భారత జట్టు మ్యాచ్ గెలవలేదు... కానీ గెలిచినంత ఆనందాన్ని పంచింది... ఐదు రోజులు ఆడిన తర్వాత స్కోరు బోర్డు చూస్తే ‘డ్రా’గానే కనిపించవచ్చు... కానీ ఆట ఆఖర్లో కనిపించిన ఉత్కంఠ, ఉద్వేగాలు అక్షరాల రూపంలో రాయలేనివి... ఇక ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టం అనిపించిన క్షణం నుంచి ఇద్దరు ఆటగాళ్లు చూపించిన పట్టుదల, తెగువ నభూతో... సరిగ్గా నిలబడేందుకు కూడా ఇబ్బంది పడుతున్న బ్యాట్స్‌మన్ ఒకవైపు... పరుగు సంగతి దేవుడెరుగు, నడవడమే కష్టంగా అనిపించిన బ్యాట్స్‌మన్ మరోవైపు... తమలో ఒకరు వెనుదిరిగినా పెవిలియన్‌లో కట్టుతో కూర్చున్న ఆటగాడి నుంచి ఏమీ ఆశించలేని పరిస్థితిలో వారిద్దరు ఏకంగా 42.4 ఓవర్ల పాటు (256 బంతులు) పోరాడారు.
జట్టును ఓటమి నుంచి రక్షించి సగర్వంగా నిలబడ్డారు. సెంచరీలు సాధించకపోయినా సరే... సిడ్నీ మైదానం ఎప్పటికీ మరచిపోలేని విధంగా హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ పేర్లతో ప్రత్యేక ముద్ర వేశారు. ఐదు వికెట్లు తీసిన తర్వాత గెలుపు సంబరాలు ఎంతో దూరంలో లేవని భావించిన ఆసీస్ కలలు ఈ ఇద్దరి పోరాటం ముందు భ్రమలుగా తేలిపోయాయి. అందుబాటులో ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ఉపయోగించినా ఫలితం దక్కక ఆతిథ్య జట్టు ‘డ్రా’తో బిక్క మొహం వేసింది. సిరీస్ విజేతను తేల్చే తుది సమరం కోసం బ్రిస్బేన్ బయల్దేరడానికి ముందు ఏ జట్టు ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోందో కొత్తగా చెప్పాలా!
సిడ్నీ: అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కీలక సమరంలో ఓటమిని తప్పించుకుంది. ఆస్ట్రేలియాతో సోమవారం మూడో టెస్టును ‘డ్రా’గా ముగించిన టీమిండియా సిరీస్‌లో 1–1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది.
పంత్ మెరుపులు...
ఐదో రోజు ఆట రెండో ఓవర్లోనే భారత్‌కు షాక్ తగిలింది. లయన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన కెప్టెన్ రహానే (18 బంతుల్లో 4) షార్ట్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ప్రమోట్ అయి ఐదో స్థానంలో బరిలోకి దిగిన రిషభ్ పంత్ తన సహజ ధోరణిలో చెలరేగిపోయాడు. మరోవైపు పుజారా పట్టుదలగా నిలబడి వికెట్ కాపాడే ప్రయత్నం చేయడంతో పంత్‌కు ధాటిగా ఆడే అవకాశం కలిగింది. ముఖ్యంగా లయన్ బౌలింగ్‌లో అతను ఎదురుదాడి చేసిన తీరు ఆకట్టుకుంది. ఒక ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన పంత్... అతని తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.కొంత విరామం తర్వాత లయన్ బౌలింగ్‌లోనే వరుసగా లాంగాఫ్, లాంగాన్ మీదుగా రెండు భారీ సిక్సర్లు బాది 64 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా కొన్ని చక్కటి ఫోర్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్‌లో పుజారా రెండో హాఫ్ సెంచరీని (170 బంతుల్లో) అందుకున్నాడు. అనంతరం తొమ్మిది బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టిన పంత్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే చివరకు లయన్‌దే పైచేయి అయింది. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ గల్లీలో కమిన్స్‌కు చిక్కాడు. మరో ఎండ్‌లో కమిన్స్ కొత్త బంతిని వరుసగా మూడుసార్లు బౌండరీకి తరలించిన పుజారా... హాజల్‌వుడ్ వేసిన చక్కటి బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ దశలో జట్టు ప్రమాదంలో పడినట్లు కనిపించినా... అశ్విన్, విహారి అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
\స్మిత్ ఏమిటిలా?
డ్రింక్స్ విరామ సమయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా స్మిత్ చేసిన చర్య చర్చకు దారి తీసింది. పంత్ క్రీజ్ నుంచి పక్కకు వెళ్లిన సమయంలో క్రీజ్‌పైకి వచ్చిన స్మిత్...షాడో ప్రాక్టీస్ చేస్తూ ఆపైతన కాలితో బ్యాట్స్‌మన్ గార్డ్ మార్క్‌ను చెరిపేస్తున్న వీడియో బయట పడింది. తర్వాత పంత్ వచ్చి మళ్లీ మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇది కావాలని పంత్ ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నమా, లేక రొటీన్‌గా నిబంధనలకు లోబడి అతను అలా చేశాడా అనేది అర్థం కాలేదు. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత లేదు కానీ కొందరు మాజీలు అతని చర్యను విమర్శించారు. మోసగాడు ఎప్పటికీ మోసగాడే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి.
విహారి ఇన్నింగ్స్ సెంచరీతో సమానం. అతను గర్వపడే ప్రదర్శన ఇది. నాకు బ్యాటింగ్‌లో అచ్చొచ్చిన సిడ్నీ మైదానంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. కమిన్స్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇద్దరం గాయాలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏకాగ్రత కోల్పోరాదని గట్టిగా అనుకున్నాం. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది.
–అశ్విన్
టెస్టు మ్యాచ్ చివరి రోజు బ్యాటింగ్ చేసి ఇలా జట్టును కాపాడటం ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. గెలిచి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. ఆట ముగిసిన తర్వాత కూడా మా ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు.
–విహారి
‘మ్యాచ్ ‘డ్రా’నే అయినా మేం ఆడిన పరిస్థితులను బట్టి చూస్తే ఇది మాకు విజయంతో సమానం. ఫలితం గురించి ఆలోచించకుండా మేం చివరి వరకు పోరాడాలని భావించాం. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. విహారి, అశ్విన్ చూపిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. వెస్టిండీస్‌లో చేసిన సెంచరీకంటే విహారి ఈ ఇన్నింగ్సే అత్యుత్తమం. కఠిన పరిస్థితుల్లో గాయంతో అతను చూపిన పట్టుదల నిజంగా ఎంతో ప్రత్యేకం. పంత్ కూడా చాలా బాగా ఆడాడు. లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసమే అతడిని ముందుగా పంపాం. వీరిద్దరు ఉన్నంత వరకు విజయంపై దృష్టి పెట్టాం. ఆ తర్వాతే ‘డ్రా’ గురించి ఆలోచించాం. చివరి ఐదు–ఆరు ఓవర్లలో మాత్రం ఒక్కో బంతిని లెక్క పెడుతూ వచ్చాం.
–రహానే, భారత కెప్టెన్
ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్‌లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా ఫలితం దక్కలేదు.
–పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338;
భారత్ తొలి ఇన్నింగ్స్: 244;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్;
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; గిల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 31; పుజారా (బి) కమిన్స్ 77; రహానే (సి) వేడ్ (బి) లయన్ 4; పంత్ (సి) కమిన్స్ (బి) లయన్ 97; విహారి (నాటౌట్) 23; అశ్విన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11,
మొత్తం (131 ఓవర్లలో 5 వికెట్లకు) 334
వికెట్ల పతనం: 1–71, 2–92, 3–102, 4–250, 5–272.
బౌలింగ్: స్టార్క్ 22–6–66–0, హాజల్‌వుడ్ 26–12–39–2, కమిన్స్ 26–6–72–1, లయన్ 46–17–114–2, గ్రీన్ 7–0–31–0, లబ్‌షేన్ 4–2–9–0.
Comments
Please login to add a commentAdd a comment