నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టు
ఉదయం గం. 5:50 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
బ్రిస్బేన్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య నేటి నుంచి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో విజయంతో 1–1తో సమఉజ్జీలుగా ఉండగా... పేస్‌కు స్వర్గధామమైన బ్రిస్బేన్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది కీలకంగా మారింది.
అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... టీమిండియాకు పరాజయం తప్పకపోగా... ఈ మ్యాచ్‌లో వాటిని అధిగమించి విజయం సాధించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ... ఆఫ్‌స్టంప్ అవతల పడుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి నుంచి సాధికారిక ఇన్నింగ్స్ రావాల్సి ఉంది.
ఇక గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మ తిరిగి ఓపెనింగ్ చేయడం ఖాయమే. మరోవైపు గత మ్యాచ్‌లో విజయంతో ఆ్రస్టేలియా ఆత్మవిశ్వాసంతో ఉన్నా... స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా పేలవ ఫామ్ ఆసీస్‌ను ఇబ్బంది పెడుతోంది.
ఒత్తిడిలో రోహిత్, కోహ్లి
కెరీర్‌లో దాదాపు చివరి ఆ్రస్టేలియా పర్యటనలో ఉన్న భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లి ఒత్తిడిలో కనిపిస్తున్నారు. తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్... అడిలైడ్‌లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్, సుందర్, జడేజా మధ్య పోటీ ఉన్నా... గతంలో ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక మూడో పేసర్‌గా హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కవచ్చు.
ఆత్మవిశ్వాసంలో ఆ్రస్టేలియా..
సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా అదే జోరులో సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైనా... అడిలైడ్‌లో హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో కంగారూలు గాడిన పడ్డారు.
అయితే స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, మిషెల్ మార్‡్ష, అలెక్స్ కేరీ రాణించాల్సిన అవసరముంది. లబుషేన్ గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నా... పూర్తి నియంత్రణతో కనిపించలేదు. బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, రాహుల్, నితీశ్ రెడ్డి, సుందర్/అశ్విన్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్‡్ష, కారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్.
పిచ్, వాతావరణం
బ్రిస్బేన్ పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు ఉదయం వర్షం కురిసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment