ఓటమి తప్పించుకున్న భారత మహిళలు | Indian women hockey team hold Malaysia to a 4-4 draw | Sakshi
Sakshi News home page

ఓటమి తప్పించుకున్న భారత మహిళలు

Published Tue, Apr 9 2019 6:04 AM | Last Updated on Tue, Apr 9 2019 6:04 AM

Indian women hockey team hold Malaysia to a 4-4 draw - Sakshi

కౌలాలంపూర్‌: ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భాగంగా మలేసియాతో జరగుతోన్న మూడో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తొలిసారి తడబాటుకు గురైంది. అనవసర తప్పిదాలతో ఓటమి ముంగిట నిలిచిన భారత్‌... ఆ తర్వాత గొప్పగా పుంజుకొని మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 4–4తో డ్రా అయింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ (22వ ని., 45వ ని.) రెండు గోల్స్‌తో భారత్‌ను ఆదుకోగా... నవ్‌జ్యోత్‌ కౌర్‌ (13వ ని.), లాల్‌రెమ్‌సియామి (54వ ని.) చెరో గోల్‌ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్‌ 2 గోల్స్‌ సాధించింది. గుర్‌దీప్‌ కిరణ్‌దీప్‌ (26వ ని.), నురామిరా జుల్‌కిఫ్లీ (35వ ని.) ఒక్కో గోల్‌ స్కోర్‌ చేశారు.

వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌... ఈ మ్యాచ్‌ ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లో నవ్‌జ్యోత్, రెండో క్వార్టర్‌లో నవ్‌నీత్‌ గోల్‌ చేయడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే మరో నాలుగు నిమిషాల్లోనే గుర్‌దీప్‌ చేసిన గోల్‌తో మలేసియా 1–2తో భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ సిరీస్‌లో మలేసియాకు ఇదే తొలి గోల్‌ కావడం విశేషం. తర్వాత మలేసియా జోరు పెంచగా... భారత రక్షణ పంక్తి అనవసర తప్పిదాలు చేస్తూ ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌లను సమర్పించుకుంది. మూడో క్వార్టర్‌లో లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లను నురానీ రషీద్, నుమామిరా గోల్స్‌గా మలచడంతో మలేసియా 4–2తో భారత్‌ను వెనక్కి నెట్టేసింది. అయితే చివరి క్వార్టర్‌లో నవ్‌నీత్, లాల్‌రెమ్‌సియామి అద్భుత గోల్స్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement