Border-Gavaskar Trophy
-
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్‌రౌండరే అయినా అటు బ్యాట్‌తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్‌వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్‌తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్‌స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్‌లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్‌లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్‌మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్‌రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్‌కు తోడు చక్కటి బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్‌లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్‌లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్‌లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్
సిడ్నీ: ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ విజేతకు ట్రోఫీ అందజేసే సమయంలో తనను ఆహ్వానించకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1996–97 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నిర్వహిస్తుండగా... తాజాగా జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు 3–1తో విజయం సాధించింది. ఆదివారం ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు ఆ్రస్టేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ట్రోఫీ బహుకరించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ... ‘ట్రోఫీ ఇచ్చే సమయంలో అక్కడ ఉండటాన్ని ఇష్టపడేవాడిని. భారత్, ఆస్ట్రేలియా మధ్య అదీ బోర్డర్–గావస్కర్ సిరీస్ కదా. ఆ సమయంలో నేను మైదానంలోనే ఉన్నా. మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆ్రస్టేలియా గెలిచింది. నా స్నేహితుడు బోర్డర్‌తో కలిసి ట్రోఫీ అందించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని’ అని అన్నాడు. మరోవైపు క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) స్పందన దీనికి భిన్నంగా ఉంది. సిరీస్‌లో ఆ్రస్టేలియా విజేతగా నిలిస్తే అలెన్ బోర్డర్... భారత్ గెలిస్తే సునీల్ గావస్కర్ ట్రోఫీ అందించాలని నిర్ణయించినట్లు సీఏ తెలిపింది. ఈ విషయాన్ని వారిదద్దరికీ గతంలోనే చెప్పినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఆసీస్
-
రోహిత్‌ను తప్పించి తుది సమరానికి!
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో గాయం, నిషేధం లేదా మరో వ్యక్తిగత కారణంతో కాకుండా ఫామ్ లేకపోవడంతో తుది జట్టుకు దూరమైన కెపె్టన్ ఇప్పటి వరకు ఎవరూ లేరు! కానీ ఇప్పుడు తొలిసారి రోహిత్ శర్మ అలాంటి స్థితిలో నిలిచాడు. వరుస వైఫల్యాలు, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలవంటి వార్తల నేపథ్యంలో రోహిత్‌పై వేటు పడింది. నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే చివరి టెస్టులో అతడిని టీమ్ మేనేజ్మెంట్ తప్పించడం ఖాయమైంది. సిరీస్‌లో తొలి పోరులో భారత్‌ను గెలిపించిన బుమ్రా నాయకత్వంలోనే ఇప్పుడు సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. భారత్ గెలిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే ఆశలు ఇంకా మిగిలి ఉంటాయి. ఆసీస్ గెలిస్తే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. సిడ్నీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్ చివరి అంకానికి చేరింది. నేటి నుంచి జరిగే ఐదో టెస్టులో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆసక్తికరంగా సాగిన సమరంలో ప్రస్తుతం 1–2తో వెనుకబడిన భారత్ ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై భారత్ చేతిలో గత రెండు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లు ఓడిన ఆ్రస్టేలియా ఈసారి ఎలాగైనా తమ స్థాయిని ప్రదర్శించి ట్రోఫీని గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు పూర్తిగా కోల్పోతుంది. సిడ్నీ పిచ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించవచ్చు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువ. రోహిత్ స్థానంలో గిల్... కెపె్టన్ రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడే విషయంపై స్పందిస్తూ గురువారం ‘ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని కోచ్ గంభీర్ చెప్పడంలోనే రోహిత్ స్థానంలో సందేహం కనిపించింది. ఈ సిరీస్‌లో వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు దూరమైన రోహిత్... ఆ తర్వాత 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 31 పరుగులే చేశాడు. ఇది ఆందోళనకరమే అయినా... వేటు పడవచ్చని ఎవరూ ఊహించలేదు. కానీ కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్‌తో చర్చించిన తర్వాత మ్యాచ్‌కు దూరంగా ఉండేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. అతని స్థానంలో శుబ్‌మన్ గిల్ జట్టులోకి రానున్నాడు. గాయంతో బాధపడుతున్న పేసర్ ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణా ఆడే అవకాశం ఉంది. ఈ రెండు మార్పుల అనంతరం భారత జట్టు సిద్ధమైంది. అయితే పెర్త్‌లో సెంచరీ మినహా వరుసగా విఫలమైన కోహ్లి ఈ సారైనా రాణిస్తాడా అనేది చూడాలి. రాహుల్, పంత్, జడేజా కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రాకు సిరాజ్ తగిన మద్దతు ఇస్తే ఆసీస్‌ను నిలువరించవచ్చు. మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్... ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. మెల్బోర్న్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో గెలుపుపై కంగారూలు గురి పెట్టారు. ఖ్వాజా మినహా మిగతా ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ నైపుణ్యంతో సారథి కమిన్స్ జట్టును సమర్థంగా నడిపిస్తుండగా...10 వేల పరుగుల మైలురాయికి 38 పరుగుల దూరంలో ఉన్న స్మిత్ అతని సొంత మైదానంలో చెలరేగితే ఆసీస్ భారీస్కోరు సాధించడం ఖాయం. రోహిత్ అన్యమనస్కంగా... టెస్టుకు ముందు రోజు భారత జట్టు ప్రాక్టీస్ సమయంలోనే రోహిత్‌పై వేటుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో వరుసగా కోహ్లి, రాహుల్, నితీశ్ రెడ్డి, గిల్ నిలబడగా... రోహిత్ జాడే కనిపించలేదు. నెట్స్‌లో ప్రధాన బ్యాటర్ల సాధన సాగినంత సేపూ అతను ఒక పక్కన నిలబడి బుమ్రాతో కబుర్లు చెబుతూ కనిపించాడు. ఆ తర్వాత అంతా ముగిసిన తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్ చేసినా తీవ్రత కనిపించలేదు. నేరుగా వచ్చిన బంతులను కూడా అతను ఆడే ప్రయత్నం చేయకపోగా, అవన్నీ స్టంప్స్‌ను పడగొట్టాయి. పూర్తి ఏకాగ్రతతో అతను అర గంట కూడా సాధన చేయలేదు. పక్క నెట్లోనే నితీశ్, గిల్‌లకు ప్రత్యేక సూచనలిస్తూ సాధన చేయించిన కోచ్ గంభీర్‌తో కనీసం పలకరింపులు కూడా కనపడలేదు. ప్రాక్టీస్ ముగిశాక బుమ్రా, అగార్కర్‌లతో కలిసి రోహిత్ మైదానం వీడాడు.1 సిడ్నీలో ఆ్రస్టేలియా జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడింది. టీమిండియా ఒక్క టెస్టులో మాత్రమే (1978లో) గెలిచి, ఐదు టెస్టుల్లో ఓడిపోయింది. మరో 7టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. -
‘ఇప్పటికే ఎక్కువైంది’
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ‘వైట్‌వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు జట్టు కోచ్‌గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్‌లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది. వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్... ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్‌స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్‌లో ఇటు సారథిగా, అటు బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. పుజారా కోసం పట్టుబట్టినా... గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్‌కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా... ‘హిట్‌మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్‌దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
నితీశ్ రెడ్డి ‘వైల్డ్ ఫైర్’
దేశం తరఫున ఆడుతూ కెరీర్లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి. మెల్బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. నితీశ్ అద్భుత బ్యాటింగ్‌కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్‌తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది. ప్రస్తుతానికి ఆసీస్‌కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు. భారీ భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా పంత్ చెత్త షాట్‌తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్‌కు రాగా, మరో ఎండ్‌లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్‌కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు. లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్‌ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది. స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0. సుందర్ సంయమనం...దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్‌కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు. ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్‌ను పక్కన పెట్టి ఆల్‌రౌండర్ సుందర్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్‌తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్‌కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్‌తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు. టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!ఇక తగ్గేదేలే...పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్‌లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మెల్బోర్న్లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్‌లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు, బంగ్లాదేశ్‌తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్‌ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 674 పరుగులు, బౌలింగ్‌లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు. మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డకౌట్లు బ్యాటింగ్‌పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్మెంట్ నితీశ్‌పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్‌గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు. అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్‌లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి. స్టార్క్ బౌలింగ్‌తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సెంచరీ తర్వాత బ్యాట్‌ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం. కమిన్స్‌తో తలపడి... నిలబడి...నితీశ్ ఇన్నింగ్స్‌లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్‌వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు! ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్‌రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్‌ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్‌గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు. ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్‌లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు. ఆ మూడు బంతులు!లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్డ్రైవ్గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది. అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు. 5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు. 8 ఈ సిరీస్‌లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్‌లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్‌లు బాదారు.‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్‌రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి -
స్వయంకృతం!
టీమిండియా చక్కటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 153/2తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజును 164/5 వద్ద ముగించి ఫాలోఆన్ ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఒక్క అనవసర రనౌట్ భారత ఇన్నింగ్స్ గతినే మార్చేసింది. స్మిత్ భారీ సెంచరీకి లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా... ఆసీస్ సారథి కమిన్స్ చూపిన తెగువ మన టాపార్డర్‌లో లోపించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా ఆశ మిగిలుందంటే అది పంత్, జడేజా క్రీజులో ఉండటమే. మరి ఈ జోడీ మూడో రోజు ఆసీస్ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందనే దానిపైనే భారత జట్టు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మెల్బోర్న్: బౌలర్ల అసహాయతకు, బ్యాటర్ల నిర్లక్ష్యం తోడవడంతో ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న పిచ్‌పై మనవాళ్లు కనీస ప్రదర్శన కనబర్చలేకపోవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 82; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా... విరాట్ కోహ్లి (36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలండ్ రెండేసి వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ (6 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే రోహిత్ బృందం ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 311/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... కమిన్స్ (49; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ఒక్క రనౌట్‌తో... సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌లో రనౌట్ చిచ్చు పెట్టింది. చూడచక్కటి షాట్లతో సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్... బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 41వ ఓవర్ చివరి బంతిని మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో కోహ్లి స్పందించలేదు. అప్పటికే యశస్వి సగం పిచ్ దాటి వచ్చేశాడు. మిడాన్ వద్ద కమిన్స్ బంతిని అందుకొని కీపర్ కేరీ వైపు విసరడం అతను వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. దాంతో యశస్వి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో యశస్వి–కోహ్లి మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి రనౌట్‌తో ఏకాగ్రత కోల్పోయిన కోహ్లి ఈ సిరీస్‌లో మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్ తొలి బంతికి కోహ్లి అవుటయ్యాడు.ఆఫ్‌స్టంప్ అవతల వెళుతున్న బంతిని అనవసరంగా ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ (0) కూడా అవుటవ్వడంతో భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన రోహిత్ (3) ఓపెనర్‌గానూ నిరాశ పరచగా... కేఎల్ రాహుల్ (24; 3 ఫోర్లు) కమిన్స్ అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు. స్మిత్ సూపర్ సెంచరీ భారత బౌలింగ్ లోటుపాట్లను సొమ్ముచేసుకున్న స్మిత్ రెండో రోజు ఆసీస్‌కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బుమ్రా మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో సునాయాసంగా పరుగులు రాబట్టాడు. అతడికి మరో ఎండ్ నుంచి కమిన్స్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్మిత్ 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది 34వ శతకం. ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్ అవుట్ కాగా... స్టార్క్ (15), లయన్ (13) సాయంతో కీలక పరుగులు జోడించాడు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బి) ఆకాశ్‌దీప్ 140; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్‌దీప్ 31; కమిన్స్ (సి) నితీశ్ రెడ్డి (బి) జడేజా 49; స్టార్క్ (బి) జడేజా 15; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 13; బోలండ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 27; మొత్తం (122.4 ఓవర్లలో ఆలౌట్) 474. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299, 7–411, 8–455, 9–455, 10–474. బౌలింగ్: బుమ్రా 28.4–9–99–4; సిరాజ్ 23–3–122–0; ఆకాశ్‌దీప్ 26–8–94–2; జడేజా 23–4–78–3; నితీశ్ రెడ్డి 7–0–21–0; సుందర్ 15–2–49–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (సి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (బ్యాటింగ్) 6; జడేజా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159. బౌలింగ్: స్టార్క్ 13–0–48–0; కమిన్స్ 13–2–57–2; బోలండ్ 12–3–24–2; లయన్ 5–1–18–0; మార్ష్ 3–0–15–0. కోహ్లిని గేలి చేసిన ఆసీస్ అభిమానులు తొలి రోజు ఆటలో ఆ్రస్టేలియా ఓపెనర్ కోన్స్టాస్ను ఢీకొట్టి జరిమానాకు గురైన కోహ్లికి రెండో రోజు మైదానంలో చేదు అనుభవం ఎదురైంది. విరాట్ ఆడుతున్నంత సేపు గోల చేసిన అభిమానులు... అతడు అవుటై మైదానాన్ని వీడుతున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న కోహ్లి తిరిగివచ్చి ఆసీస్ అభిమానుల వైపు ఆగ్రహంగా చూడగా... భద్రతా అధికారి అతడికి నచ్చజెప్పి తీసుకెళ్లాడు. కోహ్లి భుజం మీద చేయి వేసి... శుక్రవారం ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ వలయం దాటుకొని మైదానంలోకి దూసుకురావడం కలకలం రేపింది. తొలి సెషన్లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లోకి వచ్చిన ఆ వ్యక్తి కోహ్లి భుజంపై చేయి వేయడం గమనార్హం. ఇది గుర్తించిన సిబ్బంది అతడిని బలవంతంగా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.11 భారత్‌పై అత్యధిక (11) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (10) రెండో స్థానానికి పడిపోయాడు.1 ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో అత్యధిక (10) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ 9 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు. -
టాప్–4 తడాఖా
ఆ్రస్టేలియా ప్రయోగించిన కొత్త అస్త్రం ఫలించింది. మెక్‌స్వీనీని తప్పించి ఎంపిక చేసిన 19 ఏళ్ల కుర్రాడు స్యామ్ కోన్స్టాస్ మెల్బోర్న్లో మెరిపించాడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా మన్ననలు అందుకుంటున్న బుమ్రా బౌలింగ్‌లో... టి20ల తరహాలో పరుగులు రాబట్టి ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అతడి స్ఫూర్తితో టాప్–4 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో విజృంభించారు. వెరసి ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆఖర్లో బుమ్రా చెలరేగకపోయుంటే పరిస్థితి మరింత దిగజారేదే! ఇప్పటికైతే టీమిండియా పోటీలోనే ఉన్నా... పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం! మెల్బోర్న్: టాపార్డర్ రాణించడంతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియాకు మంచి ఆరంభం లభించింది. టాప్–4 బ్యాటర్లు అర్ధశతకాలతో అదరగొట్టారు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో భాగంగా భారత్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఆ్రస్టేలియా జట్టు తొలిరోజే మంచి స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సామ్ కోన్స్టాస్ (65 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 57; 6 ఫోర్లు), లబుషేన్ (145 బంతుల్లో 72; 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.ఒకదశలో ఆసీస్ జోరు చూస్తుంటే 400 స్కోరు ఖాయమే అనిపించినా... మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3/75) టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్మిత్‌తో పాటు కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కోన్స్టాస్ ల్యాప్ స్కూప్ సిక్సర్ రికార్డు స్థాయి అభిమానుల హర్షధ్వానాల మధ్య జాతీయ జట్టు తరఫున తొలి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన టీనేజర్ కోన్స్టాస్ మొదటి మ్యాచ్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శనతో కట్టిపడేశాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహా బ్యాటర్లే తడబడుతున్న తరుణంలో సంప్రదాయ శైలిని పక్కనపెట్టి ఎదురుదాడి లక్ష్యంగా పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. పట్టుమని పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం కూడా లేని 19 ఏళ్ల కోన్స్టాస్... బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదడం విశేషం. ఏడో ఓవర్లో అతడు ల్యాప్ స్కూప్ ద్వారా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్. కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడితో మాటల యుద్ధం జరిగిన తర్వాత కూడా ఈ టీనేజ్ కుర్రాడు సంయమనం కోల్పోకుండా పరిణతి ప్రదర్శించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోన్స్టాస్ కాసేపటికే జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్, లబుషేన్ నిలకడ గత మూడు టెస్టుల్లో నిలకడ కనబర్చలేకపోయిన ఆసీస్ టాపార్డర్... కోన్స్టాస్ ఇన్నింగ్స్ స్ఫూర్తితో చెలరేగడంతో తొలి రోజు కంగారూలదే పైచేయి అయింది. లయ దొరకబుచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఖ్వాజా 101 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... లబుషేన్ నింపాదిగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రెండో వికెట్ లబుషేన్‌తో కలిసి 65 పరుగులు జోడించిన అనంతరం ఖ్వాజా అవుటయ్యాడు. లబుషేన్, స్మిత్ జట్టు బాధ్యతలను భుజానెత్తుకున్నారు. దాంతో ఆసీస్ ఒకదశలో 237/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా... సిరాజ్, జడేజా ఆ తీవ్రత కొనసాగించలేకపోవడంతో ఆసీస్ ప్లేయర్లు సులువుగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన తర్వాత లబుషేన్‌ను సుందర్ అవుట్ చేశాడు. బుమ్రా బ్రేక్ ఈ సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న బుమ్రా మూడో సెషన్లో తన తడాఖా చూపాడు. వరుస సెంచరీలతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (0)ను ఓ చక్కటి బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. బుమ్రా సంధించిన బుల్లెట్ లాంటి లెంత్ బాల్ హెడ్ ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను గిరాటేసిన తీరు ముచ్చట గొలిపింది. ఏం జరిగిందో ఆలోచించుకునే లోపే హెడ్ బెయిల్ గాల్లోకి ఎగరగా... స్టేడియం మొత్తం ‘బూమ్.. బూమ్.. బుమ్రా’అనే నినాదాలతో హోరెత్తింది.మరుసటి ఓవర్లో మార్ష్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. అలెక్స్ కేరీ (41 బంతుల్లో 31; 1 సిక్స్) చివర్లో వేగంగా పరుగులు సాధించగా... స్మిత్ అజేయంగా నిలిచాడు. రెండో రోజు కమిన్స్‌తో కలిసి స్మిత్ మరెన్ని పరుగులు జోడిస్తాడనే దానిపైనే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బ్యాటింగ్) 68; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్‌దీప్ 31; కమిన్స్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 311. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299. బౌలింగ్: బుమ్రా 21–7–75–3; సిరాజ్ 15–2–69–0; ఆకాశ్‌దీప్ 19–5–59–1; జడేజా 14–2–54–1; నితీశ్ రెడ్డి 5–0–10–0; సుందర్ 12–2–37–1.1 అరంగేట్రం టెస్టులోనే భారత్‌పై అర్ధశతకం సాధించిన పిన్న వయసు (19 ఏళ్ల 85 రోజులు) ఆసీస్ ప్లేయర్‌గా కోన్స్టాస్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఆసీస్ తరఫున పిన్నవయసులో అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇయాన్ క్రెయిగ్ (17 ఏళ్ల 240 రోజులు; 1953లో దక్షిణాఫ్రికాపై) తొలి స్థానంలో ఉన్నాడు.3 ఆ్రస్టేలియా తరఫున అరంగేట్రం టెస్టులో వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్‌గా కోన్స్టాస్ (52 బంతుల్లో) నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (46 బంతుల్లో; 1999లో పాకిస్తాన్‌పై), ఆగర్ (50 బంతుల్లో; 2013లో ఇంగ్లండ్‌పై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.మెల్బోర్న్@ 87,242 ‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 87,242 మంది అభిమానులు హాజరయ్యారు. ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కు హాజరైన అభిమానుల సంఖ్య ఇదే అత్యధికం. మెల్బోర్న్ టెస్టు ఆరంభానికి రెండు వారాల ముందే టికెట్లన్నీ అమ్ముడుపోగా... రికార్డు స్థాయిలో ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. -
గెలుపు పంచ్ ఎవరిదో?
ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంది.ఈ ఏడాదిని విజయంతో ముగించడం... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని చేజిక్కించుకోవడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగు పెట్టనుంది. గత రెండు పర్యటనల్లో మెల్బోర్న్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా ఈ మైదానంలో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా... భారత జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి! మెల్బోర్న్: గత రెండు ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియాను చిత్తు చేసిన భారత జట్టు... ముచ్చటగా మూడోసారి కంగారూలను మట్టికరిపించేందుకు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న ఈ పోరుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలి రానుండగా... అశేష జనసందోహం ముందు ఆసీస్‌పై ఆధిపత్యం కనబర్చేందుకు రోహిత్ బృందం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగగా ... ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని చేజిక్కించుకుంటుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు (డే–నైట్)లో పరాజయం చవిచూసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించగా... చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమ ఉజ్జీగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే... ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత జట్టు మెల్బోర్న్లో శక్తియుక్తులన్నీ ధారపోయడానికి సిద్ధమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. పేస్‌కు సహకరించే మెల్బోర్న్ పిచ్‌పై రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా... లేక మిడిలార్డర్లోనే కొనసాగుతాడా చూడాలి!మరోవైపు అరంగేట్ర సిరీస్‌లోనే తీవ్రంగా తడబడ్డ ఓపెనర్ మెక్‌స్వీనీని తప్పించిన ఆ్రస్టేలియా... టీనేజర్ స్యామ్ కొంటాస్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్ జట్టులోకి రానున్నాడు. రోహిత్ రాణించేనా! ‘జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే’ అని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేసినా... ‘హిట్‌మ్యాన్’ మిడిలార్డర్లో బరిలోకి దిగడం వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ కనీసం ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో టెస్టులోనూ అతడు మిడిలార్డర్లోనే దిగే సూచనలున్నా... మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గత పదేళ్లుగా మెల్బోర్న్ స్టేడియంలో పరాజయం లేకుండా సాగుతున్న టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉండగా... యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. కోహ్లికి మెల్బోర్న్లో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లి... ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పదే పదే ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతికి వికెట్ సమర్పించుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో దీనిపై దృష్టి పెట్టిన విరాట్... ‘ఫోర్త్ స్టంప్’ లోపాన్ని అధిగమించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. మిడిలార్డర్లో పంత్ మంచి టచ్‌లో ఉండగా... పేస్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉండటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావచ్చు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఏస్ పేసర్ బుమ్రా మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్‌దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, జడేజా, నితీశ్ రెడ్డి/సుందర్, ఆకాశ్‌దీప్, బుమ్రా, సిరాజ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, సామ్ కొంటాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలండ్.హెడ్ ఆట కట్టిస్తేనే...సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతోంది. వార్నర్ రిటైరయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్... ఈ సిరీస్ తొలి మూడు టెస్టులకు మెక్‌స్వీనీని ప్రయతి్నంచింది. అతడు విఫలమవ్వడంతో మరో యువ ఆటగాడు కొంటాస్ ను ఎంపిక చేసింది.లబుషేన్లో నిలకడ లోపించగా... గత మ్యాచ్‌లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. వీళ్లంతా ఒకెత్తు అయితే... భారత్ పాలిట కొరకరాని కొయ్య మాత్రం ట్రవిస్ హెడ్ అనే చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. బోలండ్కు సొంత మైదానమైన ఎంసీజీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈ పాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.పిచ్, వాతావరణంమెల్బోర్న్ పిచ్ పేస్‌కు అనుకూలం. వికెట్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని క్యూరేటర్ వెల్లడించాడు. తొలి రోజుఎండ అధికంగా ఉండనుంది. రెండో రోజు చిరు జల్లులు కురవొచ్చు. వర్షం వల్ల ఆటకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చు.4 భారత్ ఆ్రస్టేలియా మధ్య మెల్బోర్న్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 4 టెస్టుల్లో గెలిచింది. ఆ్రస్టేలియా 8 టెస్టుల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.6 బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే (44 టెస్టుల్లో) భారత్ తరఫున వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. అశ్విన్ 37 టెస్టుల్లో ఈ మైలురాయి దాటాడు.6 గత ఆరేళ్ల కాలంలో మెల్బోర్న్ మైదానంలో ఆరు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. -
కంగారూలు కసితీరా...
బ్రిస్బేన్‌లో తొలి రోజు వరుణుడు విజృంభిస్తే... రెండో రోజు ఆ్రస్టేలియా బ్యాటర్లు వీర విహారం చేశారు. ట్రావిస్ హెడ్ టీమిండియాపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మరో సెంచరీతో విరుచుకుపడగా... స్టీవ్ స్మిత్ సాధికారిక సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు సాధించింది. భారత మేటి పేసర్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... అతనికి సహచర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దాంతో ఆ్రస్టేలియా మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాన్ని సృష్టించుకుంది. మూడో రోజు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న ఈ పోరులో భారత బ్యాటర్ల ఆటతీరుపైనే టీమిండియా ఆశలు ఆధారపడి ఉన్నాయి.బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా జట్టు అదరగొట్టింది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తితో విజృంభించిన ఆ్రస్టేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగే ట్రావిస్ హెడ్ (160 బంతుల్లో 152; 18 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ శతకంతో విజృంభించగా... చాన్నాళ్లుగా ఫామ్‌లో లేని మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో రాణించాడు. వీరిద్దరి అసమాన ప్రదర్శన ముందు... బుమ్రా (5/72) ఒంటరి పోరాటం చిన్నబోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో రెండో రోజు ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవరాల్‌గా రెండో రోజు 377 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆసీస్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. తొలి సెషన్ మనదే... వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో రోజు ఆటలో మొదట మన బౌలర్లు ఆకట్టుకున్నారు. బుమ్రాకు వికెట్ సమరి్పంచుకోకూడదు అనే సంకల్పంతో ముందుకు సాగిన ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (54 బంతుల్లో 21), నాథన్ మెక్‌స్వీనీ (49 బంతుల్లో 9) చివరకు అతడి బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన బుమ్రా... వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆ్రస్టేలియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు మెరుగైన ఆరంభమే లభించినట్లు అనిపించింది. లబుషేన్ (55 బంతుల్లో 12)తో పాటు ఆరంభంలో స్మిత్ అతి జాగ్రత్తకు పోవడంతో భారత బౌలర్లదే పైచేయి అయింది. గంటకు పైగా క్రీజులో గడిపినా... ఒక్క షాట్ ఆడలేకపోయిన లబుషేన్ చివరకు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 75/3తో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్‌పై టీమిండియా పట్టు సాధించడం ఖాయమే అనే అంచనాలకు వస్తున్న తరుణంలో... స్మిత్‌తో కలిసి హెడ్ వీరోచితంగా పోరాడాడు. మొత్తానికి తొలి సెషన్ ముగిసేసరికి ఆసీస్ 104/3తో నిలిచింది. 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు మూడో సెషన్ ఆరంభలోనూ స్మిత్, హెడ్ జోరు సాగింది. నాలుగో వికెట్‌కు 241 పరుగులు జత చేసిన తర్వాత ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. టెస్టు ఫార్మాట్లో 25 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్... మూడంకెల స్కోరు చేసిన వెంటనే పెవిలియన్ చేరగా... పేస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్‌స్టంప్ లైన్లో బుమ్రా వేసిన బంతికి మార్ష్ స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.అదే ఓవర్లో హెడ్ కూడా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ట్రవిస్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఇకనైనా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడుతుందని ఆశిస్తే... వికెట్ కీపర్ అలెక్స్ కేరీ దాన్ని అడ్డుకున్నాడు. కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (20)తో కలిసి ధాటిగా ఆడుతూ కీలక పరుగులు జోడించాడు. గాయం కారణంగా కాసేపు మైదానానికి దూరమైన సిరాజ్... ఆఖరికి ఒక వికెట్ పడగొట్టగా... కేరీతో పాటు మిషెల్ స్టార్క్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. తదుపరి మూడు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (బ్యాటింగ్) 45; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 405. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385. బౌలింగ్: బుమ్రా 25–7–72–5; సిరాజ్ 22.2–4–97–1; ఆకాశ్‌దీప్ సింగ్ 24.4–5–78–0; నితీశ్ కుమార్ రెడ్డి 13–1–65–1; రవీంద్ర జడేజా 16–2–76–0.భారీ భాగస్వామ్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా గేర్ మార్చింది. అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఆసీస్ ప్లేయర్లు... ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా... టీమిండియాపై మెరుగైన ప్రదర్శన చేస్తూ... మన బౌలింగ్‌కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ అలరించాడు. రెండో సెషన్లో కెపె్టన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ జోడీకి పరోక్షంగా సహకరించాయి. హెడ్ క్రీజులో కుదురుకునే సమయంలో ఫీల్డింగ్ మొహరింపు అనుకూలంగా ఉండటంతో అతడు సునాయాసంగా పరుగులు రాబట్టగలిగాడు. షార్ట్‌బాల్‌ను సరిగ్గా ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా బౌలింగ్ సాగకపోగా... అడపాదడపా జరిగిన ప్రయాత్నాల్లో రోహిత్ థర్డ్ మ్యాన్‌ను మొహరించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన హెడ్ ఆ తర్వాత దూసుకెళ్లాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. టచ్‌లోకి వచ్చాక రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ హెడ్ బౌండరీలతో చెలరేగిపోయాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయించేందుకు ప్రధాన పేసర్లను తప్పించడంతో ఆసీస్ జోడీ స్వేచ్ఛగా ముందుకు సాగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన స్మిత్... లయ అందుకున్నాక ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఇబ్బంది పడినట్లు కనిపించిన స్మిత్... మిగిలిన వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సెషన్లో ఆసీస్ జట్టు వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది. 1 అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (15) చేసిన ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ మాజీ కెపె్టన్ పాంటింగ్ (14) పేరిట ఉన్న ఈ రికార్డును స్మిత్ అధిగమించాడు. జో రూట్ (13) మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై వన్డేల్లో 5 శతకాలు బాదిన స్మిత్, టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. ఇక భారత్, ఆ్రస్టేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక (10) సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సచిన్ (11) అగ్రస్థానంలో ఉన్నాడు. 1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్‌పై 12 శతకాలు నమోదు చేసిన స్మిత్‌కు భారత్‌పై ఇది పదో సెంచరీ.2 టెస్టుల్లో ఆ్రస్టేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స్మిత్ (33) రెండో స్థానానికి చేరాడు. బ్రిస్బేన్ మ్యాచ్‌లో శతకంతో స్మిత్... స్టీవ్ వా (32)ను దాటేశాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 12 టెస్టు మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం బుమ్రాకిది 12వ సారి. భారత పేసర్లలో కపిల్‌దేవ్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.10 ఆసియా ఆవలి పిచ్‌లపై బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది పదోసారి. ఈ జాబితాలో కపిల్‌దేవ్ (9)ను అధిగమించి బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. -
ఆధిక్యంలోకి వెళతారా!
బ్రిస్బేన్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య నేటి నుంచి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమఉజ్జీలుగా ఉండగా... పేస్‌కు స్వర్గధామమైన బ్రిస్బేన్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కీలకంగా మారింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... టీమిండియాకు పరాజయం తప్పకపోగా... ఈ మ్యాచ్‌లో వాటిని అధిగమించి విజయం సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ... ఆఫ్‌స్టంప్ అవతల పడుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి నుంచి సాధికారిక ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మ తిరిగి ఓపెనింగ్ చేయడం ఖాయమే. మరోవైపు గత మ్యాచ్‌లో విజయంతో ఆ్రస్టేలియా ఆత్మవిశ్వాసంతో ఉన్నా... స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా పేలవ ఫామ్ ఆసీస్‌ను ఇబ్బంది పెడుతోంది. ఒత్తిడిలో రోహిత్, కోహ్లి కెరీర్లో దాదాపు చివరి ఆ్రస్టేలియా పర్యటనలో ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లి ఒత్తిడిలో కనిపిస్తున్నారు. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్... అడిలైడ్‌లో మిడిలార్డర్లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్, సుందర్, జడేజా మధ్య పోటీ ఉన్నా... గతంలో ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక మూడో పేసర్‌గా హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కవచ్చు. ఆత్మవిశ్వాసంలో ఆ్రస్టేలియా.. సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా అదే జోరులో సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైనా... అడిలైడ్‌లో హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో కంగారూలు గాడిన పడ్డారు. అయితే స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, మిషెల్ మార్‡్ష, అలెక్స్ కేరీ రాణించాల్సిన అవసరముంది. లబుషేన్ గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నా... పూర్తి నియంత్రణతో కనిపించలేదు. బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్/అశ్విన్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్‡్ష, కారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్రిస్బేన్ పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు ఉదయం వర్షం కురిసే అవకాశముంది. -
IND vs AUS 3rd Test: ఫుల్ ప్రాక్టీస్...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్‌లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్ చేరుకున్న రోహిత్ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్‌లో ‘పింక్ బాల్’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్లో రోహిత్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్‌తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్‌లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన కెపె్టన్ రోహిత్ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొత్త బంతితో ప్రాక్టీస్ చేశారు.పచ్చికతో కూడిన గబ్బా పిచ్... పేస్‌కు, బౌన్స్‌కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్ ఓపెనర్‌గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్ సుదీర్ఘంగా సంభాషిoచాడు. ఆకాశ్‌కు అవకాశం దక్కేనా! నెట్స్‌లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్ ఆకాశ్‌దీప్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రెండో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్‌లో ఆకాశ్ బౌలింగ్ చూస్తుంటే హర్షిత్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టు జరగనున్న పిచ్ హర్షిత్ బౌలింగ్ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్‌కు అవసరమైన ఫిట్నెస్ అతడు ఇంకా సాధించలేదు. ‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి. జైస్వాల్ బస్ మిస్.. రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్ నుంచి బ్రిస్బేన్‌కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్ణీత సమయానికి టీమ్ బస్ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జైస్వాల్‌ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్‌పోర్ట్‌కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్ అక్కడికి రాకపోవడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్ నుంచి బయలుదేరగా... జైస్వాల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్‌ను విమానాశ్రయానికి చేర్చారు. -
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. నెట్స్‌లో చెమటోడ్చుతున్న భారత ప్లేయర్లు
అడిలైడ్: రెండో టెస్టులో ఆ్రస్టేలియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు తిరిగి గాడిన పడటంపై దృష్టి పెట్టింది. భారత్, ఆ్రస్టేలియా మధ్యఅడిలైడ్ వేదికగా ‘గులాబీ బంతి’తో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా... మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ‘అదనపు సమయాన్ని హోటల్ రూమ్స్‌లో కాకుండా... మైదానంలో గడపండి’ అని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్న మాటల ప్రభావమో, లేక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలనే తపనో కానీ మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం బుధవారం బ్రిస్బేన్ బయలుదేరనున్న టీమిండియా... మంగళవారం అడిలైడ్‌లో కఠోర సాధన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మూడో టెస్టు కోసం సాధన మొదలైంది’ అని రాసుకొచ్చింది. గత 12 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ... పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా... పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ డిఫెన్స్‌పై దృష్టి సారించగా... పంత్ భారీ షాట్లు సాధన చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు. హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్, యశ్ దయాళ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు త్రో డౌన్ స్పెషలిస్ట్‌ల బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 7 టెస్టులు జరిగాయి. ఒక మ్యాచ్‌లో భారత్ నెగ్గగా... ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచింది, మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
ఉత్సాహంతో టీమిండియా.. ఒత్తిడిలో ఆస్ట్రేలియా
ఆ్రస్టేలియా గడ్డపై వరుసగా మూడోసారి టెస్టు సిరీస్ సాధించడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలనే లక్ష్యంతో టీమిండియా రెండో టెస్టుకు సమాయత్తమైంది. గతంలో ఇక్కడే జరిగిన ‘పింక్ బాల్ టెస్టు’లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు ఈసారి చరిత్ర తిరగరాయాలని భావిస్తుంటే... గులాబీ బంతితో మ్యాజిక్ చేయాలని ఆసీస్ బృందం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే... తిరిగి పుంజుకుని సిరీస్ సమం చేయాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ‘డే అండ్ నైట్’పద్ధతిలో ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నారు. ఆసీస్ గడ్డపై చివరిసారి అడిలైడ్‌లోనే ‘గులాబీ టెస్టు’ ఆడిన భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36 ఆలౌట్) నమోదు చేసుకోగా... ఆ చేదు జ్ఞాపకాలను అధిగమించి ముందంజ వేయాలని టీమిండియా యోచిస్తోంది. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రాకతో భారత జట్టు బలం మరింత పెరిగింది. రోహిత్ మిడిలార్డర్లో.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన రోహిత్... అడిలైడ్‌లో మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు. పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జంట మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఈ జోడీని విడదీయడం లేదని పేర్కొన్నాడు. గాయంతో తొలి మ్యాచ్ ఆడని గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగనుండగా... నాలుగో స్థానంలో కోహ్లి ఆడతాడు. ఆ్రస్టేలియా గడ్డపై ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి తిరిగి లయ అందుకోవడం జట్టుకు సానుకూలాంశం కాగా... మిడిలార్డర్లో రోహిత్, పంత్ బ్యాటింగ్ చేయనున్నారు. అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నప్పటికీ ‘పింక్ బాల్’ టెస్టు కావడంతో టీమ్ మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్‌వైపే మొగ్గు చూపనుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు నిలబెట్టుకోనుండగా... హైదరాబాద్ పేసర్ సిరాజ్, హర్షిత్ రాణాతో కలిసి బుమ్రా పేస్ భారాన్ని మోయనున్నాడు. తొలి టెస్టు తర్వాత లభించిన 10 రోజుల విరామంలో భారత జట్టు పీఎం ఎలెవన్‌తో పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటంతో పాటు నెట్స్‌లో కఠోర సాధన చేసింది. అచ్చొచ్చిన అడిలైడ్‌లో... పెర్త్‌లో భారత జట్టు చేతిలో ఘోర పరాజయం తర్వాత తిరిగి పుంజుకునేందుకు ఆ్రస్టేలియా కసరత్తులు చేస్తోంది. స్వదేశంలో ఇప్పటి వరకు ఆడిన 12 ‘డే అండ్ నైట్’ మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క దాంట్లో ఓడిన ఆస్ట్రేలియా... అడిలైడ్‌లో ఆడిన 7 ‘పింక్ టెస్టు’ల్లోనూ విజయం సాధించింది. గత టెస్టులో భారత ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పేసర్ హాజల్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో బోలాండ్ తుది జట్టులోకి రానున్నాడు. ఖ్వాజా, లబుషేన్, స్మిత్ కలిసికట్టుగా రాణించాలని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్టార్క్, కమిన్స్ బంతులను ఎదుర్కోవడం భారత ప్లేయర్లకు శక్తికి మించిన పనే. పిచ్, వాతావరణం అడిలైడ్ పిచ్ అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లకు సమానంగా సహకరించనుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేసర్లకు అదనపు ప్రయోజనం లభించనుంది. తొలి రెండు రోజులు ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. 22 ఇప్పటి వరకు మొత్తం 22 డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. అత్యధికంగా ఆ్రస్టేలియా జట్టు 12 డే అండ్ నైట్ టెస్టులు ఆడి 11 మ్యాచ్‌ల్లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓడింది. 7 అడిలైడ్‌లో ఆ్రస్టేలియా జట్టు ఆడిన 7 డే అండ్ నైట్ టెస్టుల్లోనూ గెలుపొందింది.4 భారత జట్టు ఇప్పటి వరకు 4 డే అండ్ నైట్ టెస్టులు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి (2019లో బంగ్లాదేశ్‌పై కోల్‌కతాలో; 2021లో ఇంగ్లండ్‌పై అహ్మదాబాద్‌లో; 2022లో శ్రీలంకపై బెంగళూరులో), ఒక మ్యాచ్‌లో (2020 లో ఆ్రస్టేలియా చేతిలో అడిలైడ్‌లో) ఓడిపోయింది.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, సుందర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్ ), ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలాండ్. -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. మెక్‌స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో జైస్వాల్ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్‌వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
పెర్త్‌పై పట్టు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్‌కు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్ సెలెక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్‌లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించనుంది. స్టార్క్ అడ్డుగోడలా.. తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తలపిస్తూ తన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు.ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్‌కు హాజల్‌వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు. ఈ ఇద్దరు పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్‌లో స్టార్క్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనింగ్ అజేయం తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్‌తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్‌తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్‌తో కంగారూలను కలవరపెట్టాడు. సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3.01 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్‌కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్‌సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్‌లో పగుళ్లు తేలిన పిచ్‌పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్‌ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్‌వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0. -
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కుతుంది. పెర్త్: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలవగా... రిషబ్ పంత్ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు), స్టార్క్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది. బుల్లెట్‌లాంటి బంతులతో.. బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్లో మెక్‌స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్లో ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్ ఖ్వాజా (8)ను అవుట్ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్ హర్షిత్ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ మెయిడెన్లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (11)ను హర్షిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. మార్ష్ (6) రూపంలో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్న సిరాజ్... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్ సారథి కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. పేస్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్ ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్ పిచ్‌పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మూడో ఓవర్లోనే అవుట్ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్ పడిక్కల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్ రాహుల్ అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ధ్రువ్ జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్‌కు నితీశ్ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్... కమిన్స్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్ వెనుదిరిగాడు. పంత్ అవుటయ్యాక నితీశ్వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; పడిక్కల్ (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్‌వుడ్ 5; పంత్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 37; జురేల్ (సి) లబుషేన్ (బి) మార్ష్ 11; సుందర్ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 41; హర్షిత్ (సి) లబుషేన్ (బి) హాజల్‌వుడ్ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్‌వుడ్ 8; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్: స్టార్క్ 11–3–14–2; హాజల్‌వుడ్ 13–5–29–4; కమిన్స్ 15.4–2–67–2; లయన్ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (బ్యాటింగ్) 19; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్: బుమ్రా 10–3–17–4; సిరాజ్ 9–6–17–2; హర్షిత్ రాణా 8–1–33–1. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు నితీశ్‌కు మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లీ టెస్టు క్యాప్ అందించగా... హర్షిత్‌కు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ జాతీయ జట్టు క్యాప్ ఇచ్చి అభినందించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి, 316వ ప్లేయర్‌గా హర్షిత్ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్‌లో నితీశ్ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్ మెక్‌స్వీనీ కూడా పెర్త్ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. -
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధం
-
India vs Australia: ఎవరిదో శుభారంభం!
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుంది. 136 ఏళ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీస్‌లలో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. 1888లో ఇంగ్లండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు భారత జట్టుకు ఈ అవకాశం లభిస్తోంది. అయితే ఈసారి భారత జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం... తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం... గాయంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వైదొలగడం... పుజారా, రహానే వంటి టెస్టు స్పెషలిస్టులు లేకపోవడం... కోహ్లి, కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి... వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదు. గత రెండు పర్యాయాల్లో భారత జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన ఆ్రస్టేలియా ఈసారి మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. భారత్‌పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ... ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 4–0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్‌వాష్ కు గురైన భారత జట్టు... పేస్‌కు సహకరించే ఆ్రస్టేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి! పెర్త్: పోరాటతత్వానికి పెట్టింది పేరైన ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సమరానికి భారత జట్టు సిద్ధమైంది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి సిరీస్‌లో ఐదు టెస్టులు నిర్వహించనుండగా... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు అత్యవసరం కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. గత రెండు ఆసీస్ పర్యటనల్లో (2018–19, 2020–21) సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా... వరుసగా మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఒత్తిడిలో కనిపిస్తోంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టుకు ఇదే తొలి విదేశీ టెస్టు సిరీస్ కాగా... అతడితో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి ఈ పర్యటన మరింత కీలకం కానుంది. గత ఆసీస్ పర్యటనలో రాణించిన పుజారా, రహానే, షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేకపోగా... యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ మెరుగైన సాధనతో సిద్ధంగా ఉంది. నితీశ్ రెడ్డి అరంగేట్రం! ఆ్రస్టేలియా పర్యటనలో రాణిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్ ‘వాకా’ పిచ్‌పై శతకంతోనే మరింత పేరు ప్రఖ్యాతలు సాధించగా... 2014 ఆసీస్ టూర్ లో కోహ్లి నాలుగు శతకాలతో చెలరేగి ‘కింగ్’ అనిపించుకున్నాడు. యావత్ ప్రపంచ దృష్టి సారించే ఆ్రస్టేలియా పర్యటన ద్వారా పుజారా, రిషభ్ పంత్ సాధించిన గుర్తింపు తక్కువేమీ కాదు. అలాగే ఇక్కడ విఫలం కావడంతోనే కెరీర్‌కు ముగింపు పలికిన ప్లేయర్లకూ కొదవలేదు. గతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఇలాగే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్, అశ్విన్ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కనిపించే మాటల యుద్ధం ఈసారి పెద్దగా తెర పైకి రాకపోగా... తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనుండటం... ఆసీస్ సీనియర్ల నోటికి తాళాలు వేసినట్లు కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... గాయంతో దూరమైన గిల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. కోహ్లి, పంత్‌తో కలిసి ధ్రువ్ జురేల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి, ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు జట్టులో స్థానం పక్కా కాగా... తాత్కాలిక కెప్టెన్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. స్మిత్ అచ్చొచ్చిన స్థానంలోనే... డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న ఆ్రస్టేలియా జట్టు పలు ప్రయోగాలు చేసి విఫలమైంది. టీమిండియాతో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఆ సమస్య తీరినట్లే అనిపిస్తోంది. ఇటీవల భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’జట్టుకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనీ ఈ సిరీస్‌లో ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.దీంతో స్మిత్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు. లబుషేన్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీలతో ఆసీస్ మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ పిచ్‌పై మెరుగైన గణాంకాలు ఉన్న నాథన్ లయన్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా... కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ భారత టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టడానికి అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యారు. 24న రోహిత్ శర్మ రాక... వ్యక్తిగత కారణాలరీత్యా ఆ్రస్టేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈనెల 24న జట్టుతో చేరనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనుండగా... మొదటి టెస్టు మూడో రోజు రోహిత్ టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు (డే అండ్ నైట్) రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. పిచ్, వాతావరణం పెర్త్ పిచ్ పేస్‌కు, బౌన్స్‌కు ప్రసిద్ధి. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు అకాల వర్షం కారణంగా పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడించగా... రెండు రోజులుగా బాగా ఎండ కాయడంతో వికెట్ పూర్వ స్థితికి చేరింది. పచ్చికతో కూడిన పిచ్‌పై తొలి రోజు ఆట కీలకం కానుంది.భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఎంతో ప్రత్యేకమైంది. ఈసారి ఐదు మ్యాచ్‌లు ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువ. తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనున్నప్పటికీ... ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అనుకోవడం లేదు. వేలంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో ప్లేయర్లు చేయాడానికి ఏమీ ఉండదని అందరికీ తెలుసు. స్వదేశంలో ఆడేటప్పుడు అంచనాల ఒత్తిడి ఉండటం సహజమే. భారత్ కఠిన ప్రత్యర్థి. వారిని ఎదుర్కొనేందుకు మేం బాగా సిద్ధమయ్యాం. ఐపీఎల్ సందర్భంగా భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. బంతిని స్వింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో రాణించే సత్తా అతడిలో ఉంది. –ప్యాట్ కమిన్స్, ఆ్రస్టేలియా కెప్టెన్ కెప్టెన్సీని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తా. దాని కోసం సదా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలవాటే. గతంలో నాయకత్వం చేసిన అనుభవం ఉంది. అయితే ఇది ఒక్క మ్యాచ్‌కే... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. రోహిత్, కోహ్లిని అనుకరించాలని చూడను. దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. మేనేజ్మెంట్కు అతడిపై విశ్వాసం ఉంది. కోహ్లి బ్యాటింగ్‌పై వ్యాఖ్యలు చేయను. అతడి సారథ్యంలోనే జట్టులోకి వచ్చా. జట్టులో అతడి ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు. –బుమ్రా, భారత కెప్టెన్ 52 ఆ్రస్టేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత జట్టు ఇప్పటి వరకు 52 టెస్టులు ఆడింది. ఇందులో 9 టెస్టుల్లో గెలిచింది. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 13 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.4 ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుండటం ఇది నాలుగోసారి. గతంలో 1947లో, 1977లో, 1991లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. ఐదు టెస్టులతో కూడిన మూడు సిరీస్లలోనూఆ్రస్టేలియా జట్టే విజేతగా నిలవడం గమనార్హం. తుది జట్లు (అంచనా) భారత్: బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లి, పంత్, జురేల్, అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్‌దీప్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. -
పెర్త్‌లో బౌన్సీ పిచ్
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్‌లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్‌కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్‌కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్‌ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్‌పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. పిచ్‌పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్‌పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్‌పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
కేఎల్ రాహుల్‌పై దృష్టి
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఒత్తిడిలోనే ఉంచే ప్రయత్నం చేస్తామని... ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ్రస్టేలియా ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు ఒక అనధికారిక టెస్టు ఆడి ఓడిపోగా... రెండో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ముందుగానే ఆ్రస్టేలియాలో అడుగు పెట్టారు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మాత్రమే ఆడి తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్... బోర్డర్–గావస్కర్ సిరీస్‌లోని మొదటి టెస్టు కోసం తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో బోలాండ్ మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్‌కు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత స్వదేశంలో అతడికి బౌలింగ్ చేయనున్నా. అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్. అతడిని ఒత్తిడిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని బోలాండ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడి పిచ్‌లపై బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ్రస్టేలియా పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసుకునే విధానం భారత్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. 2015లో తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన రాహుల్... సిడ్నీ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై చివరిసారి సెంచరీ చేసిన రాహుల్... ఆ తర్వాత 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు. -
వార్నర్ కూడా అవుట్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హాజల్‌వుడ్ సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్‌వుడ్ సరసన తాజాగా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిశాక జరిగే వన్డే సిరీస్ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా రెన్షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. -
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్‌నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్‌లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్‌కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్‌లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్‌లు జరిగాయి. ఆసీస్‌తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, 80 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్‌ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్‌లు). సచిన్ (664 మ్యాచ్‌ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్