మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్‌ లేఖ | Arvind Kejriwal Wrote Letter To Chandrababu And Nitish Kumar As NDA Allies To React On Ambedkar Insult Row | Sakshi
Sakshi News home page

Ambedkar Insult Row: మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్‌ లేఖ

Published Thu, Dec 19 2024 11:43 AM | Last Updated on Thu, Dec 19 2024 12:07 PM

Ambedkar Insult Row: Kejriwal drags Chandrababu Nitish Kumar As NDA Allies

ఢిల్లీ, సాక్షి: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.

‘‘బాబా సాహెబ్‌ను అమిత్‌ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్‌ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్‌ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే.. అంబేద్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్‌ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్‌ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్‌ లేఖలో కోరారు.

 

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌.

ఏమన్నారంటే.. 
భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్‌ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్‌ కేజ్రీవాల్‌, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్‌ విజయ్‌ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.

దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్‌, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా.  కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. 

అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని  ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్​సీ, ఎస్​టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement