సిడ్నీ టెస్టులో భారత్‌ తడబాటు | India all out for 244 on Day 3 of third Test against Australia | Sakshi
Sakshi News home page

ఎదురీత...

Published Sun, Jan 10 2021 5:28 AM | Last Updated on Sun, Jan 10 2021 7:08 AM

India all out for 244 on Day 3 of third Test against Australia - Sakshi

ఆస్ట్రేలియా చేతిలో మూడో టెస్టులో భారత్‌కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ప్రత్యర్థికంటే మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరుకు బాటలు వేసుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో కుప్పకూలింది. ఆసీస్‌ పేస్‌ త్రయం పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక మన ఆటగాళ్లు చేతులెత్తేసి భారీ ఆధిక్యం సమర్పించుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ ఓవరాల్‌ ఆధిక్యాన్ని 197 పరుగులకు పెంచుకుంది. ఆదివారం కనీసం రెండు సెషన్లలో మరిన్ని పరుగులు జోడించి సవాల్‌ విసిరేందుకు సన్నద్ధమైంది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కఠినంగా మారిపోయే చోట మనోళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

సిడ్నీ: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో ముందంజ వేసే లక్ష్యంతో ఉన్న ఆస్ట్రేలియా అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. భారత్‌తో మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబ్‌షేన్‌ (47 బ్యాటింగ్‌), స్మిత్‌ (29 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా... ఓవరాల్‌ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. 35 పరుగులకే ఓపెనర్లు వార్నర్‌ (13), పకోవ్‌స్కీ (10)లను భారత్‌ అవుట్‌ చేసినా... లబ్‌షేన్, స్మిత్‌ మూడో వికెట్‌కు అజేయంగా 68 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్‌ పుజారా (176 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్‌ బౌలర్‌ కమిన్స్‌కు 4 వికెట్లు దక్కాయి.  

విహారి విఫలం...
భారీ స్కోరు సాధించే ఆశలతో మూడో రోజు ఆటలో బరిలోకి దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే కమిన్స్‌ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కెప్టెన్‌ రహానే (22) వెనుదిరిగాడు. ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి (4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్‌ పంత్‌ (67 బంతుల్లో 36; 4 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. 14 పరుగుల వద్ద అతని అవుట్‌ కోసం ఆసీస్‌ డీఆర్‌ఎస్‌ కోరగా, ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే కమిన్స్‌ బౌలింగ్‌లో గాయమైన తర్వాత ఏకాగ్రత చెదిరిన పంత్, మరో పది బంతులకే స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్కోరు వద్ద భారత్‌ పుజారా వికెట్‌ కూడా కోల్పోయింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు భారత వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా... మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (37 బంతుల్లో 28 నాటౌట్‌; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో ఒంటరి పోరాటం చేయడంతో ప్రత్యర్థి ఆధిక్యం వంద పరుగుల లోపు పరిమితమైంది.

మూడు రనౌట్‌లు...
భారత జట్టు పతనంలో రనౌట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌గా వెనుదిరిగారు. 37 బంతుల్లో 4 పరుగులే చేయగలిగిన విహారి ఒత్తిడిలో అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి వెనుదిరగాల్సి వచ్చింది. లయన్‌ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి మిడాఫ్‌ దిశగా షాట్‌ ఆడిన అతను అదే ఊపులో సింగిల్‌ పూర్తి చేసేందుకు ఉపక్రమించాడు. అయితే హాజల్‌వుడ్‌ విసిరిన డైరెక్ట్‌ త్రో వికెట్లను కూల్చింది. తర్వాతి వంతు అశ్విన్‌ది.

గ్రీన్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ ఆడి సింగిల్‌ కోసం పిలవగా... కాస్త అలసత్వంతో పరుగెత్తిన అశ్విన్‌ (10) అవతలి ఎండ్‌కు చేరలేక పెవిలియన్‌ బాట పట్టాడు. బుమ్రాతోనూ ఇలాగే జరిగింది. స్టార్క్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ ఆడి స్ట్రయికింగ్‌ కాపాడుకునేందుకు లేని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే లబ్‌షేన్‌ విసిరిన త్రో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను పడగొట్టడంతో బుమ్రా ఆట ముగిసింది. 2008లో మొహాలీ టెస్టు (ఇంగ్లండ్‌తో) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్‌ కావడం ఇదే తొలిసారి.

జడేజా, పంత్‌లకు గాయాలు
భారత జట్టును గాయాల బెడద వీడట్లేదు. కొత్తగా ఈ జాబితాలో జడేజా, పంత్‌ చేరారు. కమిన్స్‌ బౌలింగ్‌లో పంత్‌ పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా... బంతి అతని ఎడమ మోచేతిని బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన అతను స్వల్ప చికిత్స అనంతరం ఆటను కొనసాగించాడు. అయితే భారత ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అతడిని స్కానింగ్‌ కోసం తీసుకెళ్లారు. గాయం తీవ్రత తక్కువే కావడం ఊరట కలిగించగా... ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతనికి బదులు సాహా కీపింగ్‌ చేశాడు. అవసరమైతే పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు.

ఇన్నింగ్స్‌ చివర్లో స్టార్క్‌ వేసిన షార్ట్‌ బంతిని ఎదుర్కొనే క్రమంలో జడేజా ఎడమ చేతి బొటన వేలుకు బలమైన దెబ్బ తగిలింది. విలవిల్లాడిన జడేజాకు కూడా చికిత్స చేసిన తర్వాత స్కానింగ్‌కు పంపారు. జడేజా గాయం మాత్రం భారత్‌కు నష్టం కలిగించే అవకాశం ఉంది.  బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... అతని వేలుకు ఫ్రాక్చర్‌ అయినట్లు సమాచారం. జడేజా గ్లవ్‌ తొడిగి బ్యాటింగ్‌ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. అన్నింటికి మించి అది అతని బౌలింగ్‌ చేయి కావడంతో ఈ మ్యాచ్‌తో పాటు చివరి టెస్టులో కూడా జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 29 ఓవర్లు ఆడినా జడేజా బౌలింగ్‌ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి అండ్‌ బి) హాజల్‌వుడ్‌ 26; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 50; పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 50; రహానే (బి) కమిన్స్‌ 22; విహారి (రనౌట్‌) 4; పంత్‌ (సి) వార్నర్‌ (బి) హాజల్‌వుడ్‌ 36; జడేజా (నాటౌట్‌) 28; అశ్విన్‌ (రనౌట్‌) 10; సైనీ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 3; బుమ్రా (రనౌట్‌) 0; సిరాజ్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్‌) 244
వికెట్ల పతనం: 1–70, 2–85, 3–117, 4–142, 5–195, 6–195, 7–206, 8–210, 9–216, 10–244.
బౌలింగ్‌: స్టార్క్‌ 19–7–61–1, హాజల్‌వుడ్‌ 21–10–43–2, కమిన్స్‌ 21.4–10–29–4, లయన్‌ 31–8–87–0, లబ్‌షేన్‌ 3–0–11–0, గ్రీన్‌ 5–2–11–0.  

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 13; పకోవ్‌స్కీ (సి) (సబ్‌) సాహా (బి) సిరాజ్‌ 10; లబ్‌షేన్‌ (బ్యాటింగ్‌) 47; స్మిత్‌ (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (29 ఓవర్లలో 2 వికెట్లకు) 103
వికెట్ల పతనం: 1–16, 2–35.
బౌలింగ్‌: బుమ్రా 8–1–26–0, సిరాజ్‌ 8–2–20–1, సైనీ 7–1–28–0, అశ్విన్‌ 6–0–28–1.

► పుజారా అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. పుజారా కెరీర్‌లో ఇదే నెమ్మదైన అర్ధ సెంచరీ. 2018లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో పుజారా173 బంతులు ఆడి అర్ధ సెంచరీ సాధించాడు.
► అశ్విన్‌ బౌలింగ్‌లోవార్నర్‌ అవుటవ్వడం ఇది పదోసారి. వార్నర్‌ను ఎక్కువసార్లు అవుట్‌ చేసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ది రెండో స్థానం. స్టువర్ట్‌ బ్రాడ్‌ (10 సార్లు) తొలి స్థానంలో... అండర్సన్‌ (8 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement