అడిలైడ్ టెస్టు ఫలితం తర్వాత భారత జట్టు 0–4కు సిద్ధపడాల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలువురు మాజీ క్రికెటర్లు రెండో మ్యాచ్ తర్వాత మళ్లీ మాట్లాడే సాహసం చేయలేకపోయారు. ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా సాధించిన విజయం అలాంటిది మరి. ఇప్పుడు ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచిన దశలో కొత్త సమరానికి రంగం సిద్ధం కాగా... ప్రత్యర్థితో పోలిస్తే భారత జట్టులోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. మెల్‌బోర్న్ స్ఫూర్తిని కొనసాగిస్తూ మూడో టెస్టులోనూ గెలవగలిగితే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ సగర్వంగా నిలబెట్టుకోగలుగుతుంది. సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... సిడ్నీలో సీన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం.
సిడ్నీ: టెస్టు సిరీస్‌లో పైచేయి సాధించే క్రమంలో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు పోరుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ముందంజ వేస్తుంది. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చివరి టెస్టులో ఓడినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలదు. పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా... బలాబలాల్లో ఆతిథ్య జట్టుతో పోలిస్తే రహానే బృందానిదే కాస్త పైచేయిగా ఉంది.
ఓపెనర్‌గా రోహిత్...
గత రెండు మ్యాచ్‌లలాగే ఈసారి కూడా భారత్ తమ తుది జట్టును ఒకరోజు ముందే ప్రకటించింది. గాయం వివాదం... ఫిట్‌నెస్ పరీక్ష... కఠిన క్వారంటైన్‌ను దాటి వచ్చిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే స్థానం లభించింది. రోహిత్ కోసం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడింది. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి మయాంక్ 31 పరుగులే చేశాడు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానంపై కూడా ప్రమాద ఘంటిక మోగినా... రోహిత్ ఓపెనింగ్ చేయాలని మేనేజ్‌మెంట్ భావించడంతో మయాంక్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. గత ఏడాది ఓపెనర్‌గా మారిన అనంతరం రోహిత్ ఐదు టెస్టుల్లో మూడు సెంచరీలతో చెలరేగినా... అవన్నీ స్వదేశంలో ఆడినవే.
విదేశాల్లో ఇంతవరకు ఓపెనింగ్ చేయని రోహిత్ ఎలా ఆడతాడన్నది చూడాలి. ప్రధాన బ్యాట్స్‌మన్ పుజారా నుంచి కూడా ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. రహానే బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, విహారికి తన కెరీర్ కాపాడుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు. బౌలింగ్‌లో 2014 తర్వాత ఇంత తక్కువ అనుభవం ఉన్న పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. బుమ్రా 16 టెస్టులు, సిరాజ్ ఒకే ఒక టెస్టు ఆడగా, నవదీప్ సైనీకి తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో బుమ్రాపై మరింత బాధ్యత పెరిగింది. అయితే స్పిన్నర్ అశ్విన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. జడేజా కూడా తన స్పిన్ పదును చూపిస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు.
పకోవ్‌స్కీ అరంగేట్రం...
గాయంతో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన డేవిడ్ వార్నర్ రాకతో ఆసీస్ బలం పెరిగింది. అతను 100 శాతం ఫిట్‌గా లేకపోయినా ఆడించే ప్రయత్నం చేయడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీతనను చూపిస్తోంది. వార్నర్‌కు తోడుగా కొత్త కుర్రాడు విల్ పకోవ్‌స్కీ ఓపెనర్‌గా రావడం దాదాపుగా ఖాయం. ఈ కొత్త జోడి అందించే ఓపెనింగ్‌పైనే ఆసీస్ ఇన్నింగ్స్ పురోగతి ఆధారపడి ఉంది. అన్నింటికి మంచి ఆస్ట్రేలియాను ఆందోళనపరుస్తున్న అంశం టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ ఫామ్. రెండు మ్యాచ్‌లలోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు సొంత మైదానం సిడ్నీలోనైనా స్మిత్ చెలరేగి జట్టును నడిపించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
పింక్ టెస్టు మ్యాచ్...
అడిలైడ్ టెస్టు ‘పింక్ బాల్’ టెస్టు కాగా... ఇప్పుడు సిడ్నీలో జరగబోయేది పింక్ టెస్టు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించి ప్రచారంలో భాగంగా మైదానంలో పలు చోట్ల గులాబీ రంగును ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో మృతి చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ స్మారకార్థం సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా పరిగణిస్తారు. ఆసీస్ ఆటగాళ్లు తొలి రోజు గులాబీ క్యాప్‌లు ధరించి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ ద్వారా సేకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని గ్లెన్ మెక్‌గ్రాత్‌కు చెందిన జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు అందజేస్తారు.
పురుషుల టెస్టు మ్యాచ్‌కు తొలి మహిళా అంపైర్
పురుషుల టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళా అంపైర్‌గా క్లెయిర్ పొలొసాక్ (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందనుంది. సిడ్నీ టెస్టులో ఆమె ఫీల్డ్ అంపైర్‌గా కాకుండా... ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరించనుంది. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన 32 ఏళ్ల క్లెయిర్ 2019లో నమీబియా–ఒమన్ పురుషుల జట్ల మధ్య జరిగిన ఐసీసీ డివిజన్–2 వన్డే లీగ్ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా పనిచేసింది.
పిచ్, వాతావరణం
గత కొద్ది రోజులుగా నగరంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా కొంత అంతరాయం కలగవచ్చు. గతంలో స్పిన్నర్లకు బాగా అనుకూలించిన సిడ్నీ పిచ్ ఇప్పుడు మారింది. కొంత బౌన్స్ ఉంది. పచ్చికను కూడా ఉంచారు కాబట్టి ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. నిలదొక్కుకుంటే తర్వాత పరుగులు సాధించవచ్చు.
జట్ల వివరాలు
భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ.
ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్.
► భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మొత్తం 12 టెస్టులు జరిగాయి. భారత్‌కు ఒక్క టెస్టులోనే విజయం (1978లో) దక్కింది. టీమిండియా మిగతా ఐదు టెస్టుల్లో ఓడిపోయి, ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.
► మరో 97 పరుగులు చేస్తే పుజారా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
► 400 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు లయన్‌కు కావాల్సిన వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment