
వారసుడిని చూడకుండానే
పెనుగొండ రూరల్ (పశ్చిమగోదావరి జిల్లా), విశాఖ: వారసుడు పుట్టాడనే ఆనందంతో బయల్దేరిన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఐదు రోజుల క్రితం జన్మించిన కుమారుడిని చూసేందుకు తహతహతో బయల్దేరిన తండ్రి, వారసుడిని చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్న తాత, నానమ్మ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలో ఉంటున్న చల్లా గంగునాయుడు(55), చల్లా పార్వతమ్మ(50) దంపతులు, వారి కుమారుడు చల్లా అరుణకుమార్(30) అక్కడిక్కడే మృతి చెందారు.
వీరు డెంకాడ గ్రామానికి చెందిన వారు. ప్రమాదంలో అరుణకుమార్ చెల్లెలు చల్లా సునీత, స్నేహితుడు యు.చలపతికు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అరుణకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతూ ఓవర్ టేక్ చేసే సమయంలోగానీ, కునుకు పట్టడంతోగానీ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సునీత, చలపతిని తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రమాదం వేకువజాము 4, 5 గంటల మధ్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారు కావడంతో ఇక్కడ జన సంచారం లేదు. అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సమాచారం అందించడంతో పెనుగొండ ఎస్‌ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఏడాది క్రితమే వివాహం
విశాఖపట్నానికి చెందిన చల్లా అరుణకుమార్‌కు ఏడాది క్రితం నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన అరుసుమిల్లి కూర్మారావు రెండో కుమార్తె నళినితో వివాహమైంది. ఆమె ఐదు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కుమారుడు పుట్టాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో అందరికీ వెసులుబాటు ఉంటుందని కుమారుడిని చూడడానికి తల్లి, తండ్రి, చెల్లి, స్నేహితుడితో కారులో తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివాహమైన ఏడాదిలోనే అల్లుడిని కోల్పోయామంటూ కూర్మారావు కన్నీరుమున్నీరయ్యారు. పచ్చి బాలింతరాలైన కుమార్తెకు అల్లుడి మరణ వార్త ఎలా చెప్పాలంటూ విలవిల్లాడారు.
ఉద్యోగంలో చేరకుండానే
అరుణకుమార్ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ వద్ద విశాఖపట్నంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అతని తండ్రి గంగునాయుడు కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో అరుణకుమార్‌కు కేజీహెచ్‌లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం మాసేశాడు. ఈ లోపునే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ ప్రమాదంలో కాళ్లు, మరో ప్రమాదంలో ప్రాణాలు
చల్లా గంగునాయుడు జీవితం ప్రమాదాలతోనే గడిచిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఐదేళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కర్రల ఊతంతో మాత్రమే కదలగలడు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొడుకును ఉద్యోగంలో చేర్చాలని ఆశపడ్డారు. ఎట్టకేలకు కుమారుడికి కారుణ్య నియామకం కింద అనుమతులు వచ్చిన తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలన్న ఆశ తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వారసుడైన మనుమడిని కూడా చూడకుండానే వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలిసి లా సన్స్‌బే కాలనీవాసులు మృతుల ఇంటి పనివారు కృష్ణ, వరలమ్మ విషాదంలో మునిగిపోయారు.