Ind Vs Wi 2nd Test Day 5: India Wins Series 1-0 After Match Drawn Due To Final Day Washed Out - Sakshi
Sakshi News home page

Ind Vs WI 2nd Test Day 5 Highlights: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్‌ భారత్‌దే

Published Tue, Jul 25 2023 5:40 AM | Last Updated on Tue, Jul 25 2023 7:43 AM

Ind Vs WI 2nd Test Day 5: India wins series 1-0 after match drawn due to rain - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత్‌ గెలుపు ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు! కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో టీమిండియా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు కోల్పోయింది. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్‌ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు.

పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టెస్టు గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో 12 పాయింట్లు సాధించిన టీమిండియా ఖాతాలో ఈ ‘డ్రా’ కారణంగా 4 పాయింట్లే చేరాయి.

అంతకు ముందు నాలుగో రోజు 365 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (28), చందర్‌పాల్‌ (24 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రోజు ఆట సాగితే మిగిలిన ఎనిమిది వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోయేది. కానీ వానతో లెక్క మారిపోయింది. నాలుగో రోజు చివరి సెషన్‌లో భారత్‌ దూకుడైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది.

ఈ సెషన్‌లో ఆడిన 9 ఓవర్లలోనే టీమిండియా 63 పరుగులు చేసింది. రోచ్‌ ఓవర్లో ఇషాన్‌ ‘సింగిల్‌ హ్యాండ్‌’తో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లోనే కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బంతి తర్వాత భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ ఛేదనలో విండీస్‌కు సరైన ఆరంభం లభించలేదు.

బ్రాత్‌వైట్‌ పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచగా, చందర్‌పాల్‌ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఒకదశలో అతను 50 బంతుల్లో 3 పరుగులే చేశాడు.   అశి్వన్‌ ఈ జోడీని విడదీసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. స్వీప్‌ చేయబోయిన బ్రాత్‌వైట్‌ ఫైన్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. అశి్వన్‌ తన తర్వాతి ఓవర్లోనే మెకన్జీ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చందర్‌పాల్, బ్లాక్‌వుడ్‌ (20 నాటౌట్‌) వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 438;
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 255;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:
యశస్వి (సి) సిల్వ (బి) వారికాన్‌ 38; రోహిత్‌ (సి) జోసెఫ్‌ (బి) గాబ్రియెల్‌ 57; గిల్‌ (నాటౌట్‌) 29; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 52; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (24 ఓవర్లలో 2 వికెట్లకు) 181 డిక్లేర్డ్‌. వికెట్ల పతనం: 1–98, 2–202.

బౌలింగ్‌: రోచ్‌ 4–0–46–0, జోసెఫ్‌ 4–0–37–0, హోల్డర్‌ 4–0–26–0, గాబ్రియెల్‌ 6–0–33–1, వారికాన్‌ 6–0–36–1. 
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (సి) ఉనాద్కట్‌ (బి) అశి్వన్‌ 28; చందర్‌పాల్‌ (నాటౌట్‌) 24; మెకెన్జీ (ఎల్బీ) (బి) అశి్వన్‌ 0; బ్లాక్‌వుడ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32 ఓవర్లలో 2 వికెట్లకు) 76.
వికెట్ల పతనం: 1–38, 2–44.
బౌలింగ్‌: సిరాజ్‌ 8–2–24–0, ముకేశ్‌ 5–4–5–0, ఉనాద్కట్‌ 3–2–1–0, అశ్విన్‌ 11–2–33–2, జడేజా 5–1–10–0.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement