బ్రిస్బేన్ టెస్టు కోసం భారత జట్టు సన్నాహాలు
అడిలైడ్‌లో నెట్ ప్రాక్టీస్
అడిలైడ్: రెండో టెస్టులో ఆ్రస్టేలియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు తిరిగి గాడిన పడటంపై దృష్టి పెట్టింది. భారత్, ఆ్రస్టేలియా మధ్యఅడిలైడ్ వేదికగా ‘గులాబీ బంతి’తో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా... మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.
‘అదనపు సమయాన్ని హోటల్ రూమ్స్‌లో కాకుండా... మైదానంలో గడపండి’ అని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్న మాటల ప్రభావమో, లేక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలనే తపనో కానీ మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం బుధవారం బ్రిస్బేన్ బయలుదేరనున్న టీమిండియా... మంగళవారం అడిలైడ్‌లో కఠోర సాధన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మూడో టెస్టు కోసం సాధన మొదలైంది’ అని రాసుకొచ్చింది.
గత 12 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ... పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ కనిపించగా... పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను అధిగమించడంపై దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ డిఫెన్స్‌పై దృష్టి సారించగా... పంత్ భారీ షాట్లు సాధన చేశాడు.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేసర్లతో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ సాగించాడు. హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్, యశ్ దయాళ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరితో పాటు త్రో డౌన్ స్పెషలిస్ట్‌ల బంతులతో కూడా బ్యాటర్లు సాధన చేశారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు.
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 7 టెస్టులు జరిగాయి. ఒక మ్యాచ్‌లో భారత్ నెగ్గగా... ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచింది, మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment