
2024లో ప్రదర్శన ఆధారంగా టీమ్ ప్రకటన
దుబాయ్: గతేడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్–2024’ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. 11 మందితో కూడిన ఈ జట్టుకు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సారథిగా ఎంపిక చేయగా... జట్టులో బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రూపంలో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది.
న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ ఎంపిక కాగా... శ్రీలంక నుంచి కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా... టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో 20కి లోపు సగటుతో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన బుమ్రా... ఇటీవల‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
జడేజా గతేడాది 527 పరుగులు చేయడంతో పాటు... 48 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో ప్రధాన ప్లేయర్లంతా విఫలమైన చోట చక్కటి ప్రదర్శన కనబర్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... గతేడాది 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1556) అగ్రస్థానంలో ఉండగా... జైస్వాల్ రెండో ‘ప్లేస్’లో నిలిచాడు.
23 ఏళ్ల జైస్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది విలియమ్సన్ 1013 పరుగులు చేయగా... శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ 1049 పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోపీ’అందించిన ఆసీస్ సారథి కమిన్స్ 2024లో 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 306 పరుగులు చేశాడు.
మరోవైపు ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’లో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్‌కూ చోటు దక్కలేదు. గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటంతో మన ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. వన్డే జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత అసలంక కెపె్టన్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: కమిన్స్ (కెప్టెన్ ; ఆ్రస్టేలియా) యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా (భారత్), డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (ఇంగ్లండ్), విలియమ్సన్, హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక).