ఆంక్షలు, అలసిన శరీరాలు, గాయాలు, గెలుపోటములు... అన్నీ అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న భారత్ ఇప్పుడు చివరి సమరానికి సన్నద్ధమైంది. కీలక ఆటగాళ్లు దూరమైన తర్వాత కూడా ఆత్మవిశ్వాసానికి లోటు లేకుండా ఆడిన టీమిండియా మరొక్కసారి బలం కూడదీసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలిగితే వరుసగా రెండో సారి కంగారూ పర్యటనను అద్భుతంగా ముగించగలుగుతుంది. కనీసం ‘డ్రా’ చేసినా బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. మరో వైపు సొంతగడ్డపై భారత్ చేతిలో వరుసగా రెండో సిరీస్‌ను చేజార్చుకోరాదని భావిస్తున్న ఆసీస్ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ‘గాబా’ మైదానంలో 1988నుంచి ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా రికార్డు కొనసాగిస్తుందా లేదా రహానే సేన ముందు తలవంచుతుందా చూడాలి!
బ్రిస్బేన్: వన్డే సిరీస్‌లో పరాజయం, టి20ల్లో సిరీస్ గెలుపు తర్వాత టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి ఇక్కడి ‘గాబా’ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమని భారత్ నిరూపించగా... కచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆసీస్‌పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమరం ఖాయం.
తుది జట్టులోకి ఎవరు?
గాయాలతో జడేజా, విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. పొత్తి కడుపులో కండరాల గాయంతో బాధపడుతున్న బుమ్రా 100 శాతం ఫిట్‌గా లేడనేది వాస్తవం. బుధవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనగా...బుమ్రా మాత్రం బౌలింగ్ చేయలేదు. అయితే బుమ్రా కూడా లేకపోతే పేస్ బౌలింగ్ మరీ పేలవంగా మారిపోయే అవకాశం ఉండటంతో పూర్తి ఫిట్‌గా లేకపోయినా అతడిని ఆడిస్తారా అనేది చూడాలి. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్ పూర్తిగా కోలుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. విహారి స్థానంలో మయాంక్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అయితే అతను మిడిలార్డర్‌లో కాకుండా ఓపెనర్‌గానే ఆడితే (రోహిత్‌తో కలిసి) మిగతా బ్యాట్స్‌మెన్ ఒక్కో స్థానం దిగువన ఆడతారు.
జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ రావచ్చు. అయితే బ్రిస్బేన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్ రూపంలో ఒకే స్పిన్నర్‌ను ఆడించి నాలుగో పేసర్‌ను తీసుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఉంది. బుమ్రా చివరి నిమిషంలో తప్పుకుంటే నటరాజన్ అరంగేట్రం చేస్తాడు. బ్యాటింగ్‌లో రహానే, పుజారాలపై ప్రధాన భారం ఉంది. వీరిద్దరు నిలబడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోహిత్, గిల్ కూడా రాణిస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. గత రికార్డుల ప్రకారం ఇది భారత్‌కు అచ్చి రాని మైదానమే అయినా... ఎన్నో ఇలాంటి అసాధ్యమైన ఘనతలను ఇటీవల టీమిండియా తిరగరాస్తూ వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇది కూడా ఆ జాబితాలో చేరుతుంది.
ఆసీస్ ఏం చేస్తుందో!
మెల్‌బోర్న్‌లో ఓటమి తర్వాత సిడ్నీలో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. బ్రిస్బేన్‌లో ఆడేందుకు భారత్ భయపడుతుందంటూ వ్యాఖ్యలు చేసినవారంతా సిడ్నీలో టీమిండియా ప్రదర్శన తర్వాత నోరు విప్పే సాహసం చేయలేదు. కఠిన పరిస్థితుల్లోనూ పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని రహానే బృందం ఆడిన తీరు ఆసీస్ శిబిరంలో ఆందోళన పెంచింది. ‘36’లాంటి అనూహ్యం సంభవిస్తే తప్ప భారత్‌ను ఓడించలేమని వారికి అర్థమైంది. బ్రిస్బేన్‌లో పరిస్థితి ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉందని తాను చెప్పలేనని స్పిన్నర్ లయన్ వ్యాఖ్యానించడం పరిస్థితిని చూపిస్తోంది. అమిత భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకరు టెస్టుకు ముందు తప్పుకునే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే ఆసీస్ మరింత బలహీనంగా మారిపోతుంది. ఫిట్‌గా లేకపోయినా మరో సారి వార్నర్‌ను ఎలాగైనా ఆడించాలని జట్టు సిద్ధమైంది. స్మిత్ ఫామ్‌లోకి రావడమే ఆ జట్టుకు పెద్ద ఊరట. అతనితో కలిసి లబ్‌షేన్ కూడా రాణిస్తే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు.
► నాథన్ లయన్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్. అతను ఈ మైలురాయి చేరనున్న 13వ ఆస్ట్రేలియా క్రికెటర్. మరో 4 వికెట్లు తీస్తే అతను టెస్టుల్లో 400 వికెట్లు కూడా పూర్తి చేసుకుంటాడు.
► బ్రిస్బేన్‌లో 6 టెస్టులు ఆడిన భారత్ ఒక్కటి కూడా గెలవలేదు. 5 ఓడి 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 62 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్ 8 మాత్రమే ఓడింది. 1988లో విండీస్ చేతిలో ఓడిన తర్వాత గత 31 టెస్టుల్లో ఆ జట్టుకు ఇక్కడ పరాజయం ఎదురవలేదు.
Comments
Please login to add a commentAdd a comment