వద్దనుకున్నవాడే...
జడేజా అద్భుత పునరాగమనం
తొలి టెస్టులో సత్తా చాటిన ఆల్‌రౌండర్
సిరీస్‌లో సఫారీలకు సవాల్
3 మ్యాచ్‌లలో 37 వికెట్లు... సొంతగడ్డ రాజ్‌కోట్‌లో జడేజా ప్రదర్శన ఇది. త్రిపుర, జార్ఖండ్, హైదరాబాద్... మూడు బలహీన గ్రూప్ ‘సి’ జట్లే కాబట్టి అతని ప్రదర్శనకు గుర్తింపు దక్కదని అనిపించింది. కానీ స్పిన్‌కు భీకరంగా అనుకూలించిన ఆ వికెట్‌పై అతని తిప్పుడు సెలక్టర్ల దృష్టిని దాటిపోలేదు. అందుకే టెస్టు సిరీస్‌లో ఈ రేసుగుర్రం అవసరాన్ని వారు గుర్తించారు.
భారత్‌లో ఆడిన ఆరు టెస్టులలో కేవలం 17.28 సగటుతో జడేజా తీసిన వికెట్లు 35... అతని లెఫ్టార్మ్ స్పిన్ పదును ఏమిటో చూపించే అసాధారణ ప్రదర్శన ఇది. ఇప్పుడు జడేజా విలువ మళ్లీ కనిపించింది. ఇక కొన్నాళ్ల పాటు ‘సర్’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలూ కనిపించవు. ఎందుకంటే జట్టు కెప్టెన్ మారినా సత్తా ఉంటే సిఫార్సులతో పని లేదని అతను నిరూపించాడు.
‘మీకు ఇష్టం ఉన్నా లేకున్నా భారత్‌లో ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్లు ముగ్గురే. జడేజా, బిన్నీ, అక్షర్’ ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ పరాజయం అనంతరం కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. ఫార్మాట్ గురించి స్పష్టంగా చెప్పకపోయినా, తన అనుంగు అనుచరుడు జడేజాను వెనకేసుకొస్తున్న తీరు ఇందులో కనిపిస్తుంది కానీ అతనిపై కెప్టెన్ నమ్మకం ఏమిటో కూడా చూపిస్తుంది. అక్షర్ ఇంత వరకు టెస్టులు ఆడలేదు. తన శైలికి సరిగ్గా సరిపోయే ఇంగ్లండ్‌లాంటి చోట కూడా మూడు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బిన్నీ ప్రదర్శనను ఏ మాత్రం గొప్పగా పరిగణించలేం. అదే జడేజా కెరీర్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తాను ఆడిన 13 టెస్టుల్లో ఒక్క నాటింగ్‌హామ్‌లో మినహా అతను అన్ని మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ సాధించి భారత్ గెలిచేందుకు తన బ్యాటిం గ్‌తోనూ కారణంగా నిలిచిన జడేజా, బౌలింగ్ సగటు (27.22) దాదాపు అశ్విన్ (27.54) తో సమానంగా ఉంది. అయినా సరే అతను మొహాలీకి ముందు భారత్ ఆడి న గత 9 టెస్టులకు దూరమయ్యాడు.
కచ్చితత్వమే బలం...
జట్టు ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌తో పోలిస్తే జడేజా బౌలింగ్‌లో ఎక్కువగా వైవిధ్యం కనిపించదు. అతనూ ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడడు. నేరుగా వికెట్‌పైకి బంతిని విసరడమే అతని బలం. ముఖ్యంగా సొంతగడ్డపై అతని బంతులు ఒక్కసారిగా బ్యాట్స్‌మెన్ దృష్టిలో అసాధారణంగా మారిపోతాయి. మొహాలి పిచ్‌లో చాలా టర్న్ కనిపించింది. కానీ అలాంటి సమయంలో కూడా అతని బంతులు సరిగ్గా ఆఫ్‌స్టంప్‌పైనే పడ్డాయి. దాంతో అతడిని ఎదుర్కొవడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డు ప్లెసిస్ బౌల్డ్ అయిన బంతి, రెండో ఇన్నింగ్స్‌లో ఆమ్లా, విలాస్ బౌల్డ్ అయిన బంతులు బ్యాట్స్‌మెన్ టర్నింగ్ గురించి చేసిన తప్పుడు అంచనాల ఫలితమే! బంతి బంతికీ మధ్య విరామం ఎక్కువగా ఇవ్వకుండా వేగంగా బౌలింగ్ చేసే అతని శైలి క్రీజ్‌లో ఉన్న ఆటగాడికి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఇవ్వదు. పైగా పరుగుల రాక ఒత్తిడి పెరిగిపోతుంది. రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డ తరహాలోనే ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో మున్ముందు జడేజా బారిన పడేటట్లే కనిపిస్తోంది. నాటి సిరీస్‌లో జడేజా కేవలం 17.49 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తుడైన క్లార్క్‌ఐదు సార్లు జడేజాకే అవుటయ్యాడు.
జోరు కొనసాగించాలి...
ఒకట్రెండు వైఫల్యాలతో పాటు భుజం గాయం కూడా జడేజా అంతర్జాతీయ కెరీర్‌పై కొంత సందేహాలు రేకెత్తించింది. అయితే ఇప్పుడు అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో తిరిగొచ్చాడు. సాధారణంగా టెస్టుల్లో కనిపించని గ్రౌండ్ ఫీల్డింగ్‌లో అద్భుతమైన చురుకుదనం, బౌలింగ్‌లో కచ్చితత్వానికి తోడు అవసరమైనప్పుడు ఉపయోగపడే బ్యాటింగ్‌తో ఇప్పుడు జడేజా కొత్తగా కనిపిస్తున్నాడు. తొలి టెస్టులో జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించిన బ్యాట్స్‌మెన్ డిఫెన్స్ ఆడిన ప్రతీసారి మళ్లీ వెనక్కి అంతే వేగంగా క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. ఎందుకంటే అటునుంచి జడేజా స్పందించే వేగానికి రనౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి. ఒక్కసారి స్థానం కోల్పోయాక తిరిగి రావడం ఏ ఆటగాడికైనా చాలా కష్టమైన విషయం. కానీ పట్టుదలగా శ్రమించిన జడేజా తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. భవిష్యత్తులోనూ భారత బలం అంటూ టెస్టు కెప్టెన్ కోహ్లి అభిమానాన్ని కూడా చూరగొన్న జడేజా...మరి కొన్నాళ్లు టెస్టుల్లో భారత్ తరఫున కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.