రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, జడేజా విఫలం
భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సీనియర్లు
బుమ్రా పోరాటానికి దక్కని ఫలితం
భవిష్యత్‌కు భరోసానిచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్
ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్‌రౌండరే అయినా అటు బ్యాట్‌తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా...
పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్‌వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది.
గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్‌తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది.
అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు.
మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు.
విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్‌స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
నిలకడలేమే ప్రధాన సమస్య
రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్‌లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.
సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్‌లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు.
మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్‌మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది.
చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
నితీశ్, యశస్వి అదుర్స్
పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు.
ఐదు మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్‌రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్‌కు తోడు చక్కటి బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌పై తనదైన ముద్రవేశాడు.
9 ఇన్నింగ్స్‌లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టి20 ఫార్మాట్‌లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్‌బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్‌లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది.
ఇక ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment