లారీని ఢీకొన్న కారు.. చెన్నై–తిరుపతి
జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు ఏపీ విద్యార్థులు, ఓ తమిళనాడు విద్యార్థి మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
పళ్లిపట్టు: చెన్నై– తిరుపతి జాతీయ రహదారిలోని తిరుత్తణికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండగా...తమిళనాడుకు చెందిన మరో విద్యార్థి ఉన్నాడు. కనకమ్మ సత్రం సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో చెన్నై వైపుగా అతివేగంగా దూసుకెళ్లిన వెర్టిగో కారు మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న సరుకుల లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఏడుగురు యువకులు ఉండగా ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాలలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ ఇద్దరిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారులో లభించిన ఓ గుర్తింపు కార్డు ఆధారంగా మరణించిన వారు చెన్నై శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిసింది.
ఆదివారం సెలవు కావడంతో తిరువణ్ణామలై, కాణిపాకం ఆలయాల దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. మృతి చెందిన వారిలో చేతన్ (21), యుగేష్ (21) తిరుపతికి చెందిన వారుగా భావిస్తున్నారు. మిగిలిన వారిలో నితీష్ (21), నితీ‹Ùవర్మ(21), రామ్‌గోపాలన్ (21)గా గుర్తించారు. వీరిలో రామగోపాలన్ తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన యువకుడు అని తేలింది.
గాయపడ్డ ఇద్దరిని తిరుపతి జిల్లా గూడూరు న్యూ బాలాజీ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ కుమారుడు విష్ణువర్దన్ (21), ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొల్లూరి చైతన్య కుమార్ (21)గా గుర్తించారు. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో భవిష్యత్ ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment