
యుక్తవయసులో మానసిక ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. క్షణాకావేశంలో తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలే అందుకు కారణం. నిన్నగాక మొన్న.. అతుల్ సుభాష్ అనే వ్యక్తి మరణ ఉదంతం ఇందుకొక ఉదాహరణగా నిలిచింది. తాజాగా.. గుజరాత్‌లో ఓ యువతి తన ప్రియుడిని సుఖంగా ఉండాలని కోరుకుంటూ బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.
27 రాధా ఠాకూర్‌కు గతంలోనే వివాహం, విడాకులు అయ్యాయి. ఆ తర్వాత తన సోదరితో బనస్కాంత జిల్లా పలాన్‌పూర్‌లో ఉంటూ ఓ బ్యూటీపార్లర్ నడిపిస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు..
సోమవారం ఉదయం కల్లా రాధ తన గదిలో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో.. రాధ ఫోన్‌లో కొన్ని రికార్డింగులు దొరికాయి. అందులో ఆమె ఎవరికో క్షమాపణలు చెప్పినట్లు ఉంది.
‘‘ఏడు గంటలలోపు ఫొటో పంపకపోతే ఏం జరుగుతుందో చూస్తావు!’’ అంటూ ఓ ఆడియో క్లిప్‌ను సదరు వ్యక్తి వాట్సాప్ సందేశానికి తొలుత పంపినట్లు ఉంది. అయితే కాసేపటికే ఆమె సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుంది.
‘‘ ఓయ్.. నన్ను క్షమించమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నిన్ను అడగకుండానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నా. నేను ఆత్మహత్య చేసుకున్నా అని అనుకోకు. పని, జీవితంలో విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఈ పనితో నువ్వు బాధపడకు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది అని వీడియోలో పేర్కొందామె. మృతిరాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment