penugonda
-
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
Miss India USA 2022: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ): అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్‌గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను శుక్రవారం పెనుగొండ మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు. (క్లిక్: ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ) చదవండి: (Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త) -
ప్రగతి పధంలో పెనుకొండ..
-
చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు చూశారు
-
ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది. ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. ఇలసలను పులసలుగా.. పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆడిటర్ -
యమ డిమాండ్.. ఓ సారి టేస్ట్ చూడండి
పెనుగొండ పేరు చెబితే వెంటనే గుర్తొకొచ్చేది వాసవీమాత ఆలయం. దాంతోపాటే ఈ ఊరుకు మరో ‘తీపి గుర్తు’ ఉంది. అదే నోరూరించే కమ్మని కజ్జికాయ. ఇక్కడ తయారయ్యే ఈ స్వీటుకు ఖండాంతరఖ్యాతి దక్కింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కజ్జికాయను మళ్లీమళ్లీ తినాలని తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. పెనుగొండ: బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూత రేకులు.. వీటి కోవలోకే వెళ్తుంది పెనుగొండ కజ్జికాయ కూడా. కొబ్బరి కోరుతో తయారయ్యే ఈ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. తొలుత ఓ సామాన్య వ్యాపారి తయారు చేసిన ఈ తీపి పదార్థం ఇప్పుడు గొప్పింటి వివాహ వేడుకల్లో సందడి చేస్తోంది. రాజకీయ పారీ్టల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు సంపాదించి ఔరా అనిపిస్తోంది. విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. ఈ ప్రాంత వాసులు బంధువులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. అంతలా జనజీవితంలో భాగమైపోయింది ఈ స్వీటు. దీనిని చూడగానే హహ్హహ్హ కజ్జికాయ.. నాకే ముందు అంటూ ఎగబడని భోజనప్రియులు ఉండరు. (చదవండి: కడలిపై.. హాయి హాయిగా..) ఇతర ప్రాంతాలకూ విస్తరణ ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ పెనుగొండ వారి కజ్జికాయ అంటూ స్వీటు దుకాణాలు విరివిగా వెలుస్తున్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తణుకు లాంటి ప్రాంతాల్లో సంప్రదాయ స్వీటు దుకాణాల్లో పెనుగొండ వారి కజ్జికాయ అంటూ ప్రతేక ఆకర్షణతో అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది నిత్యం పెనుగొండ నుంచే తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు. 45 ఏళ్లకు పైగా.. పెనుగొండ కజ్జికాయకు నలభై ఐదేళ్లకుపైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీటు పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేకంగా తయారు చేసి పేరు సంపాదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు తర్వాత ఆయన కుమారులు కజ్జికాయకు మరింత వన్నె తెచ్చారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే చేసే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రైఫ్రూట్స్‌ను మిళితం చేసి మరింత రుచిగా, సుచిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కజ్జికాయను కనీసం కేజీ తీసుకోవాలన్నా ముందుగా ఆర్డరు చేసుకోవలసిందే. అంతటి యమ డిమాండ్ మరి..! మీరూ ఓ సారి టేస్ట్ చూడండి.. -
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన హెచ్ఎం
సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్‌ఎన్‌వీఆర్ హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్‌వీఎన్‌ఆర్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్‌ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి
పెనుగొండ(ప.గో): పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చినబాబు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు ఇక లేరన్న వార్తతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. 1999లో పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. వైఎస్పార్సీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్‌గా చినబాబు పనిచేశారు. కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పెనుగొండ మరోసారి లాక్డౌన్
సాక్షి, పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా): కోవిడ్–19 విజృంభణ అధికం కావటంతో అధికారులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల్లో 20 మందికి పైగా కరోనా సోకడంతో ఉలిక్కిపడుతున్నారు. అదుపులోకి వచ్చిందనుకున్న పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 19న కంటైన్మెంట్ జోన్ ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒకేసారి అధిక సంఖ్యలో కోవిడ్–19 కేసులు నమోదు కావడంతో పెనుగొండను మరోసారి లాక్డౌన్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆచంట మండలంలోనూ కేసులు పెరగడంతో అధికారులు కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు. పెనుగొండలో గురువారం రాత్రి 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హుటాహుటిన తాడేపల్లిగూడెం కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఆచంట మండలంలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వల్లూరులో నలుగురికి కరోనా సోకింది. అయోధ్యలంకలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. (విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో..) పెనుగొండలో కట్టుదిట్టం పెనుగొండలో మరోసారి కరోనా విలయతాండవం చేయడంతో లాక్‌డౌన్‌కు అధికారులు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకూ ఉదయం 11 గంటల వరకూ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒకేసారి 12 కేసులు నమోదు కావడంతో దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లుపైకి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెనుగొండలో ఆదివారం కర్ఫ్యూ స్థాయిలో కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతి బుధవారం కర్ఫ్యూ విధించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఉదయం 10 గంటల వరకూ ఇళ్లకే పంపిస్తామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సీఐ పి.సునిల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, తహసీల్దారు వై.రవికుమార్, ఎంపీడీఓ కె.పురుషోత్తమరావు పెనుగొండ ప్రధాన విధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..) -
పెనుగొండలో మళ్లీ లాక్డౌన్
సాక్షి, పెనుగొండ: కరోనా విలయతాండవం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికారులు మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి లాక్డౌన్ ప్రారంభించారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన రెడ్ జోన్ జూన్ మొదటి వారం వరకూ కొనసాగింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పెనుగొండలో నిషేధాజ్ఞలు తొలగించారు. అయితే చెరుకువాడలో కోయంబేడు కాంటాక్టుతో ప్రారంభమైన కరోనా వ్యాప్తి ఏకంగా 25 కేసులు దాటేసాయి. ఆదివారం నాటికి కొందరు ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి కాగా, చెరుకువాడలో ప్రస్తుతానికి 19 యాక్టివ్ కేసులున్నాయి. దీనికి తోడు ఆచంట నియోజవర్గంలోని పోడూరు, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని పోడూరు మండలంలోని జిన్నూరులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పెనుగొండ–నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధించి ఆచంట, వీరవాసరం మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. (ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు) నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధిస్తూ మార్టేరులో ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇదిలా ఉండగా చెరుకువాడలోనూ కరోనా కట్టడికి కఠిన నిషేధాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు, సంబంధిత అధికారులు పెనుగొండ, చెరుకువాడను పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 10 రోజులుగా చెరుకువాడకే పరిమితం చేసిన కంటైన్మెంట్ పరిధిని కిలోమీటరుకు పెంచడంతో పెనుగొండ, చెరుకువాడ పూర్తిగా నిషేధాజ్ఞల ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో ఉదయం కేవలం రెండు గంటల పాటు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అధికారులు అవకాశం కల్పించారు. రెండు గంటల సమయంలోనూ ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే మరింత కఠినంగా అమలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిషేధాజ్ఞలతో పాటు రెండు ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలను అధికారులు పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారు. అధికారులకు తెలియకుండా కొందరు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం ఉండడంతో ఇబ్బందులెదురయ్యే అవకాశాల కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరుకువాడలోని ప్రజలు 80 రోజులకుపైగాను, పెనుగొండలో ప్రజలు సుమారు 65 రోజులపాటు కంటైన్మెంట్లో మగ్గిపోయారు. మళ్లీ కంటైన్మెంట్ ప్రారంభం కావడంతో మరికొంత కాలం మగ్గిపోవలసి వస్తుంది. దీంతో ప్రజలు ఎవరికి వారు అప్రమత్తం అవుతున్నారు. మట్టపర్రు రోడ్డు వద్ద పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేను మూసివేసిన దృశ్యం జిన్నూరులో మరో 8 కరోనా కేసులు 38కి చేరిన మొత్తం కేసుల సంఖ్య పోడూరు: కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న జిన్నూరు గ్రామంలో ఆదివారం మరో 8 కేసులు నమోదైనట్లు కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ సీహెచ్ దేవదాసు తెలిపారు. దీంతో గ్రామంలో కేసుల సంఖ్య 38 పెరిగింది. కొత్తగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి, మరో వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. జిన్నూరులో కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్నూరులో కరోనా ప్రభావంతో ఇప్పటికే పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేపై రాకపోకలు నిషేధించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జిన్నూరు నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా అన్నిదారులూ మూసివేశారు. ఎంపీడీఓ కె.కన్నమనాయుడు, తహసీల్దార్ పి.ప్రతాప్‌రెడ్డి, గ్రామస్థాయి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. (రూ.350కే కరోనా పరీక్షలు!) -
కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు
సాక్షి, పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కఠిన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. పెనుగొండలో మసీదు వీధి, ఉర్రేంకుల వారి వీధి, కొండపల్లివారి వీధిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో వీటి పరిధిలో 820 మీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా ప్రకటించారు. ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పెనుగొండ పంచాయతీలో కాల్‌సెంటర్ 08819–246081 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే అత్యవసరమైన నిత్యావసరాలు, మందులు వారి చెంతకే అందేవిధంగా ఏర్పాటు చేశారు. వీటికి నగదు చెల్లించాలి. డ్రోన్లతో పర్యవేక్షణ పోలీసులు రక్షణ దుస్తులు ధరించి నిత్యం పర్యవేక్షణ చేస్తూ డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా డ్రోన్లకు చిక్కితే కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలు సహకరించాలి: మంత్రి పెనుగొండ: పెనుగొండ కరోనాకు నెలవుగా మారడంతో వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజ్ఞప్తిచేశారు. కరోనా నిరోధానికి పెనుగొండలో తీసుకొంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ 250 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. పెనుగొండలోని మూడు ప్రమాదకర ప్రాంతాలను కలిపి రెడ్‌జోన్‌గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రానివ్వొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే మూడో విడత ఆరోగ్య సర్వే ప్రారంభమైందన్నారు. ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సత్వరం ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. చదవండి: కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్ -
కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్
సాక్షి, పెనుగొండ: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పెనుగొండను వచ్చేనెల 4వ తేదీ వరకు సీల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఆర్డీఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. కరోనా రెండో దశకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే విపరీత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా పెనుగొండ పరిసర ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించారు. కరోనా సోకిన ప్రాంతం నుంచి 820 మీటర్ల రేడియస్‌ను డేంజర్ జోన్‌గా, మూడు కిలోమీటర్ల రేడియస్‌ను రెడ్ జోన్‌గా, 5 కిలోమీటర్ల రేడియస్‌ను ఆరంజ్ బఫర్ జోన్లుగా విభజించారు. డేంజర్ జోన్లో ఎటువంటి కదలికలు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఇళ్లకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ జోన్, ఆరంజ్ బఫర్ జోన్లలో నిత్యం ఆరోగ్య సర్వే చేయించాలని ఆదేశించారు. డేంజర్ జోన్లో ఉన్న సుమారు 200 మంది శ్యాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. ఆయా రిపోర్టులు వచ్చినా వచ్చేనెల 4 వరకు ఆ ప్రాంతంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో పెనుగొండ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. -
పెళ్లికి నిరాకరించిందని దాడి!
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్(28), రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ
సాక్షి, పెనుగొండ : ప్రసిద్ధిగాంచిన పెనుగొండ వాసవీ శాంతి ధాంలో వాసవీమాత అభిషేక విగ్రహం అపహరణకు గురైంది. శనివారం ఉద యం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన అర్చకులు మరకిత వాసవీ మాత విగ్రహం పాదాల వద్ద ఉండే పంచలోహ విగ్రహం కనిపించకపోవడంతో శాంతి ధాం నిర్వాహకులకు సమాచారం అందించాం. సుమారు 1.5 అడుగుల పంచలోహ విగ్రహంతో పాటు 6 అం గుళాల ఇత్తడి వినాయకుని విగ్రహం, మరకిత శిల విగ్రహంలో అలంకరించిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు మాయమైనట్టు నిర్వాహకులు గుర్తిం చారు. ఈమేరకు పెనుగొండ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పెనుగొండ ఎస్సై పి.నాగరాజు ఆధ్వర్యంలో క్లూస్ టీం, జాగిలంతో పో లీసులు రంగ ప్రవేశం చేసి ఆధారాలు సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే విగ్రహం చోరీకి గురైందని పోలీసులు భావిస్తున్నారు. వాసవీ శాంతి ధాంకు నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని గుర్తించారు. బంగారు విగ్రహం అంటూ వదంతులు ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం, బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయంటూ వదంతులు రావడంతో పెనుగొండ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, వాసవీ మాత ఆలయంలో అమ్మవారికి పవిత్ర దినాల్లో మాత్రమే బంగారు ఆభరణాలను అలంకరిస్తుంటారు. అంతేగాకుండా, ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం ఇప్పటివరకూ తయారు చేయలేదని సమాచారం. 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహానికి బంగారు పూత మాత్రమే పూయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ధామంలో బంగారు విగ్రహాలు లేవని నిర్వహకులు తెలిపారు. ఆభరణాలు సురక్షితంగా లాకర్లలో ఉంచుతారని స మాచారం. దీంతో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొన్నారు. నా నాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వాసవీ శాంతి ధాంలో విలువైన వస్తువులు ఉండటం వలన భద్రతపై దృష్టి సారిం చాలంటూ పలువురు సూచిస్తున్నారు. -
కూతురు.. అల్లుడు.. ఓ సవిత!
సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు పిండి చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమందేపల్లి మండలం గూడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 64లో నాలుగు హెక్టార్ల స్థలంలో క్వారీకి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కుమార్తె బీకే రోజా పేరిట 2015 జూలై 4న లీజుకు తీసుకున్నారు. అయితే ఇక్కడ క్వారీకి పర్యావరణ అనుమతుల్లేవు. అయినప్పటికీ నాలుగేళ్లుగా అక్రమ తవ్వకం కొనసాగుతోంది. బీకే పార్థసారధి అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్వారీకి సంబంధించి 20వేల క్యూబిక్ మీటర్లకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 2లక్షల క్యూబిక్ మీటర్లకు పైనే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రొద్దం మండలం కొగిరి గ్రామంలోని 454, 456–2 సర్వే నెంబర్లలో బీకే సాయి కన్స్ట్రక్షన్స్ పేరిట ఐదు హెక్టార్ల రోడ్డు మెటల్ క్వారీ నిర్వహణకు బీకే పార్థసారధి అల్లుడు పి.శశిభూషణ్ అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీకి నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే దీనికి తోడు అదే గ్రామ సర్వే నంబర్ 456లో 2017లో వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే తాత్కాలిక పర్మిట్ పొంది తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ సైతం తాత్కాలిక పర్మిట్ పొందేందుకు భూగర్భ గనుల శాఖ అధికారులపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముసుగులో కొన్ని వేల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తవ్వేశారు. కియా పరిశ్రమ పక్కన తాత్కాలిక పర్మిట్లతో ఎస్.సవిత పేరిట నిర్వహిస్తున్న క్వారీ పెనుకొండ మండలం మునిమడుగు సర్వేనంబర్ 152లో నిర్వహిస్తున్న ఈ రోడ్డు మెటల్ క్వారీ కియా పరిశ్రమ పక్కనే ఉంది. నిబంధనల మేరకు పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి.అయితే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి అండదండలతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూడు తాత్కాలిక పర్మిట్లు పొందారు. పర్మిట్లను మించి ఇప్పటికే 80వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రతీ క్వారీకి తాత్కాలిక పర్మిట్లను పొందారు. పార్థసారధి కూతురు రోజా పేరిట నిర్వహిస్తున్న క్వారీకి అసలు అనుమతులే లేకపోవడం గమనార్హం. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవితమ్మ పేరిట ఓ క్వారీ లీజుకు తీసుకోగా.. కియా పరిశ్రమ సమీపంలో మూడు తాత్కాలిక పర్మిట్లతో పెద్ద ఎత్తున కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనల మేరకు లీజు ఒక చోట తీసుకోవడం, తవ్వకాలు మరో చోట చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వం మారినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ దందా కొనసాగుతోంది. గనుల శాఖ నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక పర్మిట్లను ఇవ్వరాదు. క్వారీలకు లీజు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో బీకే పార్థసారధి నాకేంటి అడ్డు అన్నట్లుగా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తాత్కాలిక పర్మిట్ల ముసుగులో దోపిడీ అత్యవసర ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లను జారీ చేస్తారు. ఈ ముసుగులో బీకే కుటుంబ సభ్యులు దోరికినంతా దోచేశారు. ఎస్.సవితమ్మ 80వేల క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు తీసుకొని దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే రోడ్డు మెటల్‌ను తవ్వేశారు. 2015నుంచి నేటి వరకు ప్రతి క్వారీలోను అక్రమంగా తవ్వాలు చేపట్టినా గనులశాఖ అధికారులు చుట్టపు చూపుగా కూడా పరిశీలించలేదంటే ఏస్థాయిలో బీకే పార్థసారధి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. వీరి కనుసన్నల్లో నడుస్తున్న ఏ ఒక్క క్వారీని కనీసం తనిఖీ చేసే సాహసం కూడా అధికారులు చేయలేకపోయారు. వారు చెల్లించిందే రాయల్టీ అనే రీతిన క్వారీలను నిర్వహిస్తున్నారు. బీకే పార్థసారధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
శంకరనారాయణ అనే నేను..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు చోటు దక్కింది. రాజధాని అమరావతిలో నేడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లాకు దక్కిన ఒకే మంత్రి పదవిని బీసీలకు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. దీంతో పాటు శంకర్‌నారాయణను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని 2014లో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చినట్లయింది. శంకర్‌నారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా దాదాపు ఏడేళ్లు పనిచేశారు. ఆ తర్వాత హిందూపురంపార్లమెంట్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగారు. 17,415 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్థసారథికి 79, 793 ఓట్లు పోలైతే, శంకర్‌నారాయణకు 62,378 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పెనుకొండ బరిలో నిలిచి 16,494 ఓట్లు సాధించారు. అప్పట్లో రఘువీరా బరిలో లేకపోతే శంకర్‌నారాయణ గెలిచే వారనే చర్చ నడిచింది. ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,058 ఓట్లతో శంకరనారాయణ విజయం సాధించారు. సౌమ్యుడిగా, చిన్నా పెద్ద తేడా లేకుండా కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ‘అనంత’లో బీసీలకు పెద్దపీట: అనంతపురం జిల్లాలో బీసీలకు జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నేత పైలా నర్సింహయ్యను మొదట కొనసాగించారు. తర్వాత శంకరనారాయణకు సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, అనంతపురం రెండు ఎంపీ స్థానాల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలుగా గెలిపించారు. దీంతో పాటు పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్లను శంకర్‌నారాయణ, ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్రారెడ్డిలకు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీ కోటాలో శంకర్‌నారాయణకు చోటు కల్పించారు. జిల్లాలో బోయ, కురుబతో పాటు బీసీలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. దీంతో జిల్లాలో బీసీలకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసినట్లయింది. మంత్రివర్గంలో కూడా అత్యధికంగా బీసీలకు చోటు కల్పించారు. వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయాల పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23ఏళ్ల తర్వాత పెనుకొండకు మంత్రి పదవి పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గానికి 23 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి లభించింది. 1996లో అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1987–89 మధ్యకాలంలో ఎస్.రామచంద్రారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారథిపై వైఎస్సార్సీపీ తరపున గెలుపొందిన మాలగుండ్ల శంకర్‌నారాయణను మంత్రి పదవి వరించింది. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తా నాకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, అండగా నిలిచిన తోటి ఎమ్మెల్యేలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా. తోటి ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తా.– శంకర్‌నారాయణ, మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ప్రొఫైల్ పేరు: మాలగుండ్ల శంకర నారాయణ విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ తండ్రి: మాలగుండ్ల వకీలు పెద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్, ధర్మవరం తల్లి: యశోదమ్మ సతీమణి: జయలక్ష్మి సోదరులు : మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున పిల్లలు: మాలగుండ్ల పృద్వీరాజ్, నవ్యకీర్తి రాజకీయ నేపథ్యం 1995లో టీడీపీ జిల్లా కార్యదర్శి 2005లో ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ 2011లో వైఎస్సార్సీపీలో చేరిక 2012లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి 2019లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,041 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం. -
90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతిధాం 102 రుషీగోత్ర స్తంభ మందిరంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా జరిగింది. జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి విగ్రహావిష్కరణ చేసి తొలి అభిషేకం చేశారు. వాసవీ శాంతి ధాంలో 700 రోజుల పాటు శ్రమించి 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 40 కేజీల బంగారం కలిపి 65 టన్నుల విగ్రహాన్ని తయారు చేశారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి హోమ క్రతువులు, నిత్య కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 102 ఆర్యవైశ్యుల గోత్రీకులకు చిహ్నంగా 102 స్తంభాల రుషీగోత్ర మందిరాన్ని ప్రారంభించారు. అరుదైన మరకత శిలతో చెక్కించిన 3 అడుగుల మరకత శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలి వచ్చారు. -
90 అడుగుల కన్యకా పరమేశ్వరి
హైదరాబాద్: పంచలోహాలతో 90 అడుగుల ఎత్తుతో రూపొందించిన కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ఫిబ్రవరి 14న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, వెండి రథం కమిటీ చైర్మన్ రామ్పండుతో కలసి తమిళనాడు మాజీ గవర్నర్, శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ప్యాట్రన్ కె.రోశయ్య కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ..ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాసవీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనతో పెను గొండ వీధులు భక్తి పారవశ్యంతో విరాజిల్లనున్నాయన్నారు. పెనుగొండ క్షేత్రంలో గొప్ప కార్యక్రమం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి, ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లు కాగా, విగ్రహ ఏర్పాటుకు రూ.17 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. -
సమస్యలపై లోకేష్‌ను నిలదీసిన గ్రామస్తులు
-
కోడిగుడ్డు సొన, బెల్లం మిశ్రమంలో
పెనుకొండ : రాజరికపు పుటల్లో చెక్కుచెదరని కట్టడాల్లో పెనుకొండ పట్టణంలోని గగన్‌మహల్ ఓ మధుర జ్ఙాపకంగా నిలిచింది. 14, 15, 16, 17 శతాబ్ధాల్లో ఓ వెలుగు వెలిగిన గగన్మమల్ నేడు మనకు నాటి తీపి గుర్తులను పంచుతోంది. ఇండో పార్సీయన్ ఆకారంలో గార, కోడిగుడ్డు సొన, బెల్లం, ఇసుక గవ్వలు, చలువరాయి మిశ్రమంలో దీన్ని నిర్మించారు. పోర్చుగీసు కాలంలో నిర్మించిన ఈ గగన్‌మహల్‌ను అనంతరం 14వ శతాబ్ధంలో మల్లికార్జున రాయలు, వీరవిజయరాయలు, ప్రతాపరుద్ర రాయలు ఎంతో అభివృద్ధి చేశారు. దీన్ని వేసవి విడిదిగా అప్పటి రాజులు వినియోగించే వారు. శత్రుదుర్భేధ్యమైన కట్టడంగా, రాజుల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైభాగంలో పెద్దఎత్తున పహారా కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు. సైనికులు దీనిద్వారా సుదూరం నుంచి వచ్చే శత్రువులను కనిపెట్టే సౌకర్యం ఇందులో ఉండటం విశేషం. 300 సంవ త్సరాలకు పైగా అప్పటి రాజులు దీన్ని వాడుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 26 మంది చక్రవర్తులు గగన్‌మహల్‌ను కేంద్రబిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన సాగించారట. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సైతం ఉన్నారు. పెనుకొండకు ప్రత్యేక స్థానమిచ్చిన రాయలు 1509 నుంచి 1523 వరకు పాలన సాగించిన కృష్ణదేవరాయలు హంపీ తరువాత అంతటి ప్రాధాన్యతను పెనుకొండకు ఇచ్చారు. ప్రతినెలా మూడు నెలల పాటు ఇక్కడి నుంచే ఆయన పాలన సాగించే వారని, కొండపై సైతం అనునిత్యం లక్ష్మీనరసింహస్వామిని పవిత్రంగా పూజించడమే కాదు కొండపై ఆలయాన్ని కూడా నిర్మించారు. గగన్‌మహల్ నుంచి కొండపైకి రహస్య మార్గాలు ఉండేవి. నేటికీ ఆ రహస్య మార్గాలు ఉన్నా ప్రమాదమని ప్రభుత్వం వాటిని మూసివేయించింది. చల్లదనం దీని ప్రత్యేకం గగన్‌మహల్ యొక్క ప్రత్యేకం చల్లదనాన్ని కలిగించడమే. విభిన్న మిశ్రమాలతో నిర్మించడంతో ఏ కాలంలో అయినా చల్లదనాన్ని కలిగిస్తుంది. నాటి రాజరికపు గుర్తులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఎలా వెళ్లాలంటే... ఈ కట్టడాన్ని సందర్శించాలంటే అనంతపురం వైపు నుంచి పెనుకొండకు చేరుకుంటే ఆటోలో సులువుగా వెళ్ళవచ్చు. జిల్లా కేంద్రం నుంచి 75 కిలో మీటర్ల దూరం ఉంది. దీన్ని సందర్శకుల కోసం నిత్యం తెరిచే ఉంచుతారు. అలాగే బెంగళూరు, హిందూపురం వైపు నుంచి పెనుకొండకు అనేక బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వస్తే మరెన్నో కట్టడాలు, నాటి రాజరికపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. -
చిరంజీవి రెడ్డి దంపతులపై కాల్పులు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెనుగొండలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక వ్యాపారి మేడపాటి చిరంజీవి రెడ్డి, ధనలక్ష్మీ దంపతులపై దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.ఆమె తలలోకి 28 సైకిల్ ఇనుపగుళ్లు, మేకులు దూసుకెళ్లాయి. వాటిని గుర్తించిన తణుకు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మార్టేరులో వివాహానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు... దంపతులపై కాల్పులు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మలుపులు తిరుగుతున్న కాల్పుల వ్యవహారం.. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం చేస్తున్న చిరంజీవి రెడ్డి నివాసంపై కస్టమ్స్ అధికారులు దాడులకు దిగారు. ఇంట్లో వ్యక్తులను బయటకు రానివ్వకుండా తలుపులు మూసేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
క్రేజీ స్వీట్.. కజ్జికాయ
వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలన్న నానుడిలో పెనుగొండ కజ్జికాయను చేర్చుకుంటారంటే అతిశయోక్తి కాదు. నోట్లో పెట్టుకోగానే అద్భుతమైన రుచి, కమ్మదనంతో దేశంలోని నలుమూలలకే కాకుండా ఇతర దేశాలకూ రెక్కలు కట్టుకుని వెళుతోంది పెనుగొండ కజ్జికాయ. నోరూరించే ఈ కజ్జికాయకు 40 ఏళ్ల చరిత్ర ఉంది. పెనుగొండ : బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకుల కోవలోకు చెందినదే పెనుగొండ కజ్జికాయ. పెనుగొండ పేరు చెప్పేసరికి గుర్తుకువచ్చేది కజ్జికాయే. నోరూరించే కజ్జికాయ చూసేసరికి ఒకరకమైన కాయలా కనిపించినా కొరకగానే తియ్యటి కొబ్బరి కోరుతో ఉండే పాకం నోటిలోకి వెళ్లి ’అదుర్స్’ అనిపిస్తుంది. పెనుగొండ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ప్రాణం పోసుకున్న ఈ మధురమైన వంటకం పలు రాజకీయ పార్టీల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు చేసుకొని ఔరా అనిపించుకొన్న సంఘటనలు కోకొల్లలు. స్వీటు ప్రియులకు కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ తయారైన కజ్జికాయలకు రెక్కలు వచ్చి దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకే కాకుండా, అమెరికా లాంటి దేశాలకూ వెళ్తుంది. మంత్రులకు, కేంద్ర మంత్రులకు, ఉన్నతస్థాయి అధికారులకే కాదు.. సామాన్య ప్రజలకు సైతం బంధువులు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. పలకరింపులకు, బంధుత్వాలకు, సిఫార్సులకు కజ్జికాయను బహుమతిగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. 40 ఏళ్ల నుంచి తయారీ పెనుగొండ కజ్జికాయకు నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీట్ పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు మరణించినా కుమారులు కజ్జికాయను మరింత తీర్చిదిద్దుతూ మరింత వన్నెలద్దారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే తయారయ్యే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రై ప్రూట్స్‌ను మిళితం చేసి మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తయారు చేస్తే 1112 గంటలకల్లా అయిపోతుంది. పెనుగొండ కజ్జికాయకు అంతటి డిమాండ్ మరి. వీరికి పెనుగొండతో పాటు తణుకులో మరో స్వీట్ షాపు ఉంది. నేటికీ తగ్గని క్రేజ్ పెనుగొండ కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పెనుగొండ కజ్జికాయను తీసుకు వెళుతుంటారు. సిఫార్సులు చేయించుకోవడానికి, బంధువులకు ఇచ్చుకోవడానికి పెనుగొండ కజ్జికాయ బహుమతిగానే ఉంటుంది. 40 సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. నేటికీ క్రేజ్ తగ్గలేదు. వి.కోటిలింగాలు, పెనుగొండ -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్‌వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్‌వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్‌వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్‌వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు.