drawn
-
Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్‌దే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ గెలుపు ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు! కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ‘డ్రా’ కావడంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు కోల్పోయింది. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో 12 పాయింట్లు సాధించిన టీమిండియా ఖాతాలో ఈ ‘డ్రా’ కారణంగా 4 పాయింట్లే చేరాయి. అంతకు ముందు నాలుగో రోజు 365 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (28), చందర్‌పాల్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రోజు ఆట సాగితే మిగిలిన ఎనిమిది వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోయేది. కానీ వానతో లెక్క మారిపోయింది. నాలుగో రోజు చివరి సెషన్లో భారత్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఈ సెషన్లో ఆడిన 9 ఓవర్లలోనే టీమిండియా 63 పరుగులు చేసింది. రోచ్ ఓవర్లో ఇషాన్ ‘సింగిల్ హ్యాండ్’తో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లోనే కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బంతి తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ ఛేదనలో విండీస్‌కు సరైన ఆరంభం లభించలేదు. బ్రాత్‌వైట్ పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచగా, చందర్‌పాల్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఒకదశలో అతను 50 బంతుల్లో 3 పరుగులే చేశాడు. అశి్వన్ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. స్వీప్ చేయబోయిన బ్రాత్‌వైట్ ఫైన్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. అశి్వన్ తన తర్వాతి ఓవర్లోనే మెకన్జీ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చందర్‌పాల్, బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 438; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 255; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) సిల్వ (బి) వారికాన్ 38; రోహిత్ (సి) జోసెఫ్ (బి) గాబ్రియెల్ 57; గిల్ (నాటౌట్) 29; ఇషాన్ కిషన్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (24 ఓవర్లలో 2 వికెట్లకు) 181 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–98, 2–202. బౌలింగ్: రోచ్ 4–0–46–0, జోసెఫ్ 4–0–37–0, హోల్డర్ 4–0–26–0, గాబ్రియెల్ 6–0–33–1, వారికాన్ 6–0–36–1. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) ఉనాద్కట్ (బి) అశి్వన్ 28; చందర్‌పాల్ (నాటౌట్) 24; మెకెన్జీ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; బ్లాక్‌వుడ్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32 ఓవర్లలో 2 వికెట్లకు) 76. వికెట్ల పతనం: 1–38, 2–44. బౌలింగ్: సిరాజ్ 8–2–24–0, ముకేశ్ 5–4–5–0, ఉనాద్కట్ 3–2–1–0, అశ్విన్ 11–2–33–2, జడేజా 5–1–10–0. -
ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి పాక్- కివీస్ మ్యాచ్ ఏమైందంటే?
కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా 0-0తో డ్రాగానే ముగిసింది. ఇక ఆఖరి రోజు ఆటలో పాక్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. అదే విధంగా న్యూజిలాండ్ గెలుపుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్న సమయంలో వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. దీంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకున్నాయి. కాగా 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 వికెట్లు 304 పరుగులు సాధించింది. అయితే పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ అదనంగా మరో 277 పరుగులు చేసి పాకిస్తాన్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ అహ్మద్‌కు అవార్డు లభించింది. అదే విధంగా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ కూడా సర్ఫరాజ్‌నే వరించింది. చదవండి: IND vs SL: కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్ పాండ్యాపై గంభీర్ కీలక వాఖ్యలు -
Ranji Trophy: హైదరాబాద్ బతికిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తమిళనాడు విజయలక్ష్యం 144 పరుగులు...అదీ 11 ఓవర్లలో...అంటే ఓవర్‌కు 13కు పైగా పరుగులు...సాధారణంగానైతే రంజీ ట్రోఫీలో ఇలాంటి స్థితిలో కష్టసాధ్యమైన లక్ష్యం కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు ‘షేక్‌హ్యాండ్’తో ‘డ్రా’కు సిద్ధమవడం సహజం. కానీ తమిళనాడు భిన్నంగా ఆలోచించింది. టి20 తరహాలో ఛేదనకు సిద్ధమై అంతకంటే వేగంగా పరుగులు సాధించింది. 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 108 పరుగులు (ఓవర్‌కు 15.42 పరుగుల చొప్పున) చేసింది. ఎన్.జగదీశన్ (22 బంతుల్లో 59 నాటౌట్; 8 సిక్సర్లు), సాయి సుదర్శన్ (20 బంతుల్లో 42; 5 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లతో పండగ చేసుకున్నారు. 24 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన ఈ దశలో ఖాయంగా తమిళనాడు గెలుస్తుందనిపించింది. అయితే హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది. వెలుతురు తగ్గిందంటూ ‘రీడింగ్’ చూసి అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాంతో మ్యాచ్ డ్రా కాగా, తమిళనాడు బ్యాటర్లు నిరాశగా వెనుదిరిగారు. వెలుతురులేని తమకు అనుకూలంగా మారుతుందని ఊహించిన హైదరాబాద్ ‘వ్యూహాత్మకంగానే’ చివర్లో సమయం వృథా చేసింది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్ద చేరగా, లాంగాఫ్నుంచి కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ బంతి బంతికీ బౌలర్ వద్దకు వచ్చి సూచనలు ఇస్తూ పోయాడు. ఒక దశలో సిక్సర్‌గా మారిన బంతిని వెనక్కి ఇవ్వడంలో హైదరాబాద్ ఫీల్డర్లు బాగా ఆలస్యం చేస్తుండటంతో తమిళనాడు ఆటగాళ్లే స్టాండ్స్‌లోకి వెళ్లిపోయి బంతులు అందించారు. కానీ చివరకు ఫలితం మాత్రం రాలేదు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కో రు 28/0తో ఆట కొనసాగించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
Sultan of Johor Cup: ఫైనల్లో భారత్
జొహొర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించినా తుది పోరుకు అర్హత సాధించడంలో సఫలమైంది. భారత్ తరఫున పూవన్న (7వ నిమిషం), అమన్‌దీప్ (50), అరైజీత్ సింగ్ (53), శార్దా నంద్ (56, 58) గోల్స్ సాధించారు. బ్రిటన్ ఆటగాళ్లలో మ్యాక్స్ అండర్నస్ (1వ నిమిషం, 40వ), జామీ గోల్డెన్ (54, 56) రెండేసి గోల్స్ కొట్టగా, హారిసన్ స్టోన్ (42) మరో గోల్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లు సాధించిన భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌ల ద్వారానే 10 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ముందే ఫైనల్‌కు అర్హత సాధించగా, ఫైనల్ స్థానం కోసం దక్షిణాఫ్రికాతో భారత్ పోటీలో నిలిచింది. అయితే తర్వాత జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6–1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ ముందంజ వేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Sultan of Johor Hockey: భారత్ 5 ఆస్ట్రేలియా 5
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ చివరి నిమిషంలో అమన్‌దీప్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. శారదానంద్ తివారి (8వ, 35వ ని.లో) రెండు గోల్స్... బాబీ సింగ్ ధామి (2వ ని.లో), అర్జింత్ సింగ్ హుండల్ (18వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శుక్రవారం బ్రిటన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్‌కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్‌లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్‌ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
Women Hockey World Cup: ఇంగ్లండ్‌ను నిలువరించిన భారత్
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. పూల్ ‘బి’లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్స్ వద్ద ‘డ్రా’ చేసుకుంది. ఆట తొమ్మిదో నిమిషంలో ఇసాబెల్లా పెటర్ గోల్‌తో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 28వ నిమిషంలో లభించిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను వందన కటారియా గోల్‌గా మల్చడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పూల్ ‘బి’లోని నాలుగు జట్లు (చైనా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్) ఒక్కో పాయింట్‌తో సమంగా ఉన్నాయి. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడుతుంది. -
రాణించిన శుబ్‌మన్ గిల్.. 'డ్రా' గా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్..!
లెస్టర్‌షైర్ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత జట్టు ‘డ్రా’ గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 364/7 వద్దే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లెస్టర్షైర్కు 367 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లెస్టర్‌షైర్ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లెస్టర్ జట్టుకు ఆడిన భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం -
'పనికిమాలిన పిచ్‌లు తయారు చేయకండి'
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల మ్యాచ్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాట్స్‌మన్ పండగ చేసుకున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా పాక్ బౌలర్లకు ధీటుగానే బదులిచ్చారు. ఒక రకంగా జీవం లేని పిచ్‌ను ఎలా తయారు చేయడం ఏంటని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ -ఉల్-హక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ ఏంటి అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలో నిజముంది. కనీసం వచ్చే టెస్టులో పనికిమాలిన పిచ్ తయారు చేయరని భావిస్తున్నా. టెస్టుల్లో ఇలాంటి ఫలితం ఎప్పుడు చూశానో నాకు సరిగా గుర్తులేదు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదటిరోజునే పిచ్ ఏంటనేది అర్థమైపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులిచ్చింది. మొదట పాక్ ఈ మ్యాచ్‌లో 100-150 పరుగుల లీడ్ సాధిస్తుందని అనుకున్నా. కానీ ఆసీస్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయంటారు. కాబట్టి కనీసం వచ్చే టెస్టుకైనా స్పోర్టింగ్ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నా. స్పిన్నర్లకు సహకరించేలా వికెట్ తయారు చేయండి. దయచేసి డెడ్ పిచ్‌లను తయారు చేయకండి.'' అంటూ యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. చదవండి: Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1 -
యూకీ బాంబ్రీకి నిరాశ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 3–6, 4–6తో ఒనీల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. -
Novak Djokovic: జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్ ‘డబుల్‌ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా..
India And South Africa A Series Draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికారిక టెస్టు కూడా ‘డ్రా’గా ముగిసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 0–0తో ‘డ్రా’ అయ్యింది. 304 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్... మ్యాచ్ చివరి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 311 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జుబేర్ హమ్జా (125 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. చాలెంజర్ విజేత ఇండియా ‘ఎ’ సాక్షి, విజయవాడ: సీనియర్ మహిళల క్రికెట్ చాలెంజర్ ట్రోఫీని ఇండియా ‘ఎ’ జట్టు గెలుచు కుంది. గురువారం మూలపాడు మైదానంలో జరిగిన ఫైనల్లో ‘ఎ’ 3 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ను ఓడించింది. ముందుగా ‘డి’ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (74 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు), ఎస్. మేఘన (44 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. డీడీ కసట్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ‘ఎ’ టీమ్ 45.4 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. యస్తిక భాటియా (102 బంతుల్లో 86; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చల్లా ఝాన్సీ లక్ష్మీ(70 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీసినా లాభం లేకపోయింది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
భారత్, కజకిస్తాన్ క్వార్టర్స్ తొలి మ్యాచ్ ‘డ్రా’
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం కజకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్‌ను ఆర్ వైశాలి 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్‌లో మేరీఆన్ గోమ్స్ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు.. -
భారత జట్లకు సులువైన డ్రా
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ టోర్నీ థామస్, ఉబెర్ కప్‌లలో భారత జట్లకు సులువైన డ్రా ఎదురైంది. డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఈ టోర్నీలు జరుగనున్నాయి. పురుషుల టోర్నీ థామస్ కప్‌లో భారత జట్టు గ్రూప్‘సి’లో డిఫెండింగ్ చైనా, నెదర్లాండ్స్, తాహిటిలతో తలపడనుంది. ఈ గ్రూప్‌లో చైనా మింగుడుపడని ప్రత్యర్థి అయినప్పటికీ మిగతా జట్టు నెదర్లాండ్, తాహిటిలపై గెలవడం ద్వారా నాకౌట్‌కు అర్హత సంపాదించవచ్చు. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు కాగా, ఇందులో ముందంజ వేయడం అంత కష్టమైన పనే కాదు. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
మనోళ్ల ప్రాక్టీస్ ముగిసింది
చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించింది. గురువారం ఆట ఆరంభించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 55 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (77 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్ (81 బంతుల్లో 47; 7 ఫోర్లు), పుజారా (58 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. మయాంక్, పుజారా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (105 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా నిలకడగా బ్యాటింగ్ చేశారు. జాక్ కార్సన్ రెండు వికెట్లు తీశాడు. భారత్ ప్రత్యర్థి ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కౌంటీ జట్టు 15.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసిన దశలో ఫలితం తేలదనే ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్లు కూడా ‘డ్రా’కు అంగీకరించారు. దాంతో రోజు ఆటలో మరో 19 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. హసీబ్ అహ్మద్ (48 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్), జేక్ లిబీ (48 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హసీబ్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం 17 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. -
శరత్ కమల్–మనిక జంటకు క్లిష్టమైన ‘డ్రా’
టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ శరత్ కమల్–మనిక బత్రాకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. బుధవారం విడుదల చేసిన ‘డ్రా’లో భారత జంట తొలి రౌండ్లో మూడో సీడ్ లిన్ యున్–జు, చెంగ్ చింగ్ (చైనీస్ తైపీ) ద్వయంతో తలపడుతుంది. మార్చిలో ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జీ జెనోన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి శరత్ కమల్–మనిక జోడీ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. -
ప్రతీ మ్యాచ్ కీలకమే
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ‘డ్రా’ను బట్టి చూస్తే తనకు కొంత సులువుగానే అనిపిస్తున్నా... ప్రతీ దశలో పాయింట్ల కోసం పోరాడక తప్పదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ‘డ్రా’లో గ్రూప్ ‘జె’లో ఉన్న సింధు... చెంగ్ గాన్ యి (హాంకాంగ్), సెనియా పొలికరపోవా (ఇజ్రాయెల్)లతో తలపడాల్సి ఉంది. గ్రూప్ టాపర్‌గా నిలిచి ముందంజ వేస్తే ఆపై నాకౌట్ మ్యాచ్‌లు ఎదురవుతాయి. ‘గ్రూప్ దశలో నాకు మెరుగైన ‘డ్రా’ ఎదురైంది. హాంకాంగ్ అమ్మాయి బాగానే ఆడుతుంది. అయితే ప్రతీ ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. నేనూ బాగా ఆడగలనని నమ్ముతున్నా. ప్రతీ మ్యాచ్ కీలకమే కాబట్టి తర్వాతి దశ ప్రత్యర్థుల గురించి కాకుండా ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడతా. ఒలింపిక్స్ అంటేనే ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదు’ అని సింధు అభిప్రాయపడింది. పురుషుల సింగిల్స్‌లో పోటీ పడుతున్న సాయిప్రణీత్ తన ‘డ్రా’ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మరీ కఠినంగా గానీ మరీ సులువుగా గానీ ఏమీ లేదని... విజయం కోసం 100 శాతం ప్రయత్నిస్తానని అతను చెప్పాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు కఠిన ‘డ్రా’ ఎదురైనా... గెలవగల సత్తా తమకుందని డబుల్స్ కోచ్ మథియాస్ బో అన్నాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 24 నుంచి జరుగుతాయి. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రధాని సమీ„ý టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం సన్నాహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టోక్యో విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లకు అందిస్తున్న సౌకర్యాలు, వివిధ క్రీడాంశాలకు ఇస్తున్న సహకారంలతో పాటు ప్రయాణ ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ స్థితి తదితర అంశాలపై మోదీ సుదీర్ఘంగా సమీక్షించారు. టోక్యో వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని ‘వర్చువల్’ పద్ధతిలో ఈ నెల 13న భేటీ కూడా కానున్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లతో తాను సంభాషించబోతున్నానని మోదీ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ జరగనుండగా... భారత తొలి బృందం ఈ నెల 17న ప్రత్యేక విమానంలో టోక్యో వెళుతుంది. -
సింధుకు సులువు
టోక్యో: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తాజా ఒలింపిక్స్‌లో సులువైన ‘డ్రా’ ఎదురైంది. ఆరో సీడ్‌గా ఉన్న సింధు మహిళల సింగిల్స్ గ్రూప్ ‘జె’లో తన పోరును ప్రారంభించనుంది. ఇందులో సింధుతో పాటు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ గాన్ యి (ప్రపంచ 34వ ర్యాంకర్), ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పొలికర్పొవా (58) ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే. వీరిద్దరిపై సింధు రికార్డు 5–0, 2–0గా ఉంది. మొత్తం 16 గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌నుంచి ఒక్కో ప్లేయర్ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. సంచలనాలు లేకపోతే సింధు క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యామగూచితో తలపడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ ముందంజ వేయాలంటే తన గ్రూప్‌లో ఉన్న మార్క్ కాల్జో (29; నెదర్లాండ్స్), జిల్బర్మన్ (47; ఇజ్రాయెల్)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్‌లో అతను లాంగ్ ఆంజస్ (హాంకాంగ్)ను ఓడించగలిగితే జపాన్ స్టార్, ఫేవరెట్ మొమొటాను క్వార్టర్స్‌లో ఎదుర్కోవాల్సి రావచ్చు. -
పరాజయంతో మొదలు...
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ‘డ్రా’గా ముగించిన భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను మాత్రం పరాజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టును ఓడించింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బీమోంట్ (87 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), సీవర్ (74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. అబేధ్యమైన మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (108 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (10; 1 ఫోర్), షఫాలీ వర్మ (15; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... పూనమ్ రౌత్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (30; 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 3, కేథరిన్ బ్రంట్, ష్రబ్సోల్ చెరో 2 వికెట్లు తీశారు. -
భారత మహిళల అసమాన పోరాటం
బ్రిస్టల్: ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నారు. లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు), శిఖా పాండే (50 బంతుల్లో 18; 3 ఫోర్లు), తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించారు. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న స్నేహ్, తానియా అజేయంగా తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 83/1తో మ్యాచ్ చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 121 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు చేసింది. టీ విరామానికి భారత్ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో ఉంది. అయితే చివరి సెషన్ అంతా స్నేహ్, తానియా వికెట్ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు షఫాలీ వర్మ (83 బంతుల్లో 63; 11 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (168 బంతుల్లో 54; 8 ఫోర్లు), పూనమ్ రౌత్ (104 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (8) మాత్రం మళ్లీ నిరాశపరిచారు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 27న మొదలవుతుంది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 396/9 డిక్లేర్డ్; భారత్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 344/8 (121 ఓవర్లలో). -
కరుణరత్నే అజేయ డబుల్ సెంచరీ
పల్లెకెలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నే (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) డబుల్ సెంచరీకితోడు ధనంజయ డిసిల్వా (154 బ్యాటింగ్; 20 ఫోర్లు) శతకంతో క్రీజులో నిలబడటంతో... బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 229/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 512 పరుగులు చేసింది. వెలుతురులేమితో 76 ఓవర్ల ఆట సాధ్యంకాగా... శ్రీలంక ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. కరుణరత్నే, ధనంజయ నాలుగో వికెట్‌కు అజేయంగా 322 పరుగులు జతచేశారు. నాలుగో రోజు కరుణరత్నే–ధనంజయ ద్వయం 283 పరుగులు జోడించింది. కరుణరత్నే కెరీర్లో ఇది తొలి డబుల్ సెంచరీ. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక తరఫున ఒక రోజంతా ఆడిన ఆరో జోడీగా కరుణరత్నే–ధనంజయ జంట నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 541/7కు శ్రీలంక మరో 29 పరుగుల దూరంలో ఉంది. -
అశ్విన్, విహారి వీరోచిత ప్రదర్శన
భారత జట్టు మ్యాచ్ గెలవలేదు... కానీ గెలిచినంత ఆనందాన్ని పంచింది... ఐదు రోజులు ఆడిన తర్వాత స్కోరు బోర్డు చూస్తే ‘డ్రా’గానే కనిపించవచ్చు... కానీ ఆట ఆఖర్లో కనిపించిన ఉత్కంఠ, ఉద్వేగాలు అక్షరాల రూపంలో రాయలేనివి... ఇక ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టం అనిపించిన క్షణం నుంచి ఇద్దరు ఆటగాళ్లు చూపించిన పట్టుదల, తెగువ నభూతో... సరిగ్గా నిలబడేందుకు కూడా ఇబ్బంది పడుతున్న బ్యాట్స్‌మన్ ఒకవైపు... పరుగు సంగతి దేవుడెరుగు, నడవడమే కష్టంగా అనిపించిన బ్యాట్స్‌మన్ మరోవైపు... తమలో ఒకరు వెనుదిరిగినా పెవిలియన్‌లో కట్టుతో కూర్చున్న ఆటగాడి నుంచి ఏమీ ఆశించలేని పరిస్థితిలో వారిద్దరు ఏకంగా 42.4 ఓవర్ల పాటు (256 బంతులు) పోరాడారు. జట్టును ఓటమి నుంచి రక్షించి సగర్వంగా నిలబడ్డారు. సెంచరీలు సాధించకపోయినా సరే... సిడ్నీ మైదానం ఎప్పటికీ మరచిపోలేని విధంగా హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ పేర్లతో ప్రత్యేక ముద్ర వేశారు. ఐదు వికెట్లు తీసిన తర్వాత గెలుపు సంబరాలు ఎంతో దూరంలో లేవని భావించిన ఆసీస్ కలలు ఈ ఇద్దరి పోరాటం ముందు భ్రమలుగా తేలిపోయాయి. అందుబాటులో ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ఉపయోగించినా ఫలితం దక్కక ఆతిథ్య జట్టు ‘డ్రా’తో బిక్క మొహం వేసింది. సిరీస్ విజేతను తేల్చే తుది సమరం కోసం బ్రిస్బేన్ బయల్దేరడానికి ముందు ఏ జట్టు ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోందో కొత్తగా చెప్పాలా! సిడ్నీ: అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కీలక సమరంలో ఓటమిని తప్పించుకుంది. ఆస్ట్రేలియాతో సోమవారం మూడో టెస్టును ‘డ్రా’గా ముగించిన టీమిండియా సిరీస్‌లో 1–1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. పంత్ మెరుపులు... ఐదో రోజు ఆట రెండో ఓవర్లోనే భారత్‌కు షాక్ తగిలింది. లయన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన కెప్టెన్ రహానే (18 బంతుల్లో 4) షార్ట్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ప్రమోట్ అయి ఐదో స్థానంలో బరిలోకి దిగిన రిషభ్ పంత్ తన సహజ ధోరణిలో చెలరేగిపోయాడు. మరోవైపు పుజారా పట్టుదలగా నిలబడి వికెట్ కాపాడే ప్రయత్నం చేయడంతో పంత్‌కు ధాటిగా ఆడే అవకాశం కలిగింది. ముఖ్యంగా లయన్ బౌలింగ్‌లో అతను ఎదురుదాడి చేసిన తీరు ఆకట్టుకుంది. ఒక ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన పంత్... అతని తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.కొంత విరామం తర్వాత లయన్ బౌలింగ్‌లోనే వరుసగా లాంగాఫ్, లాంగాన్ మీదుగా రెండు భారీ సిక్సర్లు బాది 64 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా కొన్ని చక్కటి ఫోర్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్‌లో పుజారా రెండో హాఫ్ సెంచరీని (170 బంతుల్లో) అందుకున్నాడు. అనంతరం తొమ్మిది బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టిన పంత్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే చివరకు లయన్దే పైచేయి అయింది. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ గల్లీలో కమిన్స్‌కు చిక్కాడు. మరో ఎండ్‌లో కమిన్స్ కొత్త బంతిని వరుసగా మూడుసార్లు బౌండరీకి తరలించిన పుజారా... హాజల్‌వుడ్ వేసిన చక్కటి బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ దశలో జట్టు ప్రమాదంలో పడినట్లు కనిపించినా... అశ్విన్, విహారి అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. \స్మిత్ ఏమిటిలా? డ్రింక్స్ విరామ సమయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా స్మిత్ చేసిన చర్య చర్చకు దారి తీసింది. పంత్ క్రీజ్ నుంచి పక్కకు వెళ్లిన సమయంలో క్రీజ్‌పైకి వచ్చిన స్మిత్...షాడో ప్రాక్టీస్ చేస్తూ ఆపైతన కాలితో బ్యాట్స్‌మన్ గార్డ్ మార్క్‌ను చెరిపేస్తున్న వీడియో బయట పడింది. తర్వాత పంత్ వచ్చి మళ్లీ మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇది కావాలని పంత్ ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నమా, లేక రొటీన్‌గా నిబంధనలకు లోబడి అతను అలా చేశాడా అనేది అర్థం కాలేదు. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత లేదు కానీ కొందరు మాజీలు అతని చర్యను విమర్శించారు. మోసగాడు ఎప్పటికీ మోసగాడే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. విహారి ఇన్నింగ్స్ సెంచరీతో సమానం. అతను గర్వపడే ప్రదర్శన ఇది. నాకు బ్యాటింగ్‌లో అచ్చొచ్చిన సిడ్నీ మైదానంలో మరో మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. కమిన్స్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇద్దరం గాయాలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏకాగ్రత కోల్పోరాదని గట్టిగా అనుకున్నాం. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. –అశ్విన్ టెస్టు మ్యాచ్ చివరి రోజు బ్యాటింగ్ చేసి ఇలా జట్టును కాపాడటం ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. గెలిచి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. ఆట ముగిసిన తర్వాత కూడా మా ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు. –విహారి ‘మ్యాచ్ ‘డ్రా’నే అయినా మేం ఆడిన పరిస్థితులను బట్టి చూస్తే ఇది మాకు విజయంతో సమానం. ఫలితం గురించి ఆలోచించకుండా మేం చివరి వరకు పోరాడాలని భావించాం. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. విహారి, అశ్విన్ చూపిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. వెస్టిండీస్‌లో చేసిన సెంచరీకంటే విహారి ఈ ఇన్నింగ్సే అత్యుత్తమం. కఠిన పరిస్థితుల్లో గాయంతో అతను చూపిన పట్టుదల నిజంగా ఎంతో ప్రత్యేకం. పంత్ కూడా చాలా బాగా ఆడాడు. లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసమే అతడిని ముందుగా పంపాం. వీరిద్దరు ఉన్నంత వరకు విజయంపై దృష్టి పెట్టాం. ఆ తర్వాతే ‘డ్రా’ గురించి ఆలోచించాం. చివరి ఐదు–ఆరు ఓవర్లలో మాత్రం ఒక్కో బంతిని లెక్క పెడుతూ వచ్చాం. –రహానే, భారత కెప్టెన్ ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్‌లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా ఫలితం దక్కలేదు. –పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; గిల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 31; పుజారా (బి) కమిన్స్ 77; రహానే (సి) వేడ్ (బి) లయన్ 4; పంత్ (సి) కమిన్స్ (బి) లయన్ 97; విహారి (నాటౌట్) 23; అశ్విన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (131 ఓవర్లలో 5 వికెట్లకు) 334 వికెట్ల పతనం: 1–71, 2–92, 3–102, 4–250, 5–272. బౌలింగ్: స్టార్క్ 22–6–66–0, హాజల్‌వుడ్ 26–12–39–2, కమిన్స్ 26–6–72–1, లయన్ 46–17–114–2, గ్రీన్ 7–0–31–0, లబ్‌షేన్ 4–2–9–0. -
ప్రాక్టీస్ ప్రతిఫలం మనకే
కోహ్లి తప్ప అందరూ బరిలోకి దిగారు. ఒకరిద్దరు మినహా అంతా బాగా ఆడారు. డే–నైట్ టెస్టుకు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ ఈ డే–నైట్ వార్మప్ మ్యాచ్‌తో వచ్చేసింది. అంతకుమించి భారత్‌కు క్లారిటీ ఇచ్చిన మ్యాచ్ కూడా ఇదే! ఓపెనింగ్ నుంచి సీమర్ల దాకా తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయొచ్చో టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టతనిచ్చింది. ఇక ఈ పర్యటనలో మిగిలున్న ‘టెస్టు’లకు భారత్ సై అంటోంది. సిడ్నీ: ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్‌గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. ఈ మ్యాచ్ జట్టు కూర్పునకు దోహదం చేసింది. లయతప్పిన పంత్‌ను ఫామ్‌లోకి తెచ్చింది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్ గిల్ చక్కని ప్రత్యామ్నాయం అనిపించింది. విహారిని అక్కరకొచ్చే పార్ట్‌టైమ్ బౌలర్ (స్పిన్)గా, మిడిలార్డర్లో దీటైన బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. ఇక మ్యాచ్ పింక్‌బాల్ ప్రాక్టీస్ కూడా ‘డ్రా’ ఫలితాన్నే ఇచ్చింది. ఆఖరి రోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) పూర్తిగా బ్యాటింగ్ వికెట్‌గా మారింది. దీంతో భారత బౌలర్ల శ్రమంతా నీరుగారింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో బెన్ మెక్‌డెర్మట్ (107 నాటౌట్; 16 ఫోర్లు), జాక్ విల్డర్‌ముత్ (111 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకాలతో నిలబడ్డారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. ‘కంగారూ’ పెట్టిన ఆరంభం... భారత్ క్రితం రోజు స్కోరు వద్దే డిక్లేర్ చేసింది. దీంతో చివరి రోజు 473 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ను భారత్ పేసర్లు షమీ (2/58), సిరాజ్ (1/54) వణికించారు. ఓపెనర్లు హారిస్ (5), బర్న్స్ (1), వన్‌డౌన్‌లో మ్యాడిన్సన్ (14)లను భారత సీమ్ ద్వయం పడేసింది. అలా టాపార్డర్‌ను 25 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో మెక్‌డెర్మట్, కెప్టెన్ అలెక్స్ క్యారీ (111 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతోపాటే మ్యాచ్ సాగుతున్నకొద్దీ పిచ్ కూడా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైంది. ఎస్సీజీ సహజంగానే బ్యాటింగ్ పిచ్ కావడంతో భారత బౌలర్ల వ్యూహాలు పనిచేయలేదు. మెక్‌డెర్మట్, క్యారీ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించాక క్యారీని హనుమ విహారి బోల్తా కొట్టించాడు. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత మరో వికెట్‌నే చేజార్చుకోలేదు. విల్డర్‌ముత్ వన్డేను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. పిచ్ సానుకూలతల్ని సద్వినియోగం చేసుకున్న అతను భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇది సరే... కానీ! ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్ ఆఖరి రోజు అదరగొట్టారు. అజేయ సెంచరీలు సాధించారు. అయితే ఈ ఉత్సాహమేది ఆతిథ్య జట్టును ఊరడించలేదు. ఎందుకంటే గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఇదేమాత్రం కలిసొచ్చే అంశం కాదు. ప్రధానంగా ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్కషన్ అయ్యాడు. ఇతని స్థానంలో ఆడిన హారిస్ విఫలమయ్యాడు. జో బర్న్స్ అయితే నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఇపుడు ఓపెనర్ల సమస్య కాదు... ఓపెనర్లే కరువైన సమస్య వచ్చిపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194 ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108 భారత్ రెండో ఇన్నింగ్స్: 386/4 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) పృథ్వీ షా (బి) షమీ 5; బర్న్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 1; మ్యాడిన్సన్ (సి)సైనీ (బి) సిరాజ్ 14; మెక్‌డెర్మట్ (నాటౌట్) 107; క్యారీ (సి) సబ్–కార్తీక్ త్యాగి (బి) విహారి 58; విల్డర్‌ముత్ (నాటౌట్) 111 ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (75 ఓవర్లలో 4 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–25, 4–142. బౌలింగ్: షమీ 13–3–58–2, బుమ్రా 13–7–35–0, సిరాజ్ 17–3–54–1, సైనీ 16–0–87–0, హనుమ విహారి 7–1–14–1, మయాంక్ అగర్వాల్ 6–0–30–0, పృథ్వీ షా 3–0–26–0. మెక్‌డెర్మట్, విల్డర్‌ముత్ -
హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్ గోల్‌గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌లో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో డ్రా నమోదు చేసింది. -
మర్రిలంక.. మరి లేదింక
సాక్షి, యలమంచిలి (పశ్చిమ గోదావరి): చుట్టూ గోదావరి.. మధ్యలో మర్రిలంక. అక్కడ విద్యుత్ లేదు. రోడ్లు లేవు. అక్కడకు వెళ్లాలన్నా, రావాలన్నా పడవ ప్రయాణమే ఆధారం. అయినా అక్కడ సుమారు 50 గడపల్లో 60కి పైగా కుటుంబాలు దశాబ్దాలపాటు నివసించాయి. ఈ ద్వీపం ఇప్పుడు కాల గర్భంలో కలసిపోయింది. ఇళ్లన్నీ గోదావరిలో కలసిపోవడంతో ఆ కుటుంబాలన్నీ కనకాయలంక తరలివచ్చాయి. కనకాయలంకలో స్థిరపడిన వారిలో యువకులు చాలామంది ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలివెళ్లినా మర్రిలంకలో పుట్టిన వృద్ధులు మాత్రం ఇప్పటికీ మర్రిలంకపై అభిమానాన్ని చంపుకోలేక నిత్యం అక్కడికి వెళ్లి గడుపుతున్నారు. అటువంటి వారిలో చిల్లే నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మర్రిలంకలోని ఇళ్లన్నీ కోతకు గురవడంతో అక్కడి నుంచి కనకాయలంక వచ్చిన నారాయణమూర్తి ఇప్పటికీ ప్రతి రోజు పడవపై మర్రిలంక వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పశువులను మేపుకుని ఇంటికి వస్తాడు. అలా ఎందుకని నారాయణమూర్తిని ప్రశ్నిస్తే అక్కడే పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కూడా అక్కడే కలిగారు. మర్రిలంకతో నా బంధం విడిపోనిది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ లంకలో తాగిన నీళ్లు, జొన్న అన్నం, రాగి తోపు చలవే. అయితే మర్రిలంక నుంచి అందరూ వచ్చేయడంతో కనకాయలంకలో ఇల్లు కట్టుకున్నాను. కాని ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రోజూ ఉదయమే చద్దన్నం తిని పడవపై మర్రిలంక వెళ్తాను. మధ్యాహ్నం భోజనం పడవపై వస్తుంది. సాయంత్రం వరకూ అక్కడే పశువులు మేపుకుని వస్తానన్నాడు. మరో వృద్ధుడు చిల్లే చినరామన్నను పలకరిస్తే తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చాం కాని మా మనసంతా మర్రిలంకలో ఉంటుందన్నారు. అక్కడ 70 ఏళ్లు ఉన్నానని, ఎప్పుడు చిన్న రోగం కూడా రాలేదన్నారు. అక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, కల్తీలేని ఆహారమే అందుకు కారణమని చెప్పాడు. చిన్నతనంలో కూలి పనికి వెళితే అర్ధ రూపాయి కూలి ఇచ్చేవారు. ఆ డబ్బు హాయిగా బతకడానికి సరిపోయేది. ఇప్పుడు రూ.500 కూలి వస్తున్నా సరిపోవడం లేదని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసిన ఒకే వ్యక్తి మర్రిలంకలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి, ఆఖరి వ్యక్తిని నేనే. అక్కడ నుంచి పడవపై దొడ్డిపట్ల వచ్చి 10వ తరగతి చదువుకున్నాను. అనంతరం పాలకొల్లులో ఇంటర్, వీరవాసరంలో హాస్టల్లో ఉండి డిగ్రీ చదివాను. మా తాతలు, నాన్నలు మర్రిలంకలో ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వ్యవసాయం ఒక్కటే చేసేవారు. రాజకీయాల గురించి అసలు తెలిసేది కాదు. అయితే ఎన్నికలు వస్తే అందరూ కాంగ్రెస్‌కే ఓటేసేవారు. – చిల్లే వసంతరావు కల్మషం తెలియని రోజులవి నా చిన్నతనమంతా మర్రిలంకలోనే గడచిపోయింది. మర్రిలంకలో ఉన్నన్ని రోజులు కల్మషమంటే తెలియదు. అందరికీ కలిపి సొంత పడవ ఉండేది. శుక్రవారం వచ్చిందంటే ఆ పడవపై దొడ్డిపట్ల వెళ్లి సంత చేసుకు వచ్చేవారు. సంతలో తెచ్చే మిఠాయిలు కోసం పిల్లలందరూ ఎదురు చూసేవాళ్లం. అందరిదీ ఒకే మాటగా ఉండేది. వరదలు వచ్చినా అక్కడే ఉండేవాళ్లం. అక్కడ ఎన్నో విషసర్పాలు ఉండేవి. కాని ఒకసారి కూడా ఎవరినీ కాటేసిన దాఖలాలు లేవు. - చిల్లే శ్యామ్‌సుందర్ -
ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరితో హరికృష్ణ గేమ్ ‘డ్రా’
షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో చైనాలో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ప్రపంచ 29వ ర్యాంకర్ హరికృష్ణ 66 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 4.5 పాయింట్లతో అనీశ్ గిరి రెండో స్థానంలో... 3.5 పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు. -
ఓటమి తప్పించుకున్న భారత మహిళలు
కౌలాలంపూర్: ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భాగంగా మలేసియాతో జరగుతోన్న మూడో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తొలిసారి తడబాటుకు గురైంది. అనవసర తప్పిదాలతో ఓటమి ముంగిట నిలిచిన భారత్... ఆ తర్వాత గొప్పగా పుంజుకొని మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 4–4తో డ్రా అయింది. భారత్ తరఫున నవ్‌నీత్ (22వ ని., 45వ ని.) రెండు గోల్స్‌తో భారత్‌ను ఆదుకోగా... నవ్‌జ్యోత్ కౌర్ (13వ ని.), లాల్రెమ్సియామి (54వ ని.) చెరో గోల్ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్ 2 గోల్స్ సాధించింది. గుర్దీప్ కిరణ్‌దీప్ (26వ ని.), నురామిరా జుల్కిఫ్లీ (35వ ని.) ఒక్కో గోల్ స్కోర్ చేశారు. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్... ఈ మ్యాచ్ ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో నవ్‌జ్యోత్, రెండో క్వార్టర్లో నవ్‌నీత్ గోల్ చేయడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే మరో నాలుగు నిమిషాల్లోనే గుర్దీప్ చేసిన గోల్‌తో మలేసియా 1–2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ సిరీస్‌లో మలేసియాకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. తర్వాత మలేసియా జోరు పెంచగా... భారత రక్షణ పంక్తి అనవసర తప్పిదాలు చేస్తూ ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్లను సమర్పించుకుంది. మూడో క్వార్టర్లో లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను నురానీ రషీద్, నుమామిరా గోల్స్‌గా మలచడంతో మలేసియా 4–2తో భారత్‌ను వెనక్కి నెట్టేసింది. అయితే చివరి క్వార్టర్లో నవ్‌నీత్, లాల్రెమ్సియామి అద్భుత గోల్స్‌తో ఆకట్టుకోవడంతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. -
ఆనంద్ గేమ్ డ్రా
షంకిర్ (అజర్బైజాన్): భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’ ఫలితమే ఎదురైంది. వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో సోమవారం తైముర్ రద్జబొవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన భారత ఆటగాడు గెలుపుకోసం చేసిన ఎత్తులేవీ ఫలించలేదు. దీంతో 33 ఎత్తుల వరకు సాగిన ఈ గేమ్ చివరకు డ్రాగా ముగిసింది. తాజా ఫలితంతో ఆనంద్ 4 పాయింట్లతో తైముర్తో పాటు ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ వేటలో మళ్లీ విజయవంతమయ్యాడు. సెర్గీ కర్యాకిన్ (రష్యా 4.5)తో జరిగిన గేమ్‌లో గెలుపొందిన కార్ల్సన్ 6 పాయింట్లతో ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ (రష్యా; 4.5)... డేవిడ్ నవర (చెక్ రిపబ్లిక్; 3.5)పై నెగ్గగా, అనిశ్ గిరి (నెదర్లాండ్స్; 2.5)... షకిరియార్ (అజర్బైజాన్; 3)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రాంజల అర్హత
ముంబై: అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ముంబై ఓపెన్ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రాంజల 6–4, 6–3తో ఒక్సానా కలిష్నికోవా (జార్జియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు చేరింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంజల వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించింది. గతేడాది ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ దాటలేకపోయిన ఆమె ఈసారి సత్తాచాటింది. క్వాలిఫయింగ్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో మెహక్ జైన్ (భారత్) 3–6, 4–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సోమవారం విశ్రాంతి దినం. ఇదే వేదికపై భారత్–వెస్టిండీస్‌ల మధ్య నాలుగో వన్డే జరుగనుండటంతో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లను మంగళవారం నిర్వహించనున్నారు. -
సునీల్ ఆంబ్రిస్ సెంచరీ
వడోదర: బ్యాట్స్‌మెన్ రాణించడంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను విండీస్ ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆంబ్రిస్ (98 బంతుల్లో 114 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపె నర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (52; 9 ఫోర్లు), కీరన్ పావెల్ (44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టుకు శుభారంభాన్ని అందించిన అనంతరం అందరికీ ప్రాక్టీస్ దక్కేందుకు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత హెట్‌మైర్ (7), చేజ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హోప్ (36; 5 ఫోర్లు), డౌరిచ్ (65; 9 ఫోర్లు, 1 సిక్స్)ల అండతో ఆంబ్రిస్ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బోర్డు ఎలెవెన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా... సౌరభ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు బోర్డు ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 360 పరుగులు చేసింది. -
అమెరికాను నిలువరించిన భారత్
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లోని ఆరో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో రెండో సీడ్ రష్యా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో... మహిళల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌ల్లో ఫలితం తేలకపోగా... భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన నాలుగు గేముల్లోనూ ఫలితాలు రావడం విశేషం. ఆనంద్–నెపోమ్నియాట్చి గేమ్ 43 ఎత్తుల్లో... హరికృష్ణ–క్రామ్నిక్ గేమ్ 45 ఎత్తుల్లో... విదిత్–విటియుగోవ్ గేమ్ 31 ఎత్తుల్లో... ఆధిబన్–జావోవెంకో గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 35 ఎత్తుల్లో జటోన్‌స్కీపై; తానియా 31 ఎత్తుల్లో తతేవ్‌పై నెగ్గారు. అయితే ఏపీ గ్రాండ్‌మాస్టర్ హారిక 57 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో... ఇషా 55 ఎత్తుల్లో జెన్నిఫర్ చేతిలో ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 9 పాయింట్లతో 14వ స్థానంలో... భారత మహిళల జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7
బెంగళూరు: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డసెన్ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ ఔట్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. -
టైటిల్ పోరుకు టీమిండియా
బ్రెడా (నెదర్లాండ్స్): చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం ఆతిథ్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’ అయింది. ఫైనల్ చేరేందుకు కనీసం ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు చోమటోడ్చింది. చివరకు ‘డ్రా’ ఫలితంతో తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మన్దీప్ సింగ్ (47వ నిమిషంలో) గోల్ చేయగా, తియెరి బ్రింక్‌మన్ (55వ ని.) నెదర్లాండ్స్‌కు గోల్ అందించాడు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ హర్మన్‌ప్రీత్, సునీల్ వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ ఆకట్టుకున్నాడు. రెండో క్వార్టర్లో ప్రత్యర్థి జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి గోల్ అయినా భారత్ పరిస్థితి క్లిష్టంగా ఉండేది. ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, భారత్ రెండో స్థానంలో ఉంది. టోర్నీ నిబంధనల ప్రకారం టాప్–2 జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–3తో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. రాత్రి గం. 7.30కు మొదలయ్యే ఈ ఫైనల్‌ను స్టార్ స్పోర్ట్స్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
స్విస్ ముందుకెళ్లింది..
నిజ్నీ నోవ్గొరడ్: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్‌కు చేరింది. గ్రూప్ ‘ఇ’లో గురువారం స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రా అయింది. దీంతో ఈ గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న స్విస్, బ్రెజిల్ (7)తో పాటు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోస్టారికా అట్టడుగుకు పడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. స్విస్ తరఫున బ్లెరిమ్ జెమయిలి (31వ ని.), జోసిప్ డ్రిమిక్ (88వ ని.) గోల్ చేయగా, కోస్టారికా జట్టులో కెండల్ వాస్టన్ (56వ ని.) గోల్ సాధించాడు. మరో గోల్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సొమర్ ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో సెల్ఫ్‌గోల్ చేశాడు. -
భారత్ 1–1 బెల్జియం
బ్రెడా (నెదర్లాండ్స్): చివరి క్షణాల్లో పట్టు సడలించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చే అలవాటు మరోసారి భారత్ కొంపముంచింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు ‘డ్రా’గా ముగించింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో గురువారం ఇక్కడ బెల్జియం, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో సమమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో చెలరేగిన భారత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒత్తిడిని కొనసాగిస్తూ... మ్యాచ్‌పై పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకొని భారత ఆటగాళ్లను విసిగించారు. ఈ క్రమంలో భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. -
శ్రీలంకను గెలిపించిన ‘పెరీరా’లు
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. తొలి టెస్టులో భారీ పరాజయం... రెండో మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం కీలకంగా మారిన మూడో టెస్టులో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ డే నైట్ టెస్టులో 144 పరుగుల లక్ష్యాన్ని లంక 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్ స్కోరు 81/5తో మంగళవారం బరిలోకి దిగిన లంక ఒక వికెట్ కోల్పోయి మిగిలిన 63 పరుగులను సాధించింది. నాలుగో రోజు తొలి ఓవర్లోనే కుశాల్ మెండిస్ (25)ను ఔట్ చేసి విండీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే కుషాల్ పెరీరా (43 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు), దిల్రువాన్ పెరీరా (68 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి లంకను గెలిపించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. వెస్టిండీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక మైదానంగా గుర్తింపు ఉన్న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో 1930 నుంచి ఇప్పటి వరకు 53 టెస్టులు జరగ్గా... ఒక ఉపఖండపు జట్టు టెస్టు గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
ఆనంద్ ఖాతాలో మరో ‘డ్రా’
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో ఆదివారం మమెదైరోవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
‘డ్రా’తో సరిపెట్టుకున్నారు
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో తుదికంటా ఆధిపత్యం చలాయించిన భారత్ చివరకు 1–1తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి పాలైన సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శైలానంద్ లక్రా (14వ ని.) తొలి అంతర్జాతీయ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా... డిఫెండర్లు ప్రత్యర్థిని నిలువరించడంతో ఆట 53వ నిమిషం వరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మార్క్ గ్లెగోర్న్ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించినా వరుణ్ కుమార్, అమిత్ రొహిదాస్ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. -
మళ్లీ ‘శత’క్కొట్టిన మోమినుల్
చిట్టగాంగ్: మోమినుల్ హక్ (105; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాయంతో... శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 81/3తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక విజయంపై ఆశలు వదులుకుంది. మోమినుల్తోపాటు లిటన్ దాస్ (94; 11 ఫోర్లు) కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 180 పరుగులు జోడించారు. మోమినుల్ హక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లా తరఫున ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా మోమినుల్ హక్ రికార్డు సృష్టించాడు. -
హారిక ఖాతాలో ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో హారిక 32 ఎత్తుల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ జియాంగ్ జెఫ్రీని నిలువరించింది. ఇదే వేదికపై జరుగుతున్న మాస్టర్స్ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 27 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
జనవరి రెండోవారంలో హజ్ డ్రా!
న్యూఢిల్లీ: 2018లో హజ్ యాత్రకు వెళ్లే వారికోసం జనవరి రెండో వారంలో డ్రా నిర్వహిస్తామని హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సారి వెయ్యిమందికి పైగా మహిళలు మెహ్రమ్(తండ్రి లేదా సోదరుడు లేదా కుమారుడు) తోడులేకుండా హజ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. హజ్‌యాత్ర దరఖాస్తు తుదిగడువును డిసెంబర్ 7 నుంచి 22కు పెంచినట్లు ఖాన్ పేర్కొన్నారు. మెహ్రమ్ లేకుండా 45 ఏళ్లు దాటిన మహిళల్ని నలుగురిని ఓ బృందంగా హజ్‌కు అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
సౌదీ అరేబియాతో రష్యా తొలి పోరు
మాస్కో: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య రష్యా జట్టుకు సులువైన ‘డ్రా’నే పడింది. గ్రూప్ ‘ఎ’లో చోటు పొందిన రష్యా జూన్ 14న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టుతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో ఈజిప్టు, ఉరుగ్వే జట్లు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యాలోని 12 వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ విడుదల కార్యక్రమం శుక్రవారం మాస్కోలో అట్టహాసంగా జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో... దిగ్గజాలు పీలే (బ్రెజిల్), మారడోనా (అర్జెంటీనా) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా (4 జట్లు చొప్పున) విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంటాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గ్రూప్ ‘ఎఫ్’లో ఉండగా... క్రితంసారి రన్నరప్ అర్జెంటీనాకు గ్రూప్ ‘డి’లో చోటు దక్కింది. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ... మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్... ఒకసారి సెమీస్ చేరిన అమెరికా జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలంకాగా... పనామా, ఐస్లాండ్ జట్లు తొలిసారి అర్హత సాధించాయి. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే. గ్రూప్ ‘బి’: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్. గ్రూప్ ‘సి’: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్. గ్రూప్ ‘డి’: అర్జెంటీనా, ఐస్లాండ్, క్రొయేషియా, నైజీరియా. గ్రూప్ ‘ఇ’: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా. గ్రూప్ ‘ఎఫ్’: జర్మనీ, మెక్సికో, స్వీడన్, కొరియా. గ్రూప్ ‘జి’: బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్. గ్రూప్ ‘హెచ్’: పోలాండ్, సెనెగల్, కొలంబియా, జపాన్. -
ముంబై, ఢిల్లీ మ్యాచ్ డ్రా
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై సిటీ ఎఫ్‌సీ, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యారుు. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు చక్కగా పోరాడారు. తొలి 45 నిమిషాల్లోనే గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఆరు షాట్లు కొట్టారు. కానీ ఢిల్లీ మాత్రం ఒకే ఒక్క ప్రయత్నం చేయగలిగింది. ఈ రెండు జట్లు ఇది వరకే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించారుు. ముంబై 23 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలువగా... ఢిల్లీ 21 పారుుంట్లతో రెండో స్థానంలో ఉంది. కొచ్చిలో నేడు (ఆదివారం) కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీల మధ్య జరిగే చివరి మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుంది. -
భారత్ - బంగ్లా టెస్టు డ్రా
-
భారత్ - బంగ్లా టెస్టు డ్రా
ఫతుల్లా: భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరణుడి ప్రభావమే ఇండియాను విజయానికి దూరం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లా.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. దీంతో టెస్టు డ్రాగా ముగిసింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ధావన్ (173), విజయ్ (150), సెంచరీలతో ఆకట్టుకోగా.. రహానె (98) త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. చక్కటి ప్రతిభను కనబరిచారని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. తొలి ఇన్నింగ్స్‌లో రవించంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఉల్ హసన్ నాలుగు, జుబేర్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు.