‘ఆసియా’ చాంపియన్‌ భారత్‌  | The Indian team won the Champions Trophy for the fourth time | Sakshi
Sakshi News home page

Asian Champions Trophy 2023: ‘ఆసియా’ చాంపియన్‌ భారత్‌ 

Aug 13 2023 2:44 AM | Updated on Aug 13 2023 7:53 AM

The Indian team won the Champions Trophy for the fourth time - Sakshi

చెన్నై: ఫైనల్‌ వరకు ఎదురు లేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా! అంచనాలకు తగినట్లుగా తొలి గోల్‌తో ఆధిపత్యం కూడా దక్కింది. కానీ ఆపై మూడుసార్లు ఆసియా చాంపియన్‌కు అసలు పోటీ అర్థమైంది. ఆట అర్ధ భాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికి భారత్‌ 1–3తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇక మిగిలింది అర గంట. గెలవాలంటే మిగిలిన 30 నిమిషాల్లో 3 గోల్స్‌ కావాలి. సర్వశక్తులు ఒడ్డాల్సిన స్థితి. ప్రత్యర్థి జోరు మీదుంది. భారత్‌ ఆటగాళ్లపైనే ఒత్తిడి. ఈ దశలో మూడో క్వార్టర్‌ ముగిసే నిమిషం భారత్‌కు వరంగా మారింది. మ్యాచ్‌ను మన పరం చేసింది.

45వ నిమిషంలో భారత ఆటగాళ్లు చేసి రెండు గోల్స్‌తో స్కోరు 3–3తో సమమైంది. మిగిలింది ఆఖరి క్వార్టర్‌ ఒక గోల్‌ చేస్తే భారత్‌ టైటిల్‌ దక్కుతుంది. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (56వ ని.లో) అదే మ్యాజిక్‌ చేశాడు. ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించి  గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లాడు. అనుకున్న ఫలితాన్ని అజేయమైన భారత్‌ సాధించింది.  9వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్‌ గోల్‌గా మలిచాడు.

కానీ మలేసియా శిబిరం నుంచి నిమిషాల వ్యవధిలో అబు కమల్‌ (14వ ని.లో), రహీమ్‌ రజీ (18వ ని.లో), అమినుద్దీన్‌ (28వ ని.లో)  చెరో గోల్‌ చేశారు. జట్టు ఆత్మరక్షణలో పడిన ఈ దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (45వ ని.), గుర్జాంత్‌ (45వ ని.) గోల్‌ చేసి అడుగంటిన ఆశలకు జీవం పోశారు. మిగిలిన ఆఖరి గోల్‌ను ఆకాశ్‌దీప్‌ (56వ ని.) సాధించడంతో భారత్‌ జయకేతనం ఎగరేసింది.  

జపాన్‌కు కాంస్యం 
సెమీస్‌లో ఓడిన డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా కనీసం కాంస్య పతకమైనా గెలుద్దామనుకుంటే జపాన్‌ ముందు వారి ఆటలు సాగలేదు. ఫైనల్‌కు ముందు  మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్‌ 5–3తో కొరియాను కంగుతినిపించింది.

ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన జపాన్‌ ఆటగాళ్లే కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో కొరియా నాలు గో స్థానంతో తృప్తిపడింది. జపాన్‌ తరఫున ర్యోమా ఓకా (3వ ని.లో), రియోసే కటో (9వ ని.లో)కెంటరో ఫుకుదా (28వ ని.లో) షోట యమాద (53వ ని.లో), కెన్‌ నగయొషి (58వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు. కొరియా జట్టులో జంగ్‌హ్యున్‌ జంగ్‌ (15వ, 33వ ని.లో) రెండు గోల్స్‌ సాధించిపెట్టగా, చెవొలియోన్‌ పార్క్‌ (26వ ని.) ఒక గోల్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement