బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా | The Indian team came close to victory in the first Test in Border Gavaskar Trophy | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా

Published Mon, Nov 25 2024 3:51 AM | Last Updated on Mon, Nov 25 2024 10:19 AM

The Indian team came close to victory in the first Test in Border Gavaskar Trophy
  • పెర్త్‌ టెస్టులో గెలుపు దిశగా భారత్‌
  • యశస్వి జైస్వాల్‌ భారీ సెంచరీ
  • విరాట్‌ కోహ్లి అజేయ శతకం
  • టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 487/6 డిక్లేర్డ్
  • ఆస్ట్రేలియా లక్ష్యం 534; ప్రస్తుతం 12/3
  • బెంబేలెత్తించిన బుమ్రా

కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భారత్‌ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్‌ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్‌ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!

పెర్త్‌: ప్రతిష్టాత్మక ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్‌ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. 

ఓవర్‌నైట్‌ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్‌ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. 

లయన్‌ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్‌ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. 

మెక్‌స్వీనీ (0), కమిన్స్‌ (2), లబుషేన్‌ (3) అవుట్‌ కాగా... ఉస్మాన్‌ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్‌... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్‌లోనే ఆసీస్‌ ఆట ముగిసే అవకాశాలున్నాయి. 

‘జై’స్వాల్‌ గర్జన  
సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్‌... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్‌... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్‌ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్‌.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

స్టార్క్‌ వేసిన బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌తో జైస్వాల్‌ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్‌. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్‌ చేరిన జైస్వాల్‌... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయగా... దేవదత్‌ పడిక్కల్‌ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్‌ పెవిలియన్‌ చేరగా... జైస్వాల్‌ 275 బంతుల్లో 150 మార్క్‌ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్‌ చివరకు మార్ష్బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

‘కోహ్లి’నూర్‌ ఇన్నింగ్స్‌... 
చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్‌ కోహ్లి... ‘క్లాస్‌ శాశ్వతం, ఫామ్‌ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్‌ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్‌ కవర్‌ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్‌ (1), జురేల్‌ (1) అవుట్‌ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 

వాషింగ్టన్‌ సుందర్‌ (29; ఒక సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్‌ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్‌ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్‌ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 104; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) మార్ష్161; రాహుల్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 77; పడిక్కల్‌ (సి) స్మిత్‌ (బి) హాజల్‌వుడ్‌ 25; కోహ్లి (నాటౌట్‌) 100; పంత్‌ (స్టంప్డ్‌) కేరీ (బి) లయన్‌ 1; జురేల్‌ (ఎల్బీ) (బి) కమిన్స్‌ 1; సుందర్‌ (బి) లయన్‌ 29; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్‌) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్‌: స్టార్క్‌ 26–2–111–1; హాజల్‌వుడ్‌ 21–9–28–1; కమిన్స్‌ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్‌ 39–5–96–2; లబుషేన్‌ 6.3–0–38–0; హెడ్‌ 5–0–26–0. ఆస్ట్రేలియా 
రెండో ఇన్నింగ్స్‌: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్‌) 3; కమిన్స్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 2; లబుషేన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్‌: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్‌ 2–0–7–1.

201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్‌ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్‌–శ్రీకాంత్‌ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది.  

3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్‌ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్‌ ఈ ఘనత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement