
గుంటూరు, సాక్షి: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.
గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తూ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సాహితీ విమర్శ కేటగిరీలో తన రచనకు జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకోవడం స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.
1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తన సందేశంలో జగన్ పేర్కొన్నారు.
పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన ప్రస్తుతం గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది.. అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు.

Comments
Please login to add a commentAdd a comment