Asian Champion
-
భారత్ సత్తాకు సవాల్
భువనేశ్వర్: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో భారత్ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఖతర్ 61వ స్థానంలో, భారత్ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్‌తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో 8–1తో అఫ్గానిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్‌గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. 1996లో ఖతర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
‘ఆసియా’ చాంపియన్ భారత్
చెన్నై: ఫైనల్ వరకు ఎదురు లేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా! అంచనాలకు తగినట్లుగా తొలి గోల్‌తో ఆధిపత్యం కూడా దక్కింది. కానీ ఆపై మూడుసార్లు ఆసియా చాంపియన్‌కు అసలు పోటీ అర్థమైంది. ఆట అర్ధ భాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికి భారత్ 1–3తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇక మిగిలింది అర గంట. గెలవాలంటే మిగిలిన 30 నిమిషాల్లో 3 గోల్స్ కావాలి. సర్వశక్తులు ఒడ్డాల్సిన స్థితి. ప్రత్యర్థి జోరు మీదుంది. భారత్ ఆటగాళ్లపైనే ఒత్తిడి. ఈ దశలో మూడో క్వార్టర్ ముగిసే నిమిషం భారత్‌కు వరంగా మారింది. మ్యాచ్‌ను మన పరం చేసింది. 45వ నిమిషంలో భారత ఆటగాళ్లు చేసి రెండు గోల్స్‌తో స్కోరు 3–3తో సమమైంది. మిగిలింది ఆఖరి క్వార్టర్ ఒక గోల్ చేస్తే భారత్ టైటిల్ దక్కుతుంది. ఆకాశ్‌దీప్ సింగ్ (56వ ని.లో) అదే మ్యాజిక్ చేశాడు. ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లాడు. అనుకున్న ఫలితాన్ని అజేయమైన భారత్ సాధించింది. 9వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్రాజ్ గోల్‌గా మలిచాడు. కానీ మలేసియా శిబిరం నుంచి నిమిషాల వ్యవధిలో అబు కమల్ (14వ ని.లో), రహీమ్ రజీ (18వ ని.లో), అమినుద్దీన్ (28వ ని.లో) చెరో గోల్ చేశారు. జట్టు ఆత్మరక్షణలో పడిన ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (45వ ని.), గుర్జాంత్ (45వ ని.) గోల్ చేసి అడుగంటిన ఆశలకు జీవం పోశారు. మిగిలిన ఆఖరి గోల్‌ను ఆకాశ్‌దీప్ (56వ ని.) సాధించడంతో భారత్ జయకేతనం ఎగరేసింది. జపాన్‌కు కాంస్యం సెమీస్‌లో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా కనీసం కాంస్య పతకమైనా గెలుద్దామనుకుంటే జపాన్ ముందు వారి ఆటలు సాగలేదు. ఫైనల్‌కు ముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్ 5–3తో కొరియాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన జపాన్ ఆటగాళ్లే కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో కొరియా నాలు గో స్థానంతో తృప్తిపడింది. జపాన్ తరఫున ర్యోమా ఓకా (3వ ని.లో), రియోసే కటో (9వ ని.లో)కెంటరో ఫుకుదా (28వ ని.లో) షోట యమాద (53వ ని.లో), కెన్ నగయొషి (58వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా జట్టులో జంగ్హ్యున్ జంగ్ (15వ, 33వ ని.లో) రెండు గోల్స్ సాధించిపెట్టగా, చెవొలియోన్ పార్క్ (26వ ని.) ఒక గోల్ చేశాడు. -
నంబర్‌వన్ ర్యాంక్‌కు అడుగు దూరంలో...
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఘనత సాధించిన నవ్‌జ్యోత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం. -
ప్రొఫెషనల్ బాక్సర్‌గా సరిత
ఢిల్లీ: భారత మహిళల బాక్సింగ్‌లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా బాక్సర్ సరితా దేవి ప్రొఫెషనల్‌గా మారనుంది. తద్వారా ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు లైసెన్స్ కలిగిన భారత బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ)తో రెండేళ్ల కాలానికి ఆమె ఒప్పందం చేసుకుంది. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అనుమతిస్తే అమెచ్యూర్ సర్క్యూట్‌లోనూ కొనసాగుతానని 31 ఏళ్ల సరితా దేవి తెలిపింది. ‘దశాబ్దంకంటే ఎక్కువ కాలం నుంచి నేను అమెచ్యూర్ బాక్సర్‌గా ఉన్నాను. ఒలింపిక్స్ మినహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాను. ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకే ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని 60 కేజీల విభాగంలో పోటీపడే సరిత వివరించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి 19న సరితా దేవి తొలి ప్రొఫెషనల్ బౌట్ జరిగే అవకాశముంది