస్నే ప్రధాన ఎజెం డాగా పెట్టుకున్నాడు. ప్రయోగాల వేళ... నిజానికి పాండ్యా వన్డే జట్టులోకి వస్తాడనే ఆలోచన ఎవరిలోనూ లేదు. అరుుతే ఇంగ్లండ్‌లో వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీని నిలబెట్టుకోవాలనే అజెండాతో ప్రస్తుతం భారత్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఆ మెగా టోర్నీకి ముందు ఉన్న ఎనిమిది వన్డేల ద్వారా రకరకాల ఆటగాళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే కచ్చితంగా జట్టులో ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండాలి. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ కాకుండా దేశవాళీ క్రికెట్లో కనిపిస్తున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం హార్దిక్ పాండ్యా. దీంతో జట్టులో చోటు దక్కింది. నెట్స్‌లో తను బంతులు వేసిన తీరు కెప్టెన్ ధోనితో పాటు కోచ్ కుంబ్లేను కూడా ఆకర్షించింది. పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేయగలడు. కానీ ఈసారి ఏకంగా 140 కిలోమీటర్లను మించిన వేగంతోనూ బంతులు వేశాడు. ఇది ధోనికి పెద్ద రిలీఫ్ ఇచ్చిం ది. ‘తుది జట్టులో ఉండే ముగ్గురు సీమర్లలో అతను ఒకడిగా ఎదిగితే మాకు చాలా సమస్యలు తగ్గిపోతారుు. చాలా మంది బౌలర్లు బంతిని స్వింగ్ చేయలేని పిచ్‌లపై కూడా పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేస్తాడు. తొలి వన్డేలో అతని బంతుల్లో వేగం కూడా పెరిగింది. ఒకసారి కొత్త బంతి ఇచ్చి చూడాలని భావించాం. అతను కొత్త బంతిని బాగా వాడితే... బుమ్రాను మధ్య ఓవర్లలో, స్లాగ్ ఓవర్లలో వాడుకోవచ్చు. ఇదే తరహాలో పాండ్యా బౌలింగ్ చేస్తే చాంపియన్స ట్రోఫీ సమయానికి అతనే మా మొదటి పేసర్ కూడా కావచ్చు’ అంటూ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రానున్న మ్యాచ్‌లు కీలకం వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీకి తుది జట్టులో బెర్త్ పాండ్యాకు కచ్చితంగా ఖరారరుుందని చెప్పలేం. రాబోయే మ్యాచ్‌లలో అతను బౌలర్‌గా ఎలాంటి ప్రభావం చూపుతాడనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. మిగిలిన మ్యాచ్‌లు జరిగే వికెట్లు కూడా ధర్మశాల తరహాలో పేసర్లకు సహకరించకపోవచ్చు. అరుుతే తొలి వన్డే ఇచ్చిన ఆత్మవిశ్వాసం పాండ్యాను ముందుకు తీసుకువెళుతుంది. 38 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోజునే.. పాండ్యా కూడా తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు. తన క్యాప్ కూడా ఆ దిగ్గజం చేతుల మీదుగానే అందుకున్నాడు. మరి ఆ దిగ్గజం వారసుడి కోసం రెండు దశాబ్దాలుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సమాధానంగా హార్దిక్ పాండ్యా ఎదుగుతాడా..? రాబోయే పదిహేను రోజుల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. -
50 టెస్టులాడాకే అంచనాకు రావాలి: కపిల్ దేవ్
బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా తేల్చేందుకు అతడు కనీసం 50 టెస్టులైనా ఆడాల్సి ఉంటుందని విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ రెండు, మూడు సిరీస్‌లు మెరుగ్గా రాణించినంత మాత్రాన ఒక ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా పరిగణించలేమని ఆయన అన్నారు. ‘ఓ ఆటగాడిని ఉత్తమ ఆల్‌రౌండర్ కేటగిరీలో చేర్చాలంటే అతడికి కనీసం 50 టెస్టులాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే అతడి గురించి ఓ అంచనాకు రావాలి. అంతేకానీ స్వల్ప కాలంలోనే అతడిపై ఓ అంచనాకు రావడం సరికాదు. అరుుతే ప్రస్తుత తరం ఆల్రౌండర్లకు చాలా నైపుణ్యం ఉంది. వారిని గౌరవించాల్సిందే’ అని కపిల్ చెప్పారు. ఫాస్ట్ బౌలింగ్‌తో కూడిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో తానే చివరి వాడినని స్పష్టం చేశారు. -
అశ్విన్ మరో ఘనత
* ఐసీసీ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ * భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ దుబాయ్: భారత క్రికెటర్ అశ్విన్ మరో అద్భుత ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గతంలో వినూ మన్కడ్, కపిల్‌దేవ్ మాత్రమే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించడంతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ సాధించిన అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 427 పాయింట్లు ఉన్నాయి. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ తిరిగి నంబర్‌వన్ స్థానానికి చేరాడు. గతేడాది చివర్లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్... ఆరు నెలల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అండర్సన్ (875పాయింట్లు) అశ్విన్‌కన్నా ఒక్క పాయింట్ తక్కువగా ఉన్నాడు. -
నా శైలే అంత
క్రీజులోకి వచ్చిన వెంటనే షాట్లు ఆడటం తనకు మొదటి నుంచీ అలవాటని, క్రికెట్లో తన శైలి అదేనని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. కొంతమంది తనని పించ్ హిట్టర్ అంటున్నారని, కానీ తాను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌నే అని అన్నాడు. -
వద్దనుకున్నవాడే...
జడేజా అద్భుత పునరాగమనం తొలి టెస్టులో సత్తా చాటిన ఆల్‌రౌండర్ సిరీస్‌లో సఫారీలకు సవాల్ 3 మ్యాచ్‌లలో 37 వికెట్లు... సొంతగడ్డ రాజ్‌కోట్‌లో జడేజా ప్రదర్శన ఇది. త్రిపుర, జార్ఖండ్, హైదరాబాద్... మూడు బలహీన గ్రూప్ ‘సి’ జట్లే కాబట్టి అతని ప్రదర్శనకు గుర్తింపు దక్కదని అనిపించింది. కానీ స్పిన్‌కు భీకరంగా అనుకూలించిన ఆ వికెట్‌పై అతని తిప్పుడు సెలక్టర్ల దృష్టిని దాటిపోలేదు. అందుకే టెస్టు సిరీస్‌లో ఈ రేసుగుర్రం అవసరాన్ని వారు గుర్తించారు. భారత్‌లో ఆడిన ఆరు టెస్టులలో కేవలం 17.28 సగటుతో జడేజా తీసిన వికెట్లు 35... అతని లెఫ్టార్మ్ స్పిన్ పదును ఏమిటో చూపించే అసాధారణ ప్రదర్శన ఇది. ఇప్పుడు జడేజా విలువ మళ్లీ కనిపించింది. ఇక కొన్నాళ్ల పాటు ‘సర్’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలూ కనిపించవు. ఎందుకంటే జట్టు కెప్టెన్ మారినా సత్తా ఉంటే సిఫార్సులతో పని లేదని అతను నిరూపించాడు. ‘మీకు ఇష్టం ఉన్నా లేకున్నా భారత్‌లో ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్లు ముగ్గురే. జడేజా, బిన్నీ, అక్షర్’ ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ పరాజయం అనంతరం కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. ఫార్మాట్ గురించి స్పష్టంగా చెప్పకపోయినా, తన అనుంగు అనుచరుడు జడేజాను వెనకేసుకొస్తున్న తీరు ఇందులో కనిపిస్తుంది కానీ అతనిపై కెప్టెన్ నమ్మకం ఏమిటో కూడా చూపిస్తుంది. అక్షర్ ఇంత వరకు టెస్టులు ఆడలేదు. తన శైలికి సరిగ్గా సరిపోయే ఇంగ్లండ్‌లాంటి చోట కూడా మూడు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బిన్నీ ప్రదర్శనను ఏ మాత్రం గొప్పగా పరిగణించలేం. అదే జడేజా కెరీర్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తాను ఆడిన 13 టెస్టుల్లో ఒక్క నాటింగ్‌హామ్‌లో మినహా అతను అన్ని మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ సాధించి భారత్ గెలిచేందుకు తన బ్యాటిం గ్తోనూ కారణంగా నిలిచిన జడేజా, బౌలింగ్ సగటు (27.22) దాదాపు అశ్విన్ (27.54) తో సమానంగా ఉంది. అయినా సరే అతను మొహాలీకి ముందు భారత్ ఆడి న గత 9 టెస్టులకు దూరమయ్యాడు. కచ్చితత్వమే బలం... జట్టు ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌తో పోలిస్తే జడేజా బౌలింగ్‌లో ఎక్కువగా వైవిధ్యం కనిపించదు. అతనూ ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడడు. నేరుగా వికెట్‌పైకి బంతిని విసరడమే అతని బలం. ముఖ్యంగా సొంతగడ్డపై అతని బంతులు ఒక్కసారిగా బ్యాట్స్‌మెన్ దృష్టిలో అసాధారణంగా మారిపోతాయి. మొహాలి పిచ్‌లో చాలా టర్న్ కనిపించింది. కానీ అలాంటి సమయంలో కూడా అతని బంతులు సరిగ్గా ఆఫ్స్టంప్పైనే పడ్డాయి. దాంతో అతడిని ఎదుర్కొవడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డు ప్లెసిస్ బౌల్డ్ అయిన బంతి, రెండో ఇన్నింగ్స్‌లో ఆమ్లా, విలాస్ బౌల్డ్ అయిన బంతులు బ్యాట్స్‌మెన్ టర్నింగ్ గురించి చేసిన తప్పుడు అంచనాల ఫలితమే! బంతి బంతికీ మధ్య విరామం ఎక్కువగా ఇవ్వకుండా వేగంగా బౌలింగ్ చేసే అతని శైలి క్రీజ్‌లో ఉన్న ఆటగాడికి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఇవ్వదు. పైగా పరుగుల రాక ఒత్తిడి పెరిగిపోతుంది. రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డ తరహాలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో మున్ముందు జడేజా బారిన పడేటట్లే కనిపిస్తోంది. నాటి సిరీస్‌లో జడేజా కేవలం 17.49 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తుడైన క్లార్క్ఐదు సార్లు జడేజాకే అవుటయ్యాడు. జోరు కొనసాగించాలి... ఒకట్రెండు వైఫల్యాలతో పాటు భుజం గాయం కూడా జడేజా అంతర్జాతీయ కెరీర్‌పై కొంత సందేహాలు రేకెత్తించింది. అయితే ఇప్పుడు అత్యుత్తమ ఫిట్నెస్తో తిరిగొచ్చాడు. సాధారణంగా టెస్టుల్లో కనిపించని గ్రౌండ్ ఫీల్డింగ్‌లో అద్భుతమైన చురుకుదనం, బౌలింగ్‌లో కచ్చితత్వానికి తోడు అవసరమైనప్పుడు ఉపయోగపడే బ్యాటింగ్‌తో ఇప్పుడు జడేజా కొత్తగా కనిపిస్తున్నాడు. తొలి టెస్టులో జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించిన బ్యాట్స్‌మెన్ డిఫెన్స్ ఆడిన ప్రతీసారి మళ్లీ వెనక్కి అంతే వేగంగా క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. ఎందుకంటే అటునుంచి జడేజా స్పందించే వేగానికి రనౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి. ఒక్కసారి స్థానం కోల్పోయాక తిరిగి రావడం ఏ ఆటగాడికైనా చాలా కష్టమైన విషయం. కానీ పట్టుదలగా శ్రమించిన జడేజా తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. భవిష్యత్తులోనూ భారత బలం అంటూ టెస్టు కెప్టెన్ కోహ్లి అభిమానాన్ని కూడా చూరగొన్న జడేజా...మరి కొన్నాళ్లు టెస్టుల్లో భారత్ తరఫున కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి. -
వచ్చే నెల 4న హఫీజ్‌కు బౌలింగ్ పరీక్ష!
కరాచీ: కీలకమైన ప్రపంచకప్‌కు ముందే తమ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌ను బయోమెకానిక్ పరీక్ష నుంచి గట్టెక్కించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం హఫీజ్ బౌలింగ్‌ను మరోసారి అంచనా వేయాలని అధికారికంగా ఐసీసీని కోరింది. దీంతో ఫిబ్రవరి 4న ఆల్‌రౌండర్ బ్రిస్బేన్‌లో పరీక్షకు హాజరయ్యే అవకాశాలున్నాయని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే కంటే ముందు కివీస్‌లో తన బౌలింగ్‌పై మరిన్ని కసరత్తులు చేసుకునేందుకు హఫీజ్‌కు అవకాశం ఇవ్వాలని పాక్ టీమ్ మేనేజ్మెంట్ పీసీబీకి సూచించింది. మరోవైపు ఐసీసీ నుంచి క్లియరెన్స్ రాకపోతే హఫీజ్ తుది జట్టులో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్, చెన్నైల్లో జరిగిన అనధికారి పరీక్షల్లో బౌలర్ విఫలమయ్యాడు. అయితే ఈ రెండు టెస్టుల్లో హఫీజ్ విఫలమైనా... అతని బౌలింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉందని సదరు అధికారి వెల్లడించారు. స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఐసీసీ అధికారిక బయోమెకానిక్ పరీక్ష కోసం శుక్రవారం చెన్నైకి వెళ్లనున్నాడు. జెర్సీ నంబర్లలో మార్పులు వరల్డ్‌కప్‌లో రాణించేందుకు వీలుగా కొంత మంది పాక్ ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పులు చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక గురువులను సంప్రదించిన తర్వాత ఉమర్ అక్మల్ తన జెర్సీ నంబర్ 96 స్థానంలో 3ను ఎంచుకున్నాడు. హరిస్ సోహైల్ 80 స్థానంలో 89వ నంబర్‌ను తీసుకున్నాడు. బౌలర్లందరూ డబుల్ డిజిట్ నంబర్లను ఎంచుకున్నారు. వహబ్ రియాజ్ 47, ఎహ్సాన్ అదిల్ 91, యాసిర్ షా 86ను ధరించనున్నారు. ఆఫ్రిది 10, మిస్బా 22, యూనిస్ 75 నంబర్లతోనే కొనసాగుతున్నారు. గతంలో ఇంజమామ్ ధరించిన 8వ నంబర్‌ను హఫీజ్‌కు పాక్ బోర్డు కేటాయించింది. -
ఈ అమ్మాయి ఆల్‌రౌండర్!
అమెరికాలో ఉంటున్న భారతీయసంతతి అమ్మాయి సురభిని చూస్తే ముచ్చటేస్తుంది. పదిహేనేళ్ల సురభి బెరివాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రైటర్, డ్యాన్సర్, ఫైటర్‌గా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సురభి చదువులో కూడా దూసుకుపోతోంది. స్పానిష్ భాష నేర్చుకొని ‘నేషనల్ స్పానిష్ ఎగ్జామ్’లో బంగారు పతకాన్ని అందుకుంది. ‘‘రచన అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెబుతున్న సురభి కోల్‌కతాలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(అమెరికా)కు వచ్చింది. వ్యాసాలు, నాటికలు, కవిత్వం రాయడం అంటే సురభికి చాలా ఇష్టం. ‘ఆస్క్ ఆల్సన్’ పేరుతో ఆమె రాసిన నాటికకు మంచి పేరు వచ్చింది. వివిధ సామాజిక సమస్యపై సురభి రాసిన వ్యాసాలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. గత సంవత్సరం ఫోర్త్-డిగ్రీ బ్లాక్‌బెల్ట్ తీసుకోవడం ద్వారా కరాటేలో తన సత్తా చాటింది సురభి. స్కూల్ ‘స్పీచ్ అండ్ డిబేట్ టీమ్’కు సెక్రటరీగా మంచి మార్కులు కొట్టేసింది. స్వచ్ఛంద సేవ అంటే సురభికి చాలా ఇష్టం. స్థానిక రోటరీ క్లబ్, స్కూల్లోని ‘నేషనల్ హానర్స్ సొసైటీ’ తరఫున ఎన్నో రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంది. ‘‘ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. గాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ బోధనల గురించి ఎప్పుడూ చెబుతుంటారు’’ అంటుంది సురభి. తన సోదరుడు సంజీత్ తరచుగా గుర్తు చేసే వాక్యం- ‘కల కను. కలను నిజం చేసుకో’ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న యువతను ఉద్దేశించి ఒక నవల రాసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది సురభి. -
ఐపీఎల్‌తో ఎదుగుతా
సన్‌రైజర్స్ ఆటగాడు రసూల్ విశ్వాసం న్యూఢిల్లీ: క్రికెటర్‌గా తన ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదని జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ అన్నాడు. తొలిసారిగా గత ఏడాది ఐపీఎల్-6లో పుణె వారియర్స్‌కు ఎంపికైన రసూల్.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అయితే కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే తుదిజట్టులో అతనికి స్థానం దక్కింది. ఆ తరువాత కోహ్లి సారథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టుకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ, ఈ విషయంలో తనకు ఎటువంటి నిరాశ లేదని, జట్టుకు ఎంపికవడం, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకొనే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నానని రసూల్ అన్నాడు. ఇక ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంతో ఐపీఎల్-7 ద్వారా తనను తాను నిరూపించుకునే అవకాశం రానుందని చెబుతున్నాడు. ‘వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడంపైనే దృష్టి నిలిపాను. క్రికెటర్‌గా నా ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదు. సన్‌రైజర్స్ జట్టులోని జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడనుండటం కచ్చితంగా అందుకు దోహదపడేదే’ అని 25 ఏళ్ల రసూల్ అన్నాడు. ఇక యువరాజ్ విషయంలో అభిమానుల తీరును అతడు ఖండించాడు. -
ఆల్‌రౌండర్
టీటీలో సబ్ జూనియర్ నంబర్‌వన్ బుల్లెట్ నడుపుతుంది... రెండు చేతుల్తో ఒకేలా రాస్తుంది... సరిగమలు పలికిస్తుంది మహాభారతం కంఠతా చెబుతుంది 14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసుకుంటోందిఅసలు సిసలు ఆల్‌రౌండర్ నైనాజైస్వాల్ నైనాకు మూడేళ్ల వయసులో తల్లిదండ్రులు అశ్విన్‌కుమార్, భాగ్యలక్ష్మి ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించారు. రెండే సంవత్సరాల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు నేర్చేసుకుంది. మరో మూడేళ్లలోనే గణితం, సైన్స్, సోషల్ పాఠాలను అలవోకగా నేర్చేసుకుంది. 8 ఏళ్ల వయసులో 2008లో నైనాను టెన్త్ క్లాస్ పరీక్షలు రాయించాలని భావించారు. కానీ రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలు దీనికి అనుమతించలేదు. దాంతో ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్సీ) పరీక్షకు హాజరయ్యేందుకు నైనాను సిద్ధం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఈ పరీక్షకు (ఎస్ఎస్సీతో సమానం) హైదరాబాద్‌లోని రెండు పాఠశాలల్లో మాత్రమే అవకాశముంది. ఐజీసీఎస్సీ సీఈఓ ప్రత్యేక అనుమతితో ఈ పరీక్షకు హాజరైన నైనా ‘ఎ’ డివిజన్లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఇంటర్మీడియెట్... ఇప్పుడు డిగ్రీ పూర్తి కావచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నైనా 14 ఏళ్ల వయసులో ఈ నెలల్లోనే బీఏ (మాస్ కమ్యూనికేషన్) చివరి సంవత్సరం పరీక్షలకు హాజరు కానుంది. ్యసాచి... చదువులో మేటిగా మారిన నైనా... విభిన్న అంశాలలో వయసుకు మించిన ప్రజ్ఞతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే సారి రెండు చేతులతో ఒకే రకంగా రాయగలగడం ఆమె ప్రత్యేకత. కీబోర్డుపై సరిగమలు పలికించడంతో పాటు చక్కగా పాడటంలో కూడా ఆమె దిట్ట. 2.7 సెకన్లలో కంప్యూటర్ కీబోర్డుపై ఎ టు జెడ్ అక్షరాలను టైప్ చేస్తుంది. రామాయణ, మహాభారతాల్లోని అన్ని శ్లోకాలు (హిందీ) ఈ చిన్నారికి కంఠతా వచ్చు. పెద్దలకే సాధ్యమయ్యే భారీ సైజు బుల్లెట్‌ను ఆమె అలవోకగా నడిపించగలదు. ఇంట్లో అందరికీ ప్రీతిపాత్రమైన హైదరాబాద్ బిర్యానీని 25 నిమిషాల్లో తయారు చేస్తుంది. నైనా జైస్వాల్ భిన్నమైన అంశాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నా...ప్రొఫెషనల్ క్రీడాకారిణిగానే ఆమెకు అసలు గుర్తింపు. ఎనిమిదేళ్ల వయసులో టేబుల్ టెన్నిస్‌లో అడుగు పెట్టిన ఆమె అంతే వేగంగా దూసుకుపోయింది. రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు అందుకున్న నైనా... జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో ఇప్పటికే 15 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు నెగ్గింది. అండర్-15లో ఆమె ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో ఉంది. అండర్-18లో 7, అండర్-21లో 10వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. నైనా కెరీర్లో దూసుకుపోయే మరో గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య 2020 ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో నైనా జైస్వాల్‌కు అవకాశం దక్కింది. రాష్ట్రంనుంచి దీనికి ఎంపికైన ఒకే అమ్మాయి నైనా కావడం విశేషం.